Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 22 వ.అధ్యాయము

$
0
0
                          
                              
                                
 30.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

      
శ్రీవిష్ణుసహస్రనామం 55వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:    జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః  |

            అంభోనిది రనంతాత్మా మహోదధి శయో అంతకః   ||

తాత్పర్యం :  పరమాత్మను జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, సాక్షిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను బిందువులతో కూడిన మహా సముద్రముగా అట్టి మహా సముద్రమునందు అనంతముగా శయనించి యుండువానిగా, మరల అట్టి సముద్రమే భౌతిక జీవులకు లయస్థానముగా ధ్యానము చేయుము.



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
22 వ.అధ్యాయము

                                      25.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులను విషజంతువుల బారినుండి కాపాడిన సంఘటనలు వివరించబడినవి.  మరి మనిషికి నిలువెల్ల విషమే కదా - అటువంటి మనుషులనుండి కూడ తన భక్తులను అనేకసార్లు కాపాడినారు శ్రీసాయి.  



ఈ అధ్యాయము ఆఖరిలో శ్రీసాయి అంటారు "అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను.  దేవుడందరిని రక్షించువాడు" అని మానవాళికి సందేశము యిచ్చినారు.  ఈ సందేశమును ప్రతిసాయి భక్తుడు అర్ధము చేసుకొని సుఖప్రదమైన జీవితము గడపాలని నాకోరిక.  ఈ ఉత్తరములో శ్రీసాయి, ద్వారకామాయిని మశీదు తల్లి" అని పిలవటము గురించి మరియు మశీదు తల్లితో నా అనుభవాలు వ్రాస్తాను.  1991 డిశంబరులో శిరిడీకి వెళ్ళినాను.  ఆసమయములో తెల్లవారుజామున ఉదయము ఆరతి ద్వారకామాయిలో చదివినాను.  ఆరతి చదివిన తర్వాత శ్రీసాయికి నైవేద్యము పెట్టడానికి జేబులోని పంచదార పొట్లము గురించి వెతికినాను.  పొట్లము దొరకలేదు.  శ్రీసాయికి పంచదార నైవేద్యము పెట్టలేకపోతున్నాననే బాధ నాలో ఎక్కువ కాసాగినది.  ఏమి చేయాలి? వెనక్కి హోటల్ కి వెళ్ళి కొంచము పంచదార తెచ్చి శ్రీసాయికి నైవేద్యము పెట్టాలా లేకపోతే నైవేద్యము పెట్టలేకపోతున్నందులకు శ్రీసాయిని క్షమాపణ కోరాలా! అనే ఆలోచనలతో సతమమగుతుంటే - ఒక 60 సంవత్సరాల ముసలి స్త్రీ ఒక డబ్బా నిండ పంచదార తెచ్చి అందులోని కొంచము పంచదార శ్రీసాయికి నైవేద్యము పెడుతున్నది.  నాలో తెలియని ఆనందము కలిగినది.  ద్వారాకామాయిలో తన భక్తులను ఎట్టి పరిస్థితిలోను శ్రీసాయి నిరుత్సాహము పరచరు.  భక్తుల సమస్యలను శ్రీసాయి తన సమస్యలగా భావించి వారే పరిష్కార మార్గము తన భక్తులకు చూపించుతారు అని భావించి, నేను ఆ స్త్రీని కొంచము పంచదార యివ్వమని కోరినాను.  ఆమె సంతోషముగా ఒక చెంచా పంచదార కాగితములో యిచ్చినది.  ద్వారకామాయి (మశీదు) లో శ్రీసాయి (స్త్రీ రూపము అంటే తల్లి రూపములో) నా సమస్యకు పరిష్కారము చూపించటానికి తల్లి రూపములో దర్శనము యిచ్చినారు.  అందుచేత శ్రీసాయియే ద్వారకామాయి అంటే మశీదు తల్లి అని గుర్తించుకో.  నేను నీకు 9వ.అధ్యామునకు సంబంధించి 9వ.ఉత్తరములో భిక్ష గురించి ఆవశ్యకతలో నేను ఏపరిస్థితిలో రోజూ శ్రీసాయి యొక్క భిక్ష జోలిలో పిడికెడు బియ్యము వేస్తున్నది వాటి వివరాలు నీకు వ్రాసినాను.  ఆవిధముగా రోజు పిడికెడు బియ్యము శ్రీసాయి జోలిలో వేయటానికి శ్రీసాయి నాకు కలలో మశీదును, ఆమశీదు ప్రక్క నిలబడిన నామాతృమూర్తి అంటే నాతల్లిని చూపి, మశీదు తల్ల్లియొక్క ప్రాముఖ్యమును నాకు గుర్తు చేసినారు.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి అంటారు "భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు"  ఈ సత్యాన్ని ప్రతిసాయి భక్తుడు గ్రహించి సాయి మార్గములో ప్రయాణము చేయాలి.  నేను ఈ మార్గములో ప్రయాణము చేయాలి అనే తపనతోనే నోరు లేని జీవులకు వేసంగిలో దాహము బాధ తీర్చడానికి యింటి బయట నీళ్ళ తొట్టి పెట్టినాను.  నా తర్వాత నీవు కూడా ఈమార్గములో ప్రయాణించుతు ఆనోరులేని జీవాల దాహము తీర్చడానికి ప్రయత్నించు.  శ్రీసాయి అనుగ్రహాన్ని పొందు.  అపుడు నీవు నిజమైన సాయి భక్తుడివి అగుతావు.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 23వ. అధ్యాయము

$
0
0

              
                                                          
 04.04.2013 గురువారము
ఓం సయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
శ్రీ విష్ణుసహస్రనామం 56 వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం;  అజో మహార్హ స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః  |

             ఆనందో నందనో నంద్స్సత్య ధర్మాత్రివిక్రమః    ||

తాత్పర్యం:  నారాయణుని జన్మలకతీతునిగా, గొప్ప అర్హునిగా, స్వభావముగా, అమిత్రులను జయించువానిగా, తృప్తికి కారణమైనవానిగా, ఆనందముగా, తానే సంతోషము కలిగించువానిగా, తనంతటతానే సతోషపడువానిగా, సత్యమే తన ధర్మమైనవానిగా, మూడడుగులలో సమస్తమును ఆక్రమించువానిగా  ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
23వ. అధ్యాయము

                                                                           26.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి యొక్క లీలకు గురించి నీకు ఎక్కువగా వ్రాయలేను.  కాని, నా మనస్సులో ఉన్న ఆలోచనలను నీముందు ఉంచుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో యిలాగ అంటారు, "నేను భగవంతుడను" అని వారెన్నడు అనలేదు.  భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు.  భగవంతుని ఎల్లపుడు తలచువారు. 



 హేమాద్రి పంతు ఈవిధముగా శ్రీ సాయిని గురించి వ్రాయడము ఏమిటో! శ్రీసాయి సాక్షాత్తు భగవంతుని అవతారము కదా, అని నీవు నేను అంటాము.  యిక్కడ బాబాయొక్క గొప్పతనమును మనము గుర్తించాలి.  శ్రీసాయి బ్రహ్మ జ్ఞాని, సాక్షాత్తు భగవంతుడే.  తను భగవంతుడు యొక్క అవతారమైనా, మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఏవిధముగా బ్రతకాలి అనేది తన తోటి మానవులకు తెలియచేయటానికి  మరియు మానవులలో అహంకార రహితమైన జీవితము ఏవిధముగా ఉండాలి అని తెలియచేయడానికి శ్రీసాయి ఎన్నడు తాను భగవంతుడిని అని అనలేదు.  వారు భగవంతుని విధేయ సేవకుడిని అని మాత్రము అనేవారు,  గుర్తుంచుకో.  శ్రీసాయి అంటారు, "నానా ! ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొనే శక్తి కలదో వారే దానిని తినవలెను"  ఈ విషయముపై నా ఆలోచనలు నీకు తెలియ చేస్తాను విను.- జీవితమును మనము ఒక ఉల్లిపాయతో పోల్చవచ్చును.  ఉల్లిపాయ మీద ఉన్న పొరలును ఒక్కొక్కటే తీసి వేస్తు వెళ్ళు.  ఆఖరులో నీకు రుచికరమైన తియ్యటి (ఘాటులేని) ఉల్లి దొరుకుతుంది తనటానికి.  జీవితము అనే ఉల్లి మీద ఉన్న పొరలే అరిషడ్ వర్గాలు.  నీవు ఆ అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగించుకొని జీవించు అని తన భక్తునికి సందేశము యిచ్చినారు.  మరి శ్రీసాయి అరిషడ్ వర్గాలు అనే పొరలు కలిగిన ఉల్లిపాయను కూడా తినివేసి వాటి నామ రూపాలు లేకుండ జీర్ణించుకొనే శక్తి కలిగినవారు అని మనము గుర్తించాలి.  మన పెద్దలు చెప్పిన సామెత గుర్తు ఉందా - "ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు"  కాని, యిక్కడ చిన్న వివరణ చేస్తాను "అరిషడ్ స్వర్గాలు అనే పొరలును తల్లి శ్రీసాయి తీసివేసి ఆ ఉల్లిని తన పిల్లలకు పెట్టి ఆపిల్లలకు మేలు చేస్తుంది ఆతల్లి (శ్రీ సాయిమాత).   ఆనాటి సమాజములో ఉన్న చాదస్తాలను శ్రీసాయి వ్యతిరేకించినారు.  ఆవిధముగా వారిలోని అజ్ఞానమును తొలగించి వారిలో జ్ఞానమును కలిగించినారు.  ఈ విషయములో శ్రీహేమాద్రిపంతు రెండు ఉదాహరణలు సాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  1. కలరా వ్యాపించి యున్న సమయములో కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయరాదు. 2. గ్రామములో మేకను కోయరాదు.  ఈ రెండిటిని శ్రీసాయి ధిక్కరించి చాదస్తాలను నిర్మూలించినారు.

మూఢ నమ్మకాలు, చాదస్తాలు అంటే శ్రీసాయికి కిట్టవు అని చెప్పినాను కదా.  మూఢ నమ్మకాలు విషయము ఆలోచించుదాము.  1947 సంవత్సరములో శ్రీదయాభాయి దామోదర్ దాస్ మెహతా బొంబాయి నివాసి టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతున్నపుడు అతను తన మిత్రుల మాటపై ఎవరో మంత్రగాడు యిచ్చిన తావీదు మెడలో కట్టుకొన్నాడు. జ్వరము తగ్గడము బదులు దుష్ఠశక్తులు అతనిని పీడిస్తున్నాయి అనే భావన కలిగినది.  రాత్రివేళ జ్వర తీవ్రత ఎక్కువగా ఉంది.  అతను శ్రీసాయి రక్షణ కోరుతాడు.  శ్రీసాయిని మనసార  పిలుస్తాడు.  అటువంటపుడు అతని మంచము ప్రక్కన యున్న శ్రీసాయిబాబా పటమునుండి వినబడిన మాటలు "ఎందులకు భయపడుతావు.  నేను ఉదయమునుండి నీరక్షణకోసము కఱ్ఱ చేతిలో పెట్టుకొని నీమంచము దగ్గర నిలబడినానే మరి యింకా ఆమెడలో తావీదు దేనికి, దానిని వెంటనే తీసి పారవేయి" శ్రీ మెహతా ఆవిధముగా చేసినారు.  ఆతరువాత శిరిడీకి వెళ్ళి శ్రీసాయి సమాధికి నమస్కారము చేసి పూర్తి ఆరోగ్యము పొందినారు.  దీనిని బట్టి శ్రీసాయి భక్తులు గ్రహించవలసినది ఏమిటి మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు దూరముగా ఉండాలి అనే విషయము.  నీ జీవితములో ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చిన శ్రీసాయి వెలిగించిన ధునిలోని విభూతిని శ్రీసాయిపై నమ్మకముతో నుదుట పెట్టుకొని కొంత విభూతిని ఔషధముగా నీళ్ళలో కలపి త్రాగి, మానసిక బాధలు శారీరిక బాధలు తొలగించుకో.

శ్రీసాయి సేవలో
నీ తండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 24వ. అధ్యాయము

$
0
0
             
      
          
05.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

       
శ్రీవిష్ణుసహస్ర నామాం 57వ.శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:        మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞోమేదినీపతిః     |

               త్రిపద స్త్రి దశాధ్యక్షో మహాశృగః కృతాంతకృత్  ||

తాత్పర్యం:  పరమాత్మను గొప్ప ఋషిగా, కపిలుడను గురువుగా ధ్యానము చేయుము.  చేసిన మేలు మరువని వానిగా, భూమికధిపతిగా, సృష్టిని మూడు అడుగులతో కొలుచువానిగా, దేవతలకధిపతిగా, గొప్ప శిఖరముగా, జీవులు చేసిన కర్మను తనయందు లయము చేయువానిగా ధ్యానము చేయుము.    


05.04.2013 శుక్రవారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

24వ. అధ్యాయము
                                                                                                     27.01.1992

ప్రియమైన చక్రపాణి,

జీవితము కష్ట సుఖాలమయము. సుఖములో ఒక చిన్న భాగము హాస్యము.  శ్రీసాయి తన భక్తులకు ఏదైన కొత్త విషయాలు తెలియచేయదలచుకొన్నపుడు సందర్భానుసారము చెప్పేవారు.  అలాగ చెప్పటములో అవసరము వచ్చినపుడు హాస్య పధ్ధతిని కూడా అనుసరించేవారు.  యితరులకు పెట్టకుండ మనము తినరాదు అనే విషయమును హాస్య పధ్ధతిలో హేమాద్రిపంతుకు చెబుతారు శ్రీసాయి.  శ్రీసాయి తన భక్తులకు చక్కని సందేశము యిచ్చినారు.  అది "నీవు తినుటకుముందు నన్ను స్మరింతువా?  నేనెల్లపుడు నీచెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా"? ఈ సందేశమును అర్ధము చేసుకొని నీవు తినే భోజనమును, నీవు త్రాగే నీరును కూడా శ్రీసాయికి మనసులో అర్పించి సేవించు.  నీజీవితము ధన్యము చేసుకో.  ఇదే విధముగా నీలోని అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము పామువలె బుసలు కొడుతుంటే ఆపని చేసేముందు శ్రీసాయిని ఒక్క నిమిషము ధ్యానించు. శ్రీసాయి నిన్ను సవ్యమైన మార్గములో నడిపించుతారు.  నీతోటి సాయి భక్తుడు శ్రీసాయిని పూజించే విధమునకు నీవు పూజించే విధానానికి తేడా యుండవచ్చును.  అది నీకు అనవసరము.  నీపద్దతి నీది.  వాని పధ్ధతి వానిది.  నీవు ఆవిషయములో జోక్యము చేసుకోవద్దు.

ప్రతి గురువారము శ్రీసాయిగుడికి వెళ్ళి అక్కడ హారతిలో పాల్గొంటే సరిపోదు.  శ్రీసాయిని ప్రతి జీవిలోను చూడాలి.  ఆయన నామము అనుక్షణము స్మరించాలి.  ఆయన నడచిన బాటలో నడవటానికి ప్రయత్నించాలి.  అలాగ అని సంసారము వదలి సన్యాసము తీసుకొమ్మని కాదు.  జీవితములో నీవు పూర్తి చేయవలసిన బరువు బాధ్యతలు శ్రీసాయి నామస్మరణ సహాయముతో పూర్తి చేసుకొని ఆయన ప్రేమకు పాత్రుడివి కావాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 25వ. అధ్యాయము

$
0
0
       
         
06.04.2013 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్ర నామం 58వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  మహా వరాహో గోవిందస్సుషేణః కనకాంగదీ  |

             గుహ్యో గభీరో గహనో గుప్రశ్చక్రగదాధరః   ||

తాత్పర్యం:  పరమాత్మను చక్రము, గద హస్తములలో ధరించిన వరాహముగా, గొప్ప సేనను వెంబడించుచున్నవానిగా, బంగారు ఆభరణములు ధరించి, గంభీరమై, గుప్తమై గ్రహించుటకు సాధ్యముకాని వానిగా, యింద్రియములందలి ప్రజ్ఞగా ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
25వ. అధ్యాయము

                                                         28.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి తన భక్తుల భవిష్యత్ ను ఆలోచించి, యిచ్చిన సలహాల గురించి హేమాద్రిపంతు వివరించుతారు.  శ్రీహేమాద్రిపంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే, బాబా వెంటనే అతని చేత వ్రాయించెను.  శ్రీసాయితో నా అనుభవాలను ఈవిధమైన ఉత్తరాలు ద్వారా నీకు తెలియ చేయాలని కోరిక జనించగానే బాబా వెంటనే నాకు అనుమతిని ప్రసాదించలేదు.  నీకు ఈ ఉత్తరాలు 06.01.92 తేదీనుండి వ్రాయడము మొదలుపెట్టిన తర్వాత శ్రీసాయి 22.1.92 నాడు అనుమతిని ప్రసాదించినారు.  ఈ విషయాన్ని నీకు నావెనకటి ఉత్తరములో వ్రాసినాను.  ఒకసారి దాము అన్నా, తను ప్రారంభించబోయే వ్యాపారములో శ్రీసాయి ఆశీర్వచనాలు పలికిన, ఆవ్యాపారములో వచ్చే లాభాలనుండి కొంత పాలు ఇవ్వడానికి సిధ్ధపడినపుడు శ్రీసాయి అన్న మాటలు "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు".  కొంచము విడమర్చి చెప్పాలంటే శ్రీసాయికి లంచము తీసుకోవటము యిష్టము లేదు.  మరి శ్రీసాయికి యిష్టము కాని పనులు శ్రీసాయి భక్తులు కూడా చేయరాదు అనే విషయము మనము ఎల్లపుడు జ్ఞాపకము ఉంచుకోవాలి.

శ్రీసాయి మహాసమాధికి ముందు అన్న మాటలు గుర్తు చేసుకో.  "నేను సమాధి చెందినప్పటికి  నాసమాధినుంచి నాఎముకలు మాట్లాడును.  అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును.  నేనే కాక నాసమాధి కూడా మాట్లాడును, కదులును.  మనస్పూర్తిగా శరణు జొచ్చినవారితో మాట్లాడును.  నేను మీవద్దనుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు.  నాఎముకలు మాట్లాడుచు మీక్షేమమును కనుగొనుచుండును.  ఎల్లపుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు.  నాయందే మనఃపూర్వకముగను, హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు.  అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు". యివి భగవంతుడు స్వయముగా తన భక్తులతో అన్నమాటలు.  నీవు కూడా ఆభగవంతుని (శ్రీసాయి) భక్తుడువి.  ఎల్లపుడు ఈమాటలను  జ్ఞాపకము చేసుకొంటు యుండు.  అవినీకు కొండంత బలాన్ని యిస్తుంది.  ధైర్యముగా జీవితములో ముందడుగు వేయి.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 26వ. అధ్యాయము

$
0
0
  
    
       
         
07.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
శ్రీ విష్ణుసహస్రనామం 59వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:            వేధాస్స్వాంగో జితః కృష్ణో ఢృఢస్సంకర్షణొచ్యుతః           |

                    వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షోమహామనాః           ||

తాత్పర్యం:  పరమాత్మను సృష్టికర్తగా మరియూ శరీరములు, రూపములు, తనలోని భాగములుగా, వ్యక్తమైనట్టి తండ్రిగా ధ్యానము చేయుము.  మనసుకు యింద్రియములకు అందని గొప్ప చిత్రమయిన చీకటి యను అంతర్యామిగా, తనయందు జీవించుచు మరల తనలోనికి స్వీకరింపబడు దేహములుగా, జారిపడు వానిగా, నీటికధిపతియైన వరుణునిగా, మరియూ ఆయన కుమారుడైన భృగువుగా, విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా, పద్మమునందలి దళములుగా, అందరి యందలి ఒక్కటిగా నున్న మనస్సుగా ధ్యానము చేయుము.      


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

26వ. అధ్యాయము
                                                   29.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈఉత్తరములో శ్రీసాయిని మానసికముగా ఏవిధముగా పూజించాలి అనేది శ్రీహేమాద్రిపంతు ఆంతరిక పూజా విధానములో వర్ణించినారు.  నిజముగా ఆవిధముగా పూజించాలి అనే తలంపు రాగానే మనసు సంతోషముతో నిండిపోతుంది.  నీవు ఎవరి పాదాలకైనా నమస్కరించు సమయములో శ్రీసాయిని మనసార తలచుకొని అవతలి వ్యక్తిలో శ్రీసాయిని చూస్తూ నమస్కారము చేయి.  ఆ అనుభూతిని, సంతోషాన్ని అనుభవించు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి తనతోటి యోగి యొక్క శిష్యుని చూచి పలికిన పలుకులు ఎంత గంభీరమైనవి.  "ఏమైనను కానిండు, పట్టు విడవరాదు.  నీగురునియందే యాశ్రయము నిలుపుము, ఎల్లపుడు నిలకడగానుండుము.  ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము.  మన అదృష్టము వలన మనము వారి పాదాలను నమ్ముకొన్నాము.  మన సంతోషానికి మనమనసులే సాక్షి.  శ్రీసాయి తనతోటి యోగీశ్వరులను సదా గౌరవించేవారు.  వారి సాంప్రదాయమును మనము గౌరవించాలి.  శ్రీసాయి ఆలోచనలలో ఆత్మహత్య మహాపాపము.  ఆవిషయములో శ్రీసాయి స్వయముగా ఏవిధముగా తన భక్తుడు గోపాలనారాయణ అంబాడేకర్ ను రక్షించినది శ్రీహేమాద్రిపంతు వివరించినారు.  చదివి అర్ధము చేసుకో.  జీవితములో కష్టాలు అనేవి ప్రతి మానవుడికి వస్తాయి.  వాటికి ఆత్మహత్య పరిష్కారము కాదు అంటారు శ్రీసాయి.  "కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక" అంటారు శ్రీహేమాద్రిపన్తు.  మరి నేను కోరుకొనేది నీవు కూడా శ్రీసాయి భక్తుడుగా మారాలని -  నాకోరిక తీర్చుతావు కదూ.

నీతండ్రి


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము

$
0
0
                   
                         
                              
08.04.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

          
శ్రీ విష్ణుసహస్రనామం 60 వ.శ్లోకం, తాత్పరయం

శ్లోకం :    భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః         |

              ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతి సత్తమః            ||

తాత్పర్యం:  పరమాత్మ శక్తులను, మహిమలను గలవాడు.  చీకటిని నశింపచేయువాడు.  ఆనందము కలుగ చేయువాడు.  వన పుష్పములచే చేయబడిన మాలను ధరించినవాడు.  అదితి యొక్క కుమారుడు.  నాగలిని ధరించినవాడు.  మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టి నంతటిని భరించి సహించువాడు.  సన్మార్గమున నడచువారిలో అత్యంత ముఖ్యుడైనవాడు.  


శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము
                                                 30.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి ఏనాడు ఏ పుస్తకము చదవలేదు.  కాని, తన భక్తులచేత ఆధ్యాత్మిక రంగములో ముఖ్యమైన పుస్తకాలను తనే స్వయముగా చేతితో పట్టుకొని, ఆభక్తులను ఆశీర్వదించి, వారి చేత ఆపుస్తకాలను చదివించెను.  ఆయన తన హిందూ భక్తుల చేత చదివించిన ముఖ్య పుస్తకాలలో 1. గురుచరిత్ర 2. విష్ణుసహస్ర నామము 3. గీతా రహస్యము అనేవి ముఖ్యమైనవి.  మానవుని ఆధ్యాత్మిక రంగ అభివృధ్ధికి పుస్తక పఠనము కూడా చాలా అవసరము అని శ్రీసాయి ఈవిధముగా తెలియచేసినారు.  సాయి భక్తులు ఈ పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయాలని కోరుతున్నారు.  ఈ పుస్తకాల వ్యవహారములో రామదాసికి మరియు శ్యామాకు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీసాయి ఇలాగ అంటారు.  "ధనము యిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు".  ఈవిషయము నాజీవితములో అనుక్షణము జ్ఞప్తికి వస్తుంది.  ధనము ఉంది అనే అహంకారముతో నీవు ఏవష్తువునైన కొనగలవు.  కాని మనుష్యులను కొనలేవు.  అవసరమువచ్చినపుడు మంచి పనుల నిమిత్తము ధనము విరివిగా ఖర్చు పెట్టు, వెనకాడవద్దు.  ప్రతి విషయానికి ధనానికి లంకె పెట్టవద్దు.  ఎవరికైన ధన సహాయము  మరియు మర్యాద చేయవలసివచ్చినపుడు ప్రేమతో చేయి.  డబ్బు గురించి ఆలోచించుతు మనుషులను దూరంగా ఉంచకు.  ధనము ఖర్చు ఆగిపోతుంది అనే భావనతో నీబాధ్యతను నీవు చేయకపోతే భగవంతుడు ఏదో విధముగా ఆపని పూర్తి చేయించుతాడు.

ఆతర్వాత జీవించినంత కాలము ఆపని చేయలేదు అనే అసంతృప్తి నీకు మిగులుతుంది మరియు లోకులు వేసే నింద మిగులుతుంది.  ఈ విషయములో నాజీవితములో జరిగిన రెండు ఉదాహరణలు వ్రాస్తాను.  నాపినతల్లి భర్త నాతండ్రి దగ్గరనుండి ఏమీ ఆశించకుండానే నన్ను నా చిన్నతనములో తన యింట ఒక పది సంవత్సరాలు ఉంచు కొని నాకు విద్యాబుధ్ధులు నేర్పినారు.  నా ఈ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము నేను నాపినతల్లి భర్తను మరచిపోలేను.  నేను సదా వారికి కృతజ్ఞుడిని. యింక నా జీవితములో ప్రవేసించిన యింకొక వ్యక్తి నామావగారు అంటే నీ తల్లియొక్క తండ్రి.  నేను ఆయన దగ్గరనుండి ధన సహాయము కోరుతాననే భయముతో ఆయన నానుండి తప్పించుకొని తిరుగుతు ఎదుట పడినపుడు నన్ను అవమానించుట వలన నేను జీవించినంత కాలము వారిని మరచిపోలేను.  మొదటి వ్యక్తిని చూచినపుడు, తలచినపుడు. తలను గౌరవము, భక్తి భావనతో క్రిందకు దించుతాను.  మరి రెండవ వ్యక్తి విషయములో గౌరవము, భక్తిలను ప్రదర్శించలేను.  అందుచేత జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము కాదు అనే విషయాన్ని మరచిపోవద్దు.  శ్రీమతి ఖాపర్దే విషయములో శ్రీసాయి ఆమె భక్తికి మెచ్చి ఆమె గత జన్మల వివరాలను మనలకు తెలియపర్చుతారు.  మానవుడు మంచి పనులు చేయటము మన జన్మజన్మలలో ఏవిధముగా అభివృధ్ధి చెందుతాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును.  మనము కూడా శ్రీసాయి ఆశీర్వచనములలో మంచి పనులు చేస్తు మంచి జన్మము పొందుదాము.
 

శ్రీ సాయి సేవలో
నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28వ. అధ్యాయము

$
0
0

                   

                    

09.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్ర నామం 61వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోక      సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణ ప్రదః                    |

             దువస్సృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః        ||

తాత్పర్యం:  గొప్ప విలుకాడు, విరిగిన గొడ్డలిని ధరించి భయంకరముగా నున్ననూ, సంపద లిచ్చువాడుగా నున్నాడు. ఆయన రూపము ఆకాశమంతయూ వ్యాపించి సమస్తము చూచుచున్నది.  వేదవ్యాసుడు వాక్కునకు, భాషకు అధిపతియై భగవంతుని అవతారమగుటచే స్త్రీ గర్భమందు పుట్టనివాడై యున్నాడు.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

28వ. అధ్యాయము

                              
                                         31.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో నీకు 28వ. అధ్యాయముపై వివరణ యిస్తాను.  శ్రీసాయి ఏవిధముగా తన భక్తులను శిరిడీకి పిలిపించుకొన్నది వివరించుతారు శ్రీహేమద్రిపంతు.  ముఖ్యముగా శ్రీలాలా లక్ష్మీ చందును,  బరహంపూర్ లొని ఒక భక్తురాలిని శిరిడీకి రప్పించుకొన్న వైనము పరిశీలిస్తే చాలా ఆశ్చర్యము కలుగుతుంది.  శ్రీసాయిని గురించి తెలియని వ్యక్తులకు శ్రీసాయి స్వప్న దర్శనము ఇచ్చి వారిని శిరిడీకి రప్పించుకొన్నారు. దీనిని బట్టి మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి?  ఆలోచించు.  నీవే శ్రీసాయి భక్తుడువి కాకాపోయిన వెనుకటి జన్మలో నీకు శ్రీసాయికి సంబంధము ఉంటే చాలు, శ్రీసాయి ఈ జన్మలో నీకు స్వప్నములో కనిపించి నిన్ను శిరిడీకి రప్పించుకొంటారు.  దీనిని శ్రీసాయి ప్రత్యేకత లేదా గొప్పతనము అని కూడా అనవచ్చును.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయియొక్క అభిప్రాయమును శ్రీహేమాద్రిపంతు ఈ విధముగా తెలియపర్చుతారు.  "పండుగదినము గడుపుటకుగాని, తీర్ధయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదు అనేది బాబా అభిప్రాయము".  ఇది మనబోటి సామాన్య కుటుంబీకులకు చాలా ముఖ్య విషయము.  అప్పుచేసి పూజ పునస్కారాలు, దానాలు ధర్మాలు చేయరాదు.  నాసంపాదనలో కొంత శాతము వీటి నిమిత్తము విడిగా పెట్టి ఆ డబ్బుతోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినాను.  నీవు కూడా ఈవిధానాన్ని పాటించిననాడు నీకు చికాకులు ఉండవు.  శ్రీసాయి తన ప్రియ భక్తులను పిచ్చుకతో పోల్చేవారు.  వారు తమ భక్తులను పిచ్చుక కాలికి దారముకట్టి లాగినట్లుగా శిరిడీకి రప్పించుకుందును అని చెప్పినారు.

శ్రీసాయికి ఉన్నప్రియ భక్తులలో ముఖ్యుడు మేఘశ్యాముడు.  అతని గురించి హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో వివరించినాడు.  ఆనాడు నేను మేఘశ్యాముడిని చూడలేదు.  కాని మేఘుని గురించి చదువుతుంటే నేనుకూడా మేఘశ్యాముడులాగ శ్రీసాయికి ప్రియభక్తుడిని కాగలనా లేదా అనే ఆలోచనలలో మునిగిపోతు ఉంటాను.  నిజమైనసాయి భక్తుడు కోరుకొనే కోరిక ఒక్కటే అది, శ్రీసాయి పాదాలమీద ఆఖరి శ్వాస తీసుకొని, శ్రీసాయి చేతుల మీదుగా పంచ భూతాలలో కలసిపోవాలి.  ఈఅదృష్టము మేఘశ్యామునికి లభించినది.  అటువంటి అదృష్టము కొరకు మనము    కూడా ప్రయత్నము చేయాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
ద్వారకామాయి గీత్ మాలాలో ఆనాటి మధురగీతాలను చూడండి..
http://www.facebook.com/dwarakamai?ref=hl
షిరిడీ సాయి దర్బార్...
http://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 28 వ.అధ్యాయము

$
0
0
   
     
               
                   

10.04.2013 బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులందరకి   శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు
      

        
శ్రీవిష్ణుసహస్రనామం 62వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్        |

             సన్యాస కృచ్చమశ్శన్ తో నిష్ఠాశ్శాంతిః పరాయణం    ||

తాత్పర్యం:  మూడు స్థాయిలలో గానము చేయబడు సోమము అను యజ్ఞము నారాయణునియొక్క రూపము.  పరమాత్మయే ఆ గానమందలి విషయము.  బృదములచే ఆలపింపబడు గానమునందు లీనమగుటచే నారాయణుని సాన్నిధ్యము కలుగును.  ఆయన నిర్వాణము, చికిత్స మరియు చికిత్సకుడు.  ఆయన జీవులను,  సన్యాస మార్గమున నడిపించుచు ఉద్రేకములను సం యనమువలన ఉపశమింపచేసి, తన ప్రశాంతత అనుభవములో కూడిన సాన్నిధ్యమును అనుగ్రహించుచున్నాడు.  దీక్ష మరియు మార్గమున కంకితమగుట అను తన లక్షణములచే నిరంతరము జీవులను శాంతియుతులుగా చేయుచున్నాడు.   


 పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  
28 వ.అధ్యాయము

                                                             01.02.1992

ప్రియమైన చక్రపాణి,
ఈ ఉత్తరములో అనాటి సాయి భక్తుల అనుభవాలను వివరించుతాను.  మద్రాసు భజన సమాజము శిరిడీకి వచ్చి శ్రీసాయి సన్నిధిలో భజన చేసినట్లు, వారి అనుభవాలను హేమాద్రిపంతు వివరించినారు.  


 
ఆసమాజములోని సభ్యుల పేర్లు తెలపలేదు.  కొంతమంది శ్రీసాయి భక్తులు మద్రాసులో వారి వివరాలు సేకరించినారు.  ఆ భజన సమాజములోని పెద్ద వ్యక్తి పేరు శ్రీగోవిందస్వామి మరియు ఆయన భార్య పేరు శ్రీమతి ఆదిలక్ష్మి.  శ్రీగోవిందస్వామి మద్రాసులోని ట్రాం కంపెనీలో పని చేస్తూ ఉండేవారు.  ఆ రోజులలో మద్రాసునుండి శిరిడీకి వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని రైలులో ప్రయాణాలు సాగించుతు భక్తులు శిరిడీకి చేరుకొనేవారు.  దీని వలన మనము గ్రహించవలసిన విషయము ఏమిటి అని ఆలోచించు.  శ్రీసాయి అనుగ్రహము లేకుండ ఎవరు శిరిడీకి చేరలేకపోయేవారు.  శ్రీసాయి సత్ చరిత్రలో హిందువులు, మహమ్మదీయ దేవతలను పూజించు సంఘటనలు వివరించబడినవి.  ఆనాడు అంటే 1918 సంవత్సర ప్రాంతములో హిందువులు, మహమ్మదీయులు చాలా స్నేహముతో కలసి మెలసి యుండేవారు.  కాని ఈనాడు చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుటవలన హిందూ, మహమ్మదీయుల మధ్య స్నేహము కరువు అయిపోయినది.  నేను క్రిందటి సంవత్సరము భోపాల్ కు స్వంత పనిమీద వెళ్ళి వస్తున్నాను.  రైలులో అనుక్షణము శ్రీసాయి నామము జపించుచున్నాను.  ఒక స్టేషన్ లో   రైలు ఆగి తిరిగి బయలుదేరినది.  ఒక వృధ్ధుడు సుమారు 65 సంవత్సరాల పైబడియుండును.  తెల్లని గడ్డము తెల్లని తల జుట్టు, శరీరము దబ్బపండు రంగులో యున్నది.  ఆజానుభావుడు పరిగెత్తుకుంటు వచ్చి నేను ఉన్న రైలు పెట్టెలో ఎక్కి ఏమాత్రము ఆయాసము పడకుండ చిరునవ్వుతో నన్ను చూడసాగినారు.  అతను వేసుకొన్న దుస్తులు మాత్రము కాలేజీ కుఱ్ఱవాడు వేసుకొనే దుస్తులువలెనున్నాయి.  ఆయనను చూస్తు ఉంటే (శ్రీసాయి సత్ చరిత్రలో "మీరు వృధ్ధులుగా గనబడుచున్నారు.  మీవయస్సు మీకు తెలియునా బాబా?"  నేను ముసలివాడననుకొనుచున్నావా?  నాతో పరుగెత్తి చూడు" యిట్లనుచు బాబా పరుగిడమొదలిడెను. ) శ్రీసాయిబాబా అనే భావన పొందినాను.  శ్రీహేమాద్రిపంతు తెండూల్కర్ చదువు విషయములో శ్రీసాయి ప్రకటించిన లీలలను వివరించినారు.  నీ ఎంసె.ట్ పరీక్షలో నీకు శ్రీసాయి చేసిన సహాయమును తలచుకుంటు ఉంటే ఆనాడు శ్రీసాయి తెండూల్కర్ కు చేసిన సహాయము నిజము అని నేను నమ్ముతున్నాను.  తెండూల్కర్ తండ్రి రఘునాధ్ రావుగారు ఉద్యోగ విరమణ అనంతరము ఆయనకు యివ్వవలసిన నెలసరి పించను విషయములో శ్రీసాయి చేసిన సహాయము మరువలేనిది.  మరి నేను ఉద్యోగ విరమణ చేసిన అనంతరము నేను గౌరవముగా బ్రతకటానికి కావలసిన పించను నాకు అనుగ్రహించి నేను ఎవరి ముందుచేయిచాపనిస్థితిలో నాజీవితాన్ని శ్రీసాయి నడిపించుతారు అని నేను నమ్ముతున్నాను.  దీనికి కాలమే సాధ్యముగా నిలబడుతుంది.

నేను చదివిన పుస్తకములో కెప్టెన్ జహంగీర్ ను శ్రీసాయి కాపాడిన విధానము చూస్తే ఆనాడు గజేంద్రుడిని శ్రీహరి కాపాడిన విధముగా యుంది.  అవి ప్రపంచ యుధ్ధము జరుగుతున్న రోజులు.  శ్రీ కాప్టెన్ జహంగీర్ ఒక నౌకలో పెద్ద అధికారి.  అనౌక సముద్రములో మునిగిపోతున్న సమయములో కెప్టెన్ జహంగీర్ శ్రీసాయియొక్క సహాయము కోరుతారు.  శ్రీసాయి ద్వారకామాయినుండి తన శక్తితో మునిగిపోతున్న నౌకను రక్షించుతారు.  ఈవిషయాన్ని కెప్టెన్ జహంగీర్ స్వయముగా ద్వారకామాయిలో తోటి సాయిబబంధువుల ముందు వివరించుతారు.  దీనినిబట్టి శ్రీసాయి "సూపర్ మాన్" అని అనడములో ఎవరు ఆశ్చర్యపడనవసరములేదు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి యిలాగ అంటారు "ఆనాణెము విలువ 25 రూపాయలకంటే హెచ్చైనది.  శ్యామా! ఈ రూపాయిని తీసుకొని మనకోశములో నుంచుము."  ఈమాటలు జ్ఞాపకము వచ్చినపుడు నాకు పూజామందిరములో ఉన్న రెండు కానులు గుర్తుకు వస్తాయి.  ఒక కాని 1862 సంవత్సరములో ముద్రించబడినది.  యికొక కాని 1919 సంవత్సరములో ముద్రించబడినది.  బహుశ శ్రీసాయి అశీర్వచనాలతో ఆరెండు కానులు మన పూజామందిరములోనికి వచ్చి యుంటాయని నానమ్మకము.  ఆరెండు కానులు నాకు నాదగ్గర ఉన్న పాత నాణేల డబ్బాలో దొరికినవి.  అంతకంటే ఎక్కువ వివరాలు నేను చెప్పలేను.  దేనికైన నమ్మకము ముఖ్యము అనేది గుర్తుంచుకో.

శ్రీసాయిపై నమ్మకముతో
నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 30వ.అధ్యాయము

$
0
0


                       
                        
14.04.2013  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంచువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్య భూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 30 వ.అధ్యాయము కాస్త పెద్దదిగా ఉండటం వల్ల గత మూడురోజులుగా ఇవ్వలేకపోయాను. ఉగాదినాడు కూడా కుదరలేదు...అందుచేత కొంత ఆలస్యమయినా సాయిబంధువులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం లాగే ప్రతీ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవితం గడిపేలా వరమివ్వమని, బాబావారి అనుగ్రహం మనందరి మీదా ఎల్లవేళలా ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను. 
        
                  
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 63వ.శ్లోక, తాత్పర్యం

శ్లోకం:  శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః    | 

         గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః       ||

తాత్పర్యం:  ఆయన శుభమయిన శరీరము లేక విగ్రహము కలవాడు.  ఆయన సృష్టించునవి భూగోళమందంతట అయన సాన్నిధ్యముచే శాంతిని ఆనందమును జీవులకు కలిగించును.  అయన గోవులు, వృషభముల హితము కోరుచు, వాటిని గుప్తముగా నుంచి సం రక్షించును.  ఆయన వృషభ నేత్రముతో నుండి వృషభమును యిష్టపడును.     



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
30వ.అధ్యాయము

                                                              02.02.1992

ప్రియమైన చక్రపాణి,

నాజీవితములో నేను గాయత్రి మంత్రమును రోజు జపించలేదు.  వేద శాస్త్రాలు పారాయణ చేయలేదు.  కాని, శ్రీసాయి సత్ చరిత్ర ప్రతిరోజు పారాయణ చేయటము వలన గాయత్రి మంత్ర జపము, వేద శాస్త్రాల పారాయణ ఫలము నిత్యము నేను అనుభవించుచున్నాను. ఈ నానమ్మకాన్ని కొందరు హేళన చేయవచ్చును.  



అయినా వాటిని నేను లక్ష్య పెట్టను.  మన జీవితములో ఎందరో ప్రవేశించుతారు.  మనలను వదలి వెళ్ళిపోతారు.  కాని శ్రీసాయి ఒక్కసారి మన జీవితములో ప్రవేశించిన తర్వాత మనము సాయిని వదలలేము, శ్రీసాయి మనలను వదలలేరు.  ఒకవేళ మనలో ఎవరైన శ్రీసాయిని వదలిన శ్రీసాయి మాత్రము వారిని వదలరు.  కారణము విశ్వాసమునకు మారు పేరు శ్రీసాయి.  జీవితములో అజ్ఞానమును తొలగించుకోవాలి అంటే మన మనసులో శ్రీసాయి అనే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి.  ఎవరైతే ఈ జ్ఞానజ్యోతిని వెలిగించుకొంటారో వారి జీవితము ధన్యమైనది.  ఎవరైతే ఆ జ్ఞాన జ్యోతి కాంతిలో జీవించుతారో వారు అదృష్టవంతులు.  ఎవరైన న్యాయమైన కోరికతో శ్రీసాయిని ప్రార్ధించితే, శ్రీసాయి ఆకోరిక నెరవేర్చెదరు.  ఈ 30వ. అధ్యాయములో శ్రీసాయి సత్చరిత్రలో హేమాద్రిపంతు ఈవిధముగా అంటారు.  "వాదించువారు, విమర్శించువారు ఈ కధలను చవనక్కరలేదు".  నేను మాత్రము అలాగ అనను.  దయచేసి పూర్తిగా నేను వ్రాస్తున్న ఈ ఉత్తరాలు అన్నీ చదువు.  చదివిన తర్వాత నీమనసులో ఈ శ్రీసాయి ఎవరు?  ఆయన పిలుస్తే పలుకుతాడా? ఏదీ ఒక్కసారి ప్రయత్నించుదాము అని మనస్పూర్తిగా శ్రీసాయి సత్ చరిత్రను నిష్టతో పారాయణ చేసి ఆయన తత్వాన్ని అర్ధము చేసుకొని పిలచి చూడు.  ఆయన పలకకపోతే నన్ను దూషించు. ఈ ఉత్తరములో శ్రీసాయి నాకు చూపిన చిన్న లీలను నీకు వ్రాస్తాను. 

1991 డిశంబరు నెలలో మనసుకు శాంతిలేక బాధ పడుతుంటే 16.12.1991 నాటికి శిరిడీ యాత్ర నిమిత్తము ఒక పది రోజుల ముందుగా టికెట్టు రిజర్వు చేసుకొన్నాను.  16.12.1991 నాడు ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేయసాగాను.  ఆరోజున శ్రీసాయి సత్ చరిత్రలో బాబా యిచ్చిన సందేశము నన్ను చాలా సంతోషపరచినది.  అది 30వ. అధ్యాములో "బాబా వద్దకు పొమ్ము, నీమనస్సు శాంతి వహించును".  ఆ సందేశముతో శిరిడీ యాత్ర పూర్తి చేసినాను.  శ్రీసాయి ఆశీర్వచనాలతో తిరిగి యింటికి చేరుకొన్నాను.  కాకాజీ విషయములో శ్రీహేమాద్రిపంతు యిలాగ వ్రాస్తారు - "దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహముతో వచ్చును.  మరి నావిషయములోను అలాగే జరిగినది.  1989 జూన్, జూలై నెలలలో నేను మొదటిసారి శిరిడీకి బయలుదేరిన రోజున శ్రీసాయి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణములో నాకు దర్శనము యిచ్చి నానుండి ఒక రూపాయి దక్షిణగా స్వీకరించిన సంఘటన నీకు నేను వెనకటి ఉత్తరాలలో వ్రాసి యున్నాను గుర్తు చేసుకో.  శ్రీసాయి సమాధి చెందకముందు భక్తులు పొందిన అనుభవాలు అన్ని నిజమైనవి అని చెప్పడానికి నాబోటి సాయి బంధువులు ఈనాడు శ్రీసాయితో అనుభవించిన అనుభవాలు తోటి సాయి బంధువులకు తెలియ చేయటము ఎంత అయినా అవసరము. 

కాకాజీ శిరిడీకి వెళ్లటానికి కోరికను శ్యామాకు వాణి అనె పట్టణములో సప్త శృంగిదేవతకు మ్రొక్కు తీర్చుకోవాలి అనే కోరికను, శ్రీసాయి ఏవిధముగా తీర్చినది మనము ఒక్కసారి అలోచించితే శ్రీసాయి సర్వదేవతా స్వరూపుడు అని బలమైన నమ్మకము మనలో కలుగుతుంది.  ఈ నమ్మకాన్ని నేను స్వయముగా అనుభవించినాను.  నేను 1990 సంవత్సరము తర్వాత శ్రీతిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన, రాజస్థాన్ లోని రణతంభోర్ లోని గణేశ్ మందిరానికి వెళ్ళిన, 
                 

కొరియాలోని చాంగ్  వాన్ పట్టణములోని బౌధ్ధ దేవాలయానికి వెళ్ళిన నేను శ్రీసాయి నాధుని ఆమందిరాలలో చూడగలిగినాను.  

         
అందుచేతనే నేను శ్రీసాయి సకల దేవా స్వరూపుడు అని గట్టి నమ్మకముతో అంటాను.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్యామాకు కాకాజీకి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకో.  బహుశ నీకు జ్ఞాపకము యుండకపోవచ్చును.  తిరిగి వ్రాస్తున్నాను.  "మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినారు" అని కాకాజీ శ్యామాను అడిగెను.  "నాది శిరిడి,, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకిక్కడకు వచ్చినా" నని శ్యామా అనెను.  శిరిడీనుండి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను.  

యిటువంటి సంఘటన నా జీవితములో జరిగినది.  06.05.1991 నాడు తెల్లవారుజాము 01.30 నిమిషాలు బొంబాయినుండి విమానములో కొరియా దేశమునకు ప్రయాణము ప్రారంభించినాను.  విమాన ప్రయాణము అంటేనే భయము.  విమానము ఆకాశములోనికి ఎగరటము కోసము యింజను పని చేయటము ప్రారంభము అయినది.  నా మనసు భయముతో నిండిపోయినది. 

విమానము నేల మీద వేగముగా ప్రయాణము చేస్తున్నది.  నాగుండె వేగముగ కొట్టుకోవటము ప్రారంభించినది.  విమానము ఒక్కసారిగా నేలను వదలి ఆకాశములోనికి దూసుకునిపోతున్నది.  నాప్రాణాలు పైలోకాలకు వెళ్ళిపోతున్న అనుభూతి కలుగుతున్నది.  కండ్లు మూసుకొని శ్రీసాయి నామము జపించుతున్నాను.  నామనసులో శ్రీసాయి తప్ప యింకొకరు ఎవరు లేరు.  ఒక పదినిమిషాల తర్వాత విమానములోని స్పీకర్ల ద్వారా పైలట్ విమానములోని ప్రయాణీకులను ఉద్దేశించి మాట్లాడుతు "విమానము 40 వేల అడుగుల ఎత్తులో గంటకు 900 మైళ్ళ వేగముతో ప్రయాణము చేస్తున్నది, విమానము బయట వాతావరణము 40డిగ్రీల సెంటిగ్రేడ్ (నీరు గడ్డకట్టదానికి కావలసిన చల్లదనము కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత - 40 డి.).  మీ నడుముకు కట్టుకొన్న బెల్టులను విడదీసుకొని విశ్రాంతి తీసుకోండి".  ఆమాటలను విన్న తర్వాత ప్రశాంతముగా ఊపిరి పీల్చుకొని కండ్లు తెరచినాను.  నాప్రక్క సీటులో ఒక ఆజానుభావుడు సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఒక వ్యక్తిని చూసినాను.  ఆవ్యక్తి ఆగ్లేయుడిలాగ యున్నాడు.  ఆవ్యక్తిలోని చిరునవ్వుని చూడగానే నామనసులోని భయము పూర్తిగా తొలగిపోయినది.  అవ్యక్తితో మాట్లాడాలని మనసులో కోరిక కలిగినది. "మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినారు" అని ఆనాడు కాకాజీ శ్యామాను అడిగినట్లుగా నేను ఆవ్యక్తిని అడిగినాను.  దానికి సమాధానము నీవు ఊహించగలవా!  అవ్యక్తి యిచ్చిన సమాధానము నన్ను ఆశ్చర్యముతో ముంచివేసినది.  విమాన ప్రయాణము ప్రారంభములో హడావిడిగా అవ్యక్తి వచ్చి నాప్రక్క సీటులో కూర్చుండినాడు. యింతలో విమానము బయలుదేరినది.అపుడు నేను ఆవ్యక్తితో మాట్లాడలేదు.  నామనసులోని భయాన్ని తొలగించమని శ్రీసాయినాధుని నామ జపము చేస్తున్నాను.  కండ్లు తెరచి ప్రక్క సీటులోని ఆవ్యక్తిని చూసి మీరు ఎవరు? ఎచ్చటనుండి వస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆవ్యక్తి యిచ్చిన సమాధానము నీకు తెలిసి యుంటుంది.  నీఊహ సరయినది.  అవ్యక్తి నోటినుండి వచ్చిన సమాధానము యిక్కడ వ్రాస్తాను విను.  "నేను హిందువుడిని, శిరిడీసాయిబాబాను దర్శనము చేసుకొని తిన్నగా విమానాశ్రయమునకు వచ్చి హాంగ్ కాంగ్  వెళ్ళటానికి ఈవిమానము ఎక్కినాను".  ఈమాటలు వింటు ఉంటే నాశరీరముపై ఉన్న రోమాలు ఒక్కసారిగా ఆనందముతో నిలబడిపోయినాయి.  ఆ ఆనందములో నానోట మాట రావటము లేదు.  నేను భయ ఆందోళనలతో పది నిమిషాలపాటు శ్రీసాయి నామము జపించి కళ్ళు తెరచి ప్రక్క సీటులో ఉన్న వ్యక్తిలో సాక్షాత్తు శ్రీసాయి ఉన్నారు అనే అనుభూతి పొంది ఆవ్యక్తి చేతులను పట్టుకొని శ్రీసాయికి మనసులో నమస్కరించినాను. 

ఆవిమాన ప్రయాణములో ఆవ్యక్తితో చాలా సంతోషముగా మాట్లాడినాను.  తెల్లవారు జామున శ్రీసాయినాధుని హారతి చదువుతుంటే ఆవ్యక్తి తనకూ వినాలని ఉంది అని కోరిక వ్యక్త పరచటము చేత మెల్లిగా అవ్యక్తికి మాత్రమే వినబడేలాగ ఆరతి చదివినాను.  ఆరతి పూర్తి అయిన సమయము భారతీయ కాలమానము ప్రకారము ఉదయము 5.30 నిమిషాలు కాని విమానములో సమయము 8.30 నిమిషాలు.  విమానములోని ఎయిర్ హోస్టస్ మాకు యిచ్చిన అల్పాహారమును శ్రీసాయికి నైవేద్యముగా సమర్పించి ఆప్రసాదమును మేము యిద్ద్దరము తింటు ఈ ప్రసాదము శ్రీసాయినాధులు యిచ్చిన ప్రసాదము అని అన్నాను.  ఆవ్యక్తి నాతో వేళాకోళముగా మాట్లాడుతు నీవు యిది శ్రీసాయినాధులు పంపిన ప్రసాదమని నిరూపించగలవా అనిప్రశ్నించినారు.  నేను ఏమి సమాధానము యివ్వాలి అనే మీమాంసతో ఉండిపోయినాను.  ఆ అల్పాహారము పళ్ళెము మీద యింగ్లీషు భాషలో SWISSAIR                  అని వ్రాసి యుందీ.  నేను నాజేబులోని పెన్ను తీసుకొని  SWISSAIR   లోనిSAI   క్రింద గీత గీసి చూపించినాను.ఆవ్యక్తి సంతోషముతో ఆవిమానములో ఉన్న అమ్మకాల దుకాణమునుండి పెద్ద చాక్ లెట్లు (మిఠాయి) ప్యాకెట్ కొని నాకు యిస్తు ఉంటే నేను పొందిన అనుభూతి చెప్పమంటావా- సాక్షాత్తు శ్రీసాయినాధుడు తన భక్తుని ఆశీర్వదించి మిఠాయి యిస్తున్న అనుభూతిని పొందినాను.  యింతలో విమానము హాంగ్  కాంగ్ చేరుకొన్నది.  ఆవ్యక్తి విమానము దిగిపోతు ఉంటే అతని చిరునామ అడిగినాను.  అవ్యక్తి తన చిరునామా ఉన్న విజిటింగ్ కార్డు యిచ్చినాడు.  యిండియాకు వెళ్ళిన తర్వాత ఉత్తరము వ్రాయమని కోరినాడు.  21.05.91 నాడు తిరిగి హైద్రాబాద్ వచ్చిన తర్వాత ఆవ్యక్తికి  కృతజ్ఞతలు తెలుపుతు రెండు ఉత్తరాలు వ్రాసినాను.  కాని నారెండు ఉత్తరాలకు సమాధానము రాలేదు.  ఒకరోజున ఆవ్యక్తి యిచ్చిన విజిటింగ్ కార్డు శ్రధ్ధగా చూసినాను.  ఆవిజిటింగ్ కార్డుపై ఒక బొమ్మ నన్ను ఆశ్చ్ర్యపరచినది. ఆ బొమ్మ భూగోళము.  ఆవిజిటింగ్ కార్డు చూసినప్పుడు నాలో కలిగిన ఆలోచనలను వ్రాస్తాను.  నన్ను అర్ధము చేసుకో.  నేను ఎంతటి మూర్ఖుడిని.  సాక్షాత్తు శ్రీసాయి నాప్రక్కన కూర్చుని నాతో విమానములో  ప్రయాణము చేసినపుడు నేను ఆయనను గుర్తించలేదు.  యిండియాకు వెళ్ళి ఉత్తరము వ్రాయమన్నపుడు ఆవిజిటింగ్ కార్డును సరిగా అర్ధము చేసుకోలేదు.  ఆవ్యక్తినుండి నామొదటి ఉత్తరమునకు సమాధానము రానప్పుడు ఆవ్యక్తి సాక్షాత్తు సాయినాధుడు అని గుర్తించలేదు.  రెండవ ఉత్తరానికి కూడా సమాధానము రాకపోతే ఆవిజిటింగ్ కార్డులోని భూగోళము ఫొటో చూసి అప్పుడు గ్రహించినాను.  ఆవ్యక్తి సాక్షాత్తు శ్రీసాయినాధుడు అని.  మరి అటువంటి శ్రీసాయికి ఎడ్రసు ఏమిటి?  ఆయన ఈభూగోళము అంతా వ్యాపించ్జియున్నారు అన్న విషయాన్ని ఎంత ఆలస్యముగా గ్రహించినాను.  ఈఆలోచనలను అన్నిటిని నీముందు ఉంచినాను.  నీవు కూడా నా ఆలోచనలలో మునిగి శ్రీసాయి ఈ భూగోళము అంతా వ్యాపించి యున్నారు అని గ్రహించగలగిన రోజున ఈ నాఉత్తరాలకు ఒక ప్రయోజనము ఉంది అని భావించుతాను.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి. 


గమనిక: నేను సాయి.బా.ని.స.గారి ఇంటికి వెళ్ళినపుడు నాకు ఆయన శ్రీసాయినాధులవారు స్వయంగా ఇచ్చిన విజిటింగ్ కార్డును చూపించారు. నేను మరలా ఆయననను కలసినపుడు ఆవిజిటింక్ కార్డ్ ను స్కాన్ చేసి మీకందరికీ కూడా చూసే భాగ్యాన్ని ఆసాయినాధుల ద్వారా కలిగించుతాను. .. త్యాగరాజు

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 31వ. అధ్యాయము

$
0
0

                 
                 
16.04.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                       
శ్రీవిష్ణుసహస్ర నామం 64వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :      అనివర్తీనివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్చివః   |

                శ్రీవత్స వక్షాశ్రీవాసశ్రీపతిః శ్రీమతాం వరః     ||  

తాత్పర్యం:  పరమాత్మను తన పధమునుండి వెనుకకు మరలనివానిగా, కర్మలకు లోబడని ఆత్మకలవానిగా, వస్తువులను, సంఘటనలను చక్కగా కూర్చి క్షేమము కలిగించువానిగా, శుభము కలిగించువానిగా, వక్షస్థలముపై శుభమయిన చిహ్నము కలవానిగా, సంపదలకు వైభవములకు అతీతమై యుండి రక్షించువానిగా, సంపదలు కలిగించువారిలో ఉత్తమునిగా ధ్యానము చేయుము.  
  
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -

 31వ. అధ్యాయము

                                                               03.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో, శ్రీసాయి కొంత మంది భక్తులకు శిరిడీలో తన సమక్షములో ముక్తిని ప్రసాదించిన సంఘటనలు వివరింపబడినవి.  వారు చాలా అదృష్టవంతులు.  

శ్రీసాయి సన్నిధిలో ఒక కౄర జంతువు (పులి) కూడా మోక్షమును పొందినది.  యివి ఆనాడు శిరిడీలో జరిగిన విషయాలు.  నాకంటి ముందు శ్రీసాయి తన భక్తుడు, నాపాలిట సాక్షాత్తు సాయి స్వరూపుడు, నా పినతల్లి భర్త శ్రీఉపాధ్యాయుల సోమయాజులుగారికి ముక్తిని ప్రసాదించినారు.  ఆ వివరాలు నీకు ముందు ముందు ఉత్తరాలలో వ్రాస్తాను. ఈ అధ్యాయములో నన్ను ఆకర్షించిన విషయాలు నీకు వ్రాస్తాను.  ఈ అధ్యాయము ప్రారంభములో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఉదహరించినారు.  "ఎవరయితే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు.  ఎవరయితే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు.  జీవిత కాలమమంత అరిషడ్ వర్గాలలో గడిపివేసి అజ్ఞానముతో జీవితము ముగించినవాడికి భగవంతుడు ముక్తిని ఏవిధముగా ప్రసాదించుతాడు ఆలోచించు.  అందుచేత భగవంతుని గురించి తెలుసుకోవటానికి వయసుతో పని లేదు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆరాటన, తపన యుండాలి.  ఆరెండు యున్ననాడు భగవంతుడు ఏదో ఒక రూపములో మనముందు నిలబడి మనతో కలసిమెలసి జీవిస్తాడు.  సన్యాసి విజయానంద్ విషయములో శ్రీసాయి అంటారు "కాషాయ వస్త్రాలు ధరించువానికి దేనియందు అభిమానము యుండరాదు"  అందుచేత కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతివాడు సన్యాసి కాడు.  శ్రీసాయి ఏనాడుకాషాయ వస్త్రాలుధరించలేదు.  వారు మహాయోగీశ్వరుడు. సన్యాసికి నిజమైన అర్ధము మనకు సాయిలోనే కనిపించుతుంది.  శ్రీసాయి ఏనాడు తన భక్తులనుండి ఏమీ కోరలేదు.  వారు తన భక్తులనుండి ప్రేమను మాత్రమే కోరినారు.  వారు భక్తులనుండి ప్రేమను స్వీకరించి తన భక్తుల శ్రేయస్సు కొరకు తన శక్తిని వారికి ధారపోసినారు.  ఈ కలియుగములో శ్రీసాయి వంటి యోగీశ్వరుని మనము యింక చూడలేము.  నేడు మన మధ్యయున్న సన్యాసులు అందరు మననుండి వస్తు రూపేణా, ధన రూపేణా ఏదో ఒకటి తీసుకొని మనకు పుస్తకాలలో దొరికే జ్ఞానాన్ని మనకు చక్కగా చదివి వినిపించుతున్నారు.  పుస్తక జ్ఞానము కలిగిన వ్యక్తి యింకొక వ్యక్తికి తన జ్ఞానాన్ని తెలియచటానికి కాషాయ వస్త్రాలు ధరించవలసిన అవసరము లేదు అని నేను భావించుతాను.  ఈ నాబావంతో చాలా మంది ఏకీభవించవచ్చును. యింతకంటే ఎక్కుగా ఈ విషయములో వ్రాయటము మంచిది కాదు.  సన్యాసి విజయానంద్ మరణ కాలములో శ్రీసాయి ఆయన చేత "రామవిజయము" చదివించినారు. మరణానంతరము ఆసన్యాసికి శ్రీసాయి సద్గతి ప్రసాదించినారు. నేను నా జీవితములో నాపాలిట సాయి, నా అన్నదాత, విద్యాదాత నాపినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులుగారి మరణ కాలములో శ్రీసోమయాజులుగారికి ముక్తిని ప్రసాదించమని శ్రీసాయిని కోరినపుడు శ్రీసాయి నాచేత "రాజారాం" అనే మంత్రమును శ్రీసోమయాజులుగారి చెవిలో చెప్పించినారు.  శ్రీసోమయాజులు బాబయ్యగారు ఆమంత్రమును నోటితో పలుకుతు ప్రాణాలు వదలినారు. 

శ్రీబాలారాం మాన్ కర్ విషయములో శ్రీసాయి ప్రత్యేక ప్రేమను చూపించినారు.  శ్రీసాయి శిరిడీలో యుండగా శ్రీమాన్ కర్ కు మచ్చింద్రగడములో దర్శనము యిచ్చి తాను సత్వాంతర్యామి అని నిరూపించినారు.  శ్రీమాన్ కర్ బంద్రాకు రైలులో ప్రయాణమునకు సిధ్ధపడినపుడు టికెట్టు లభించక బాధ పడుతున్న సమయములో శ్రీసాయి ఒక జానపదుని వేషములో (పల్లెటూరివాని వేషములో) వచ్చి టికెట్టు యిచ్చి అదృశ్యుడు అయినాడు.  శ్రీ సాయి సముఖములో బాలారాం ఈప్రపంచాన్ని వదలిన అదృష్టవంతుడు.  మనము శ్రీసాయి యందు భక్తి ప్రేమలను కలిగిననాడు శ్రీసాయి ఏదో ఒక రూపములో మన ముందుకు వచ్చి మనలను కాపాడును.  ఈవిషయాలు సమయము, సందర్భము వచ్చినపుడు ముందు ముందు ఉత్తరాలలో నీకు వ్రాస్తాను.  యిక తాత్యాసాహెబు నూల్కర్ విషయము ఆలోచించు.  దాము, అతను బాబాకు పరీక్ష పెట్టిన మహాభక్తుడు.  మనము సాధారణముగా భగవంతుడు భక్తునికి పరీక్ష పెట్టిన సందర్భాలను చాలా చుస్తాము.  కాని నూల్కర్ తనకు ఫలానాది కావాలి అది దొరికితేనే శిరిడీ వెళ్ళి శ్రీసాయి దర్శనము చేస్తాను అని మొండి పట్టుదలతో ఉన్నపుడు శ్రీసాయి తన భక్తుని కోరిక తీర్చి తన భక్తునిని శిరిడీకి రప్పించుకొన్నారు.  శ్రీనూల్కర్ మరణించిన తర్వాత శ్రీసాయి అంటారు "అయ్యో! తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయెను.  అతనికి పునర్జన్మము లేదు" అటువంటి అదృష్టవంతుడు తాత్యా సాహెబు నూల్కర్.  

యిక మేఘశ్యాముడు శ్రీసాయి సత్ చరిత్రలో మనము మరచిపోలేని మహావ్యక్తి.  తను చదువురాని వాడు అయినా తన అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీసాయిని ఆకట్టుకొని ఈలోకమునుండి వెళ్ళిపోయెను.  శ్రీసాయి ఏనాడు కన్నీళ్ళు పెట్టుకోలేదు.  మేఘశ్యాముడు చనిపోయినపుడు శ్రీసాయి సామాన్య మానవుడిలాగ ఏడ్చి, మేఘుని అంతిమ సంస్కారాలు దగ్గర ఉండి జరిపించినారు.  "యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షీంపబడుదురు" అంటారు శ్రీహేమాద్రిపంతు.  మరి శ్రీసాయి నావిషయములో ఏమి అదృష్టము కలిగించెదరో నాకు తెలియదు.  తెలియవలసినది నీకు.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి.   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 32వ.అధ్యాయం

$
0
0

                
                 
19.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

గత రెండు రోజులుగా ప్రచురణకు కొంత అంతరాయం కలిగింది.విపరీతమయిన కరెంటుకోత, ఇన్వర్టర్ ఉన్నా నెట్ కనెక్షన్ ప్రతి అయిదు నిమిషాలకు అంతరాయం కలగడం వల్ల ప్రచురించలేకపోయాను.. ఈ రోజు శ్రీ విష్ణుసహస్ర నామం 66వ.శ్లోకంతో ప్రారంభిస్తున్నాను. 
         
శ్రీవిష్ణు సహస్ర నామం 66వ.శ్లోక, తాత్పర్యం

శ్లోకం:  స్వక్షస్స్వంగ శ్శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః   |

         విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్చిన్న సంశయః || 

తాత్పర్యం:  పరమాత్మను చక్కని నేత్రములు, అవయవములు కలవానిగా, నూరు విధముల యితరులకానందము కలిగించువానిగా, జీవుల కానందము కలిగించు వృషభరాశిగా, అన్నిటియందలి కాంతిగా, గణములకు అధిపతియైనవానిగా, ఆత్మచే అన్నిటినీ నడుపువానిగా, మరియూ లోబరచుకొన్నవానిగా, మంచి పేరు మరియూ కీర్తి కలవానిగా, సందేహము నివృత్తి చేయువానిగా ధ్యానము చేయుము.  


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 32వ.అధ్యాయం 

                                                      04.02.1992
                         
ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు గురు శిష్యుల సంబంధము అనుబంధములపై చాలా చక్కగా వివరించినారు.  శ్రీ సాయి తనకు తన గురువుకు మధ్య ఉన్న అనుబంధమును చక్కగా వివరించి చెప్పినారు.  ఈ విషయములో నేను నీకు ఎక్కువగా చెప్పను కాని ఒకటి రెండు మాటలు చెబుతాను కొంచము విను.  



నీ చిన్నతనములో నీ తల్లి నీకు ఆట, మాట, పాట నేర్పినది.  బడిలో గురువు నీకు విద్యా బుధ్ధులు నేర్పినారు.  ప్రకృతి నీకు బ్రతుకు తెరువు నేర్పినది.  యివి అన్ని నీవు యితరుల దగ్గరనుండి నేర్చుకొన్నావు.  మరి నీవు మానవ జన్మ ఎత్తినందులకు దానిని సార్ధకము చేసుకోవాలి.  మానవ జన్మను సార్ధకము చేసుకోవటానికి సమర్ధ సద్గురువు చాలా అవసరము.  ఆటువంటి సమర్ధ సద్గురువు మన సాయిబాబా.  అజ్ఞానము అనే అడవిలో దారి తెన్ను తెలియక నలుగురు స్నేహితులు తిరుగుతున్నపుడు వారిలో ఒకరైన శ్రీసాయి ఏవిధముగా ప్రవర్తించి తన గురువు సహాయముతో అజ్ఞానమునుండి బయట పడినది మనము చదివి అర్ధము చేసుకొంటే గురువు యొక్క అవసరము ఎంత యున్నది మనకే అర్ధము అగుతుంది.  ఈ అధ్యాయములో  శ్రీసాయి చెప్పిన మంచి మాటలు నిత్యము జ్ఞాపకము ఉంచుకో.  అవి "ఉత్త కడుపుతో చేయు అన్వేషణము జయప్రదము కాదు.  భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు.  పెట్టిన భోజనము వద్దనకుడు.  వడ్డించిన విస్తరిని త్రోసి వేయకుడు.  భోజన పదార్ధములు అర్పించుట శుభసూచకములు"  నీకు జ్ఞాపకము యుండి ఉంటుంది.  నీవు మన యింటిలో భోజనము చేస్తు ఎంత విసురుగా ప్రవర్తించేవాడివి.  మీ అమ్మ వండిన పదార్ధములు రుచిగా లేవని తూలనాడేవాడివి. 

నీవు ఆవిధముగా భోజనము దగ్గర ప్రవర్తించేటప్పుడు నేను నీకు శ్రీసాయి చెప్పిన మాటలు గుర్తు చేస్తు "అన్నము పరబ్రహ్మ స్వరూపమని" చెబుతూ ఉండేవాడిని.  యిపుడు నీకు వయస్సు పెరిగినది.  నేను ఎక్కువగా చెప్పనవసరము లేదు.  భోజనము చేసేముందు శ్రీసాయిని ధ్యానించుకొని భోజనము చేయి.  నీమంచి చెడ్డలు అన్ని ఆయనే చూసుకొంటారు.  నిన్ను సరయిన మార్గములో నడిపించుతారు.  ఎలాగా భోజనము ప్రస్తావన వచ్చినది.  శ్రీసాయి ఈ భోజనము గురించి ఏమంటారు అనేది తెలుసుకోవలసి యున్నది.  ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు వ్రాస్తారు "బాబా ఎన్నడు ఉపవసించలేదు.  యితరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు.  ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు.  అట్టివాడు పరమార్ధమెట్లు సాధించును?  ఉత్త కడుపుతో దేవుని చూడలేము".  అలాగని విపరీతముగా భోజనము చేస్తు ఈ శరీరమును కదలలేని గుఱ్ఱములాగ చేయవద్దు.  యిదే అధ్యాయములో శ్రీసాయి యొక్క మాటలను శ్రీహేమాద్రిపంతు ఈవిధముగా వ్రాసినారు "ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిదికాదు.  ఆహారములో మితి (తక్కువ) శరీరమునకు మనస్సుకు కూడా మంచిది.  ఈ అధ్యాయములో శ్రీసాయి తన కధ చెప్పినారు.   అందులో ఆయన తనకు, బట్టలపై చేయు అల్లిక పనివారికి అని వ్రాసినారు.  తన యజమాని (భగవంతుడు) తనకు 600 రూపాయలు జీతమిచ్చెను అని చెప్పినారు.   యిక్కడ 600/- రూపాయలు అంటే 600 సంవత్సరాలు అని చెప్పవచ్చును.  యిక్కడ బట్టలపై అల్లిక పని అంటే మన జీవితాలును మంచి మార్గములో పెట్టడము అని అర్ధము.

భగవంతుడు మన అందరిని జరీ పనితనము లేని సాధారణ నేత వస్త్రాలగా తయారు చేసి ఈభూలోకానికి పంపినాడు.  శ్రీసాయి వంటి మంచి పనివాళ్ళను ఈభూలోకానికి పంపి సాధరణ నేత వస్త్రాలపై మంచి జరీ అల్లిక పనిని చేయించెను.  శ్రీసాయి యోగీశ్వరులలో యోగిరాజ్, అటువంటి వారి పాదాలను మనము నమ్ముకోవటము మన అదృష్ష్ఠము.  ఆయన మన సాధారణ జీవితానికి జరీ అల్లిక పని చేసి మన జీవితాలను తీర్చి దిద్దుతారు.  భగవంతుడు వారికి ఈపనిని 600 సంవత్సరాలు చేయమని ఈభూలోకానికి పంపియుంటారు.  ఎవరో చెప్పగా విన్నాను.  భగవంతుడు శ్రీరాఘవేద్రస్వామిని కూడా 600 సంవత్సరాలుపాటు ఈభూలోకములో యుంటు యిక్కడ యున్న జనులకు భక్తి మార్గము బోధించమన్నారని.  అందుచేత శ్రీరాఘవేద్రస్వామి ఈలోకంలో మన మధ్య లేకపోయినా ఆయన పవిత్ర ఆత్మ ఈభూమండలములో తిరుగుతున్నదని ఆయనను నమ్ముకున్న భక్తులు అంటారు.  శ్రీసాయి 1918 సంవత్సరములో మహాసమాధి అయినా, ఆయన పవిత్ర ఆత్మ 600 సంవత్సరాలు ఈ భూమండలముపై తిరుగుతు తన భక్తులను ఎల్లపుడు కాపాడుతు యుంటుంది.  యిది నేను ఏపుస్తకమునుండి చదివి చెప్పీంది కాదు.  నాకు ఎవ్వరును చెప్పలేదు.  యిది నా ఊహ మాత్రమె.  ఈ నాఊహను బలపరచటానికి ఒక చిన్న సంఘటనను వివరించుతాను.  శ్రీసాయి ఏనాడు తన చినిగిన బట్టలను యితరులచేత కుట్టించుకోలేదు.  మధ్యాహ్ న్న సమయములో ద్వారకామాయిలో ఏకాంతముగా యున్నపుడు తన చినిగిన కఫనీని స్వయముగా సూది దారముతో కుట్ట్లుకొనేవారు.  దీని అర్ధము ఏమిటి ఆలోచించు.  నీకు తోచిన అర్ధము నీకు వ్రాస్తాను.  ఈవిషయములో చర్చించటము అవసరము లేదు.  శ్రీసాయి చినిగిన వస్త్రమును కుడుతున్నారు అంటే ఎక్కడో తన భకుని  జీవితము చినిగి యుండి యుంటుంది.  ఆభక్తుని జీవిస్తాన్ని తిరిగి ఉధ్ధరించుతున్నారని భావించుదాము.


శ్రీసాయి సేవలో

నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 33వ. అధ్యాయము

$
0
0


                 
                  
26.04.2013  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత వారం రోజులుగా మన బ్లాగులో ప్రచురించలేకపోయాను.33వ. అధ్యాయం కొంచం పెద్దదిగా ఉండటంవల్ల దానిని మరలా టైప్ చేసి ప్రచురించడానికి ఆలశ్యమయింది..మధ్య మధ్యలో నెట్ కి కూడా అంతరాయం కలుగుతూ ఉంది..అందుచేత ఈ రోజు శ్రీవిష్ణుసహర్సనామం శ్లోకం ఇవ్వలేకపోతున్నాను..


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
33వ. అధ్యాయము

                                 05.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు ద్వారకామాయి ధుని నుండి వచ్చిన ఊదీ (బూడిద) యొక్క మహిమను వర్ణించినారు.  నీవు శ్రీసాయి సత్ చరిత్ర చదువుచున్నపుడు ఊదీ మహిమను అర్ధము చేసుకోగలవు.  నా నిత్య జీవితములో ఊదీని నుదుట ధరించటము నిత్య కృత్యముగా మారినది.  నేను 1991 సంవత్సరము మే నెలలో కొరియా దేశము వెళ్ళినపుడు అక్కడ సామీ కంపెనీ జనరల్ మేనేజరు నన్ను ఒక ప్రశ్న వేసినారు.  నేను చాలామంది భారతీయులను కలసినాను.  కాని నుదుట ఎఱ్ఱ తిలకము బొట్టు, తెల్లటి విభూతి ధరించిన వ్యక్తిని కలియలేదు.  మొదటిసారిగ మీనుదుట ఎఱ్ఱటి తిలకము, తెల్లటి విభూతి చూస్తున్నాను దీనికి అర్ధము ఏమిటి?  ఎందుకు ఈవిధముగా నుదుట పెట్టుకోవాలి?  వీటికి దయచేసి అర్ధమును తెలియచేయండి అని కోరినారు.  నేను ఏమీ సమాధానము చెప్పాలి అనే ఆలోచనలో మునిగిపోయినాను.  వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 33వ. అధ్యాయములో శ్రీసాయి చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినవి.  "ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు.  పంచ భూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమై పోయి బూడిదయగును."  వెంటనే నేను యిచ్చిన సమాధానము ఇదీ - "నేను ధరించిన ఈ ఎఱ్ఱని తిలకము నాలోని ప్రాణానికి గుర్తు.  నాలోని ప్రాణము పోయిన తర్వాత ఈశరీరము మంటలలో బూడిద అగుట ఖాయము.  ఈసత్యాన్ని అనుక్షణము గుర్తు చేసుకోవటానికి ఎఱ్ఱ తిలకము బొట్టు, విభూతి పట్టీని ధరించుతాను."


ఈ సమాధానము ఆకొరియా దేశస్తుని చాలా ఆశ్చర్యపరచినది.  వెంటనే తన డైరీలో వ్రాసుకొన్నాడు.  శ్రీసాయి హేమాద్రిపంతుకు ఊదీ గురించి చెప్పిన వివరణను నేను తిరిగి 1991లో  కొరియా దేశములో చెప్పగలగటము సాయి బంధుగా నాకు చాలా తృప్తిని కలిగించినది.

1904 - 1905 సంవత్సరములో నానాసాహెబు చాందోర్కర్ కుమార్తె ప్రసవ వేదన పడుతున్న సమయములో శ్రీసాయి శిరిడీనుండి రామ్ గిరి బువా అనే సన్యాసితో ఊదీని నానాసాహేబు చందోర్కర్ యింటికి పంపి ప్రసవ వేదన పడుతున్న మైనతాయిని కాపాడిన వైనము లోకుల దృష్టిలో నమ్మశక్యము కానిది.  సాయి బంధువుల దృష్టిలో అది శ్రీసాయి చూపిన లీల.  ఊదీ మహిమను నేను కళ్ళతో చూసిన సంఘటన తెలియచేస్తాను.  1991 అక్టోబరు నెలలో ఒకరోజు సాయంత్రము నామిత్రుడు శ్రీహోతా కామేశ్వ్రరరావు నాయింటికి వచ్చి తన తమ్మునికి మరుసటి రోజున గుండెకు ఆపరేషన్ (బై పాస్ సర్జరీ) నిజాం ఆసుపత్రిలో జరుగుతుంది రక్త దానము చేయండి అని కోరినారు.  సరే మరుసటి రోజు ఉదయము ఆసుపత్రికి వచ్చి రక్త దానము చేసెదను అని మాట యిచ్చినాను.  మరుసటి రోజు ఉదయము స్నానము చేసి శ్రీసాయి విభూతి పొట్లము తీసుకొని శ్రీసాయిని ప్రార్ధించి సందేశము కోరినాను.  నేను కండ్లు మూసుకొని శ్రీసాయినామ స్మరణతో శ్రీసాయి సత్ చరిత్రలో ఒక పేజీ తీసినాను.  అది 33వ. అధ్యాయములో ని పేజీ.  పేజీ పూర్తిగా చదివినాను.  శ్రీసాయి సందేశము అందు స్పష్టముగా యున్నది అది "గండము గడచినదని చెప్పిరి".  ఈ సందేశమును మనసులో దాచుకొని ఆసుపత్రికి వెళ్ళి రక్త దానము చేసి విభూతి పొట్లము విప్పి రోగి నుదుట ఊదీ బొట్టు పెట్టి యింటికి తిరిగి వచ్చినాను.  సాయంత్రము శ్రీకామేశ్వరరావుగారు నన్ను కలసి నాకు చెప్పిన మాటలు నీకు వ్రాస్తున్నాను. వాటిని అర్ధము చేసుకో.  డాక్టర్లు ఈరోజున మాతమ్ముని పరీక్ష చేసినారు.  పెద్ద ఆపరేషన్ చేయనవసరము లేదు.  గాలి బుడగను గుండెకు వెళ్ళే రక్త నాళములో పంపి ఆనాళములో ఉన్న అడ్డమును తొలగించుతారట.  ఈ చిన్న ఆపరేషన్ ఒక రెండు రోజుల తర్వాత చేస్తారు".  ఈ మాటలు విన్న తర్వాత ఉదయము శ్రీసాయి యిచ్చిన సందేశము గండము గడచినది అని చెప్పిరి" గుర్తుకు వచ్చినది.  ఈవిషయము శ్రీకామేశ్వరరావు గారికి తెలిపినాను.  శ్రీసాయి సత్ చరిత్రలోని సందేశము చూపినాను.  శ్రీకామేశ్వ్రరావు గారు నాసమక్షములో శ్రీసాయికి ధన్యవాదాలు తెలియచేసినారు.  యిది అంతా ద్వారకామాయిలోని ధునిలోని ఊదీ మహిమ అని నేను నమ్ముతాను. ఇదే అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు యిలాగ వ్రాసినారు. "ఎవరయితే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు.  వారెల్లపుడు మనప్రక్కనే యుందురు.  ఏరూపములోనో భక్తునకు దర్శనము యిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.  "యిది అక్షరాల నిజము.  నాజీవితములో జరిగిన కొన్ని సంఘటనలు నీకు చెబుతాను. 1991 లో గోదావరి పుష్కరాలకు వెళ్ళి తిరిగి వస్తున్నాను.  రాజమండ్రి స్టేషన్ లో నామేనమామ ఒక చిన్న ట్రంకు పెట్టి యిచ్చి దానిని హైదరాబాద్ లోని మన బంధువులకు అప్పగించమని కోరినాడు. నాదగ్గర ఒక చేతి సంచి మాత్రమే యున్నది.  లగేజీ ఎక్కువగా లేని కారణము చేత నేను ఆపెట్టెను హైదరాబాద్ లో మన బంధువులకు అప్పగించటానికి అంగీకరించినాను.  సికంద్రాబాద్ స్టేషన్ లో గేటు దగ్గర ఉన్న టికెట్ కలక్టర్ ఈపెట్టెను తూకము వేయవలెను అని చెప్పినాడు నేను దానికి అంగీకరించినాను.  పెట్టెతోపాటు నాచేతి సంచి కూడా తూకము వేయవలసి వచ్చినది.  మొత్తము మీద 10 కిలోలు ఎక్కువ బరువు ఉన్నది.  దానికి డబ్బు కట్టవలెను అని టికెట్టు కలెక్టర్ అనగానే నేను ఆ చేతి సంచిని తూకము వేయవద్దు అని కోరినాను.  అతను అంగీకరించలేదు.  మొత్తము 102/- రూపాయలు జరిమానా విధించినారు.  నాదగ్గర 20/- రూపాయలు మాత్రమే యున్నది.  యింటికి వెళ్ళి డబ్బు తెచ్చి సామానులు విడింపించుకోవలసినది అని ఆ టికెట్ కలెక్టర్ చెప్పినాడు.  ఆపెట్టి నాది కాదని అది ఒక స్నేహితునిది అని దయచేసి వదిలి పెట్టవలసినది అని ఎంత వేడుకొన్నా ఆటికెట్టు కలెక్టర్ అంగీకరించలేదు.  నాకు ఏమీతోచక శ్రీసాయినాధుని సహాయము కోరినాను.  కళ్ళలో నీరు వస్తున్నది.  ప్లాట్ ఫారం మీద జనము నన్ను దొంగగా భావించి తమాషా చూస్తున్నారు.  తల ఎత్తలేని స్థితిలో ఉన్నాను.  యింతలో తెల్ల దుస్తులు వేసుకొన్న రైల్వే అధికారి అక్కడకు వచ్చి నాభుజము మీద చేయి వేసి నన్ను ఓదార్చుతూ నాకు త్రాగడానికి చల్లని మంచి నీరు యిచ్చినారు.  ఎక్కడనుండో ఒక స్త్రీ వచ్చి నన్ను పట్టుకొన్న  టికెట్టు కలక్టెరుతో స్నేహముగా మాట్లాడుతున్నది.  నాకు మంచి నీరు యిచ్చిన రైల్వే అధికారి ఒక రైల్వే కూలీని పిలిచి నన్ను నాసామానులను ఆటొ రిక్షా వరకు తీసుకొని వెళ్ళమని ఆజ్ఞాపించినారు.  నన్ను నేను నమ్మలేకపోయినాను.  ఆ రైల్వే అధికారిలో నా సాయిని నేను చూడగలిగినాను.  రెండు చేతులతో నమస్కరించి, స్టేషన్ బయటకు వచ్చి ఆటోలో యింటికి చేరుకొన్నాను.  సికంద్రాబాద్ స్టేషన్ లో నేను మానసికమైన బాధ పడుతున్నపుడు నేను శ్రీసాయినాధుని సహాయము కోరినాను.  శ్రీసాయి ఒక పెద్ద రైల్వే అధికారి రూపములో వచ్చి నాబాధను అర్ధము చేసుకొని నన్ను ఓదార్చి నాకు గ్లాసుడు చల్లటి మంచినీరు యిచ్చి నన్ను కాపాడినారా?  అనేది నాలో మెదలిన ప్రశ్న.  ఈప్రశ్నకు నేను యిచ్చే జవాబు శ్రీసాయి స్వయముగా మనిషి రూపములో వచ్చి నన్ను ఆదుకొన్నారు అని పూర్తి విశ్వాసము, నమ్మకముతో చెబుతాను. ఈ నానమ్మకాన్ని సాయి బంధువులు కాదనలేరని నేను తలుస్తాను.  1991 సంవత్సరములో నాచిన్ననాటి స్నేహితుడు రవీద్రనాధ్ తల్ల్లి అజ్మీరులో స్వర్గస్తురాలు అయినది.  ఆవార్త తెలియగానే అజ్మీరు వెళ్ళి నాస్నేహితుని ఓదార్చినాను.  నాస్నేహితుడు అజ్మీరు వచ్చినావు కదా యిక్కడ ఒక ముస్లిం ఔలియా యొక్క దర్గా యున్నది దర్శనము చేసుకొని రమ్మనమని తన దగ్గర పనివాడిని తోడుగా పంపినాడు.  అజ్మీరుకు వచ్చిన ప్రతివారు మతపరమైన భేదము లేకుండ ఆదర్గాను సందర్శించుతారు.  నాస్నేహితుడు ఆదర్గాను దర్శించమని చెప్పినపుడు సాక్షాత్తు శ్రీసాయినాధుడు నన్ను ఆదర్గాను దర్శించమని చెప్పినట్లుగ భావించినాను.  నేను నాస్నేహితుని పనివాడు కలసి రోడ్డు వరకు వచ్చి ఒక ఆటోలో అజ్మీరులోని గరీబ్ నవాజ్ చిత్సిగారి దర్గాకు బయలుదేరినాము.  ఆటో ఒక కిలో మీటరు నడచిన తర్వాత రోడ్డ్ల్లుమీద ఒక ముసలివాడు ఆటోను ఆపి తనను దర్గా దగ్గర రోడ్డుమీద దింపమని ఆటో డ్రైవరు ను కోరినాడు.  ఆటో డ్రైవరు నాలుగు రూపాయలు అడిగితే అతను రెండు రూపాయలు మాత్రమే యిస్తాను అని చెప్పినారు.  నేను ఆటో డ్రైవరుకు నచ్చ చెప్పటముతో ఆముసలివానిని కూడా ఆటోలో ఎక్కించుకొన్నాము.  ఆటో దర్గా దగ్గరకు చేరుతున్న సమయములో ఆటోనుండి ముసలివాడు దిగి రెండు రూపాయలు యివ్వబోతుంటే నేను అంగీకరించలేదు.  నేనే ఆరెండు రూపాయలు ఆటో డ్రైవరుకు యిస్తాను అని చెప్పి ఆయనకు నమస్కరించినాను.  ఆముసలివాని చిరునవ్వులో శ్రీసాయినాధుని చూడగలిగినాను.  ఆముసలివాడు తన జేబునుండి ఒక చిన్న మందు సీసా తీసి యిచ్చి విపరీతమైన తలనొప్పి యుంటే ఈమందు నుదుట వ్రాసుకోమని చెప్పినాడు.  ఆమందు సీసాను కృతజ్ఞతా పూర్వకముగా స్వీకరించి నమస్కరించినాను.  ఆటో ముందుకు దర్గా వైపుకు వెళ్ళిపోతున్నది.  నామనసులో శ్రీసాయి నాప్రక్కనే కూర్చున్న ఆలోచన కలిగినది.  ఆటోనుండి వెనక్కి తిరిగి చూసినాను.  నాకంటికి ఆముసలివాడు కనిపించలేదు.  నేను ఎంత మూర్ఖుడిని సాక్షాత్తు శ్రీసాయినాధుడు నాప్రక్కన కూర్చుని ఆటోలో ప్రయాణము చేస్తే ఆతనిని ముసలివాడు, ముసలివాడు అని సంబోధించినాను.  శ్రీసాయి ఏదో ఒక రూపములో మన ప్రక్కన యుండి మనకోరిక తీర్చి అదృశ్యుడు అగుతాడు అనటానికి యికి ఒక నిదర్శనము. 

1989 నుండి శ్రీసాయికి నన్ను నేను అర్పించుకొన్నాను.  శ్రీసాయిని మనసార పిలిచినపుడు ఏదో ఒక రూపములో వచ్చి నాప్రక్కన నిలబడి నాకు సహాయము చేసి అదృశ్యులు అగుతున్నారు అని చెప్పటానికి నీకు యిప్పటికి మూడు నిదర్శనాలు వ్రాసినాను.  మొదటిది నేను కొరియా దేశానికి విమానములో ప్రయాణము చేస్తున్నపుడు నాప్రక్క సీటులో కూర్చుని హాంగ్ కాంగ్ లో దిగిపోతు నాకు చాక్లెటు పొట్లాము యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  రెండవది సికంద్రాబాద్ స్టేషన్ లో డబ్బు లేక మానసిక బాధ పడుతున్న సమయములో నాభుజముపై చేయి వేసి నాకు చల్లటి మంచినీరు యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  మూడవది అజ్మీరులో దర్గాకు వెళ్ళమని ఆదేశించి ఆటోలో నాప్రక్కన కూర్చుని నాతో ప్రయాణము చేసి ఆటొ దిగి వెళ్ళిపోతు నాకు తలనొప్పి మందు బహుమతిగా యిచ్చిన వ్యక్తి శ్రీసాయి.  ఈ మూడు నిదర్శనాలతో ఒక మాట గట్టిగా చెప్పగలను.  మనము ప్రేమతో శ్రీసాయిని పిలిస్తే ఆయన ఏదో ఒక రూపములో మన ప్రక్కకు వచ్చి మన కోరికను తీర్చుతారు.  ఆయన వచ్చినది లేనిది గ్రహించుకోవలసినది మనము.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీహేమాద్రిపంతు శ్రీ అప్పాసాహెబు కులకర్ణికి జరిగిన సంఘటన వివరించినారు.  ఆ సంఘటన చదివిన తర్వాత 1991 మార్చి 22వ.తారీకు సాయంత్రము నాకు జరిగిన సంఘటన నీకు వ్రాస్తాను.  మార్చి 22వ.తారీకు మాపెండ్లి రోజు.  నేను, మీ అమ్మ ఆరోజున సాయంకాలము కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళినాము.  నేను మీ అమ్మ గుడికి చేరుకొన్న సమయములో గుడిపూజారి గర్భగుడి తలుపులు తీయలేదు.  నేను శ్రీసాయి నామ స్మరణ చేస్తున్నాను.  యింతలో గుడి ముందు వాకలిలో ఒక సాధువు వచ్చి తను విజయవాడ కనక దుర్గమ్మ గుడి దగ్గరనుండి వచ్చినాను అని దక్షిణ కోరినాడు.  నేను వెంటనే ఒక రూపాయి దక్షిణ యిచ్చి పంపివేసినాను.  ఆసాధువు వెళ్ళిపోయిన తర్వాత అరే! ఈ రోజు నాపెండ్లి రోజు కనీసము పది రూపాయలు దక్షిణ యిచ్చి యుండిన బాగుండేది.  సరే ఆసాధువు తిరిగి వెనక్కి వచ్చి అడిగితే పది రూపాయలు దక్షిణగా యివ్వదలచినాను.  యింతలో గుడి పూజారి గర్భ గుడి తలుపులు తీసినారు.  నేను, మీఅమ్మ కుంకుమ అర్చన చేయించి గుడి బయట మెట్లమీద కూర్చుని యున్నాము.  యింతలో ఒక తెల్లని బట్టలు ధరించిన సర్దార్జీ (శిఖ్ సాధువు) గుడికి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మాప్రక్కన వచ్చి కూర్చుని యున్నారు.  ఆయన భుజానికి జోలె యున్నది.  చేతిలో ఒక డబ్బా యుంది. యింకొక చేతిలో పొట్టి కఱ్ఱ యుంది.  ఆవ్యక్తిని చూడగానె నాకళ్ళముందు శ్రీసాయినాధుడు కనిపించసాగినారు.  నేను ఆ సాధువును మీరు ఎక్కడనుండి వస్తున్నారు అని అడిగినాను.  ఆయన తను గోదావరి తీరంలో ఉన్న నాసిక్ లోని ఒక ఆశ్రమమునుండి వస్తున్నాను అని సమాధానము చెప్పినారు.  నామనసులో ఆసాధువు శ్రీసాయి అని తలచి యింతకు ముందు శ్రీసాయికి యిస్తానని అనుకొన్న పది రూపాయలు ఆసాధువుకు యిచ్చినాను.  ఆసాధువు పది రూపాయలు స్వీకరించి మమ్మలను ఆశీర్వదించి వెళ్ళిపోయినారు.  ఆపది రూపాయలు ఆసాధువు స్వీకరించినపుడు నాకంటికి ఆసాధువు శ్రీసాయి లాగ దర్శనము యిచ్చినారు. 

శ్రీహేమాద్రిపంతు ఈ అధ్యాయము చివరలో శ్రీహరిభావు కర్ణిక్ గురించి వ్రాసినారు.  ఆయన చరిత్ర చదివిన తర్వాత నేను 1991 గురుపూర్ణిమనుండి శ్రీసాయి పేరిట వస్త్రదానము చేయాలి అని నిర్ణయించుకొన్నాను.  ప్రతి గురుపూర్ణిమకు శ్రీసాయి పేరిట వస్త్రదానము చేయాలి అని నేను నిర్ణయించుకొన్నానే కాని, ఆనిర్ణయాన్ని అంగీకరించవలసినది శ్రీసాయినాధుడు.  భవిష్యత్ లో గురుపూర్ణిమ ఎలాగ జరుగుతుంది నాచేతిలో లేదు.  అంతా శ్రీసాయినాధుని దయ.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 34వ. అధ్యాయము

$
0
0

                         
                     
28.04.2013 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రెండు రోజులుగా ప్రచురణ చేయలేకపోయాను..నెట్ కనెక్షన్ కి అంతరాయం వల్ల. 
               
         
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 67 వ.శ్లోక, తాత్పర్యం. 

శ్లోకం :  ఉదీర్ణ స్స్ర్వతశ్చక్షురనీశ శ్శాశ్వతష్థిరః                 | 

          భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోకనాశనః     ||  

తాత్పర్యం:  పరమాత్మను పైకి ప్రకాశించువానిగా, అన్నివైపులా చూచువానిగా, తనకి పైన అధిపతిగా, యింకొకరు లేనివానిగా, శాశ్వతునిగా, స్థిరమైనవానిగా, భూలోకమునకు ఆభరణమై వైభవము కలిగించువానిగా, భౌతిక స్థితికి కారణమైనవానిగా, దుఃఖమునకు అతీతుడై దుఃఖము నిర్మూలనము చేయువానిగా ధ్యానము చేయుము.  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
34వ. అధ్యాయము

                                       06.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమను వర్ణించినారు శ్రీహేమాద్రిపంతు.  శ్రీసాయి మహాసమాధి చెందక ముందు జరిగిన లీలలకు సాక్ష్యము శ్రీహేమాద్రిపంతు రచించిన శ్రీసాయి సత్ చరిత్ర.  1918 వ. సంవత్సరము తరవాత జరిగిన శ్రీసాయి లీలలకు సాక్ష్యము సాయి బంధువులే.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి పలికిన మాటలపై నమ్మకము ఉంచుకో.  నమ్మకముతో "ఎవరయితే ఈ మశీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏవ్యాధి చేతను బాధపడరు".  1989 సంవత్సరమునకు ముందు నేను చాలా సార్లు కీళ్ళ నొప్పులు వ్యాధితో బాధపడినాను.  మరి 1990 సంవత్సరము తర్వాత ఈనాటి వరకు ఆవ్యాధి తిరిగి రాలేదు.  బహుశ యిది ద్వారకామాయి మహాత్మ్యము అని భావిస్తాను.  శ్రీసాయి డాక్టర్ పిళ్ళే విషయములో యిలాగ అన్నారు, నిర్భయముగా నుండమను, అతడేల పది జన్మల వరకు బాధపడవలెను?  పది రోజులలో గత జన్మ పాపమును హరింప చేయగలను."  నాదృష్ఠిలో మానవ మాత్రుడు ఎవడు యిటువంటి ధైర్యము కలిగించే మాట పలకలేడు.  సాక్షాత్తు ఆభగవంతుడే శ్రీసాయి రూపములో అవతరించి తన భక్తుల పాపాలను క్షమించి ఆభక్తునికి భగవంతునిపై ఎనలేని విశ్వాసము కలిగేలాగ చూడగలరు.  యిదే అధ్యాయములో శ్రీసాయి మానవ రూపములో అన్న మాటలు వారి ఔన్యత్యాన్ని చాటుతాయి అవి.."నేను భగవంతుడను కాను.  ప్రభువును కాను  నేను వారి నమ్మకమైన బంటును."  ఈ కలియుగములో ఎంతోమంది మహాత్ములు, యోగులు, భగవత్ స్వరూపులు జన్మించారు.  కాని వారు శ్రీసాయి మాట్లాడినట్లుగా మాట్లాడలేదు.  వారు ఎవరూ శ్రీసాయికి సాటికారు.  శ్రీసాయి అనేకమంది వ్యాధిగ్రస్తుల వ్యాధులను నయము చేసినారు.  కొంత మంది భక్తుల వ్యాధులను తానే స్వయముగా అనుభవించి వారిని వారి వ్యాధులనుండి విముక్తి గావించినారు. తన భక్తుల వ్యాధులను నయము చేసేటప్పుడు "అల్లా మాలిక్ హే - అల్లా అచ్చాకరేగా " అనేవారు.  (అందరికీ దేవుడే దిక్కు - దేవుడు అందరికి మేలు చేస్తాడు) ఈనాడు మన మధ్యయున్న యోగులు, సన్యాసులు, భగవంతుని అవతారమని చెప్పుకొనే వ్యక్తులు ఎవరైన ఈవిధమైన మాటలు అనగలగుతున్నారా!  ఒక్కసారి ఆలోచించు.  నీఆలోచనలలో శ్రీసాయిని పూర్తిగా నిలుపుకో.. శ్రీసాయి నిన్ను కాపాడుతారు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(ద్వారకామాయి గీత్ మాలా లో పాత పాటల ప్రసారానికై వీక్షించండి..http://www.facebook.com/dwarakamai?ref=h )

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 35వ. అధ్యాయము

$
0
0

     
            


07.05.2013 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 35వ.అధ్యాయము

సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన ఉత్తరాలు.

గత పది రోజులుగా ప్రచురణకు చాలా ఆలశ్యం జరిగింది..క్షంతవ్యుడను..35వ.అధ్యాయం కాస్త పెద్దది అవడం వల్ల, కాస్త సమయానుకూలంగా ప్రచురణకు తయారు చేసుకుంటూ ఈ రోజుకు ప్రచురిస్తున్నాను..ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 68వ.శ్లోకం, తాత్పర్యం..

    

శ్రీవిష్ణు సహస్రనామం 68వ.శ్లోకం

శ్లోకం :  అర్చిష్మానర్చితః కుంభో విశుధ్ధాత్మా విశోధనః  |

           అనిరుధ్ధో ప్రతిరధః ప్రద్యుమ్నో మితవిక్రమః        ||

పరమాత్మను తంతట తాను ప్రకాశించుచు, అర్చింపబడువానిగా, కుంభరాశియందు వ్యక్తమగు వానిగా, నిర్మలమయిన ఆత్మయను రూపమున తెలియబడువానిగా, మరియూ ఆత్మలను శోధించువానిగా, నిరోధించుటకు సాధ్యముగాని సృష్టియను రూపముగా, ఎదురు లేని రధముగలవానిగా, సృష్టిగా వెలుగుచున్న రూపమైనవానిగా, అమితమయిన పరాక్రమము గలవానిగా ధ్యానము చేయుము. 




పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి  35వ. అధ్యాయము

                                    07.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి చేసి చూపిన చిన్న చిన్న లీలలు, ఊదీ ప్రభావమును వర్ణించినారు.  ఈ లీలలు ఆయా వ్యక్తులకు మాత్రమే పరిమితమమయినవి.  అవి వారిలో చాలా సంతోషమును కలిగించి, శ్రీసాయి పై ఉన్న వ్యతిరేక భావాలను వారి మనసునుండి తొలగించినవి.  కాకా మహాజని స్నేహితుడు ద్వారకామాయి మెట్లు ఎక్కునపుడు శ్రీసాయి ప్రేమతో ఆహ్వానించెను. 



 కాకా మహాజనికి ఆకంఠ ధ్వని తన తండ్రి కంఠ ద్వనిలాగ వినిపించి తన్మయత్వములో తన్ను తాను మరచి శ్రీసాయి పాదాలకు నమస్కరించెను.  యిటువంటి అనుభవము నీజీవితములో జరిగినది. అది నీకు వివరించుతాను.  నీకు ఎనిమిది నెలల ప్రాయములో నాతండ్రి 1974 వ. సంవత్సరములో స్వర్గస్థులైనారు.  ఆనాటి నుండి ఏనాడు ఆయన నాకు కలలో కనబడలేదు. 1989లో నన్ను నేను శ్రీసాయికి అర్పించుకొన్న తర్వాత 1991 అక్టోబరు నెలలో (తేదీ జ్ఞాపకము లేదు).  ఒక రోజు ఉదయము 5 గంటలకు శ్రీసాయి పటమునుండి వచ్చిన మాటలు నేను మరువలేను. "నన్ను పూర్తిగా మరచిపోతున్నావా! నన్ను నీకొడుకు చక్రపాణిలో చూసుకో".  ఆకంఠద్వని చనిపోయిన నాతండ్రిది.  ఒక్కసారి నాలో సంతోషము, ఆశ్చర్యము కలిగినాయి.  దీనిని బట్టి చూస్తే శ్రీసాయి నాకంటే వయసులో పెద్దవారిలోను యున్నారు, మరియు నాకంటే వయసులో చిన్నవారిలోను ఉన్నారు అనేది తెలుస్తున్నది.  

ఇదే విషయమును శ్రీసాయి ఈ విధముగా 15వ.అధ్యాయములో అంటారు, "ఎల్లప్పుడు మీహృదయములోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు".  ఈ విషయమును నిర్ధారణ చేయటానికి ఒక చిన్న సంఘటన ఉదహరించుతాను.  శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడీ ..రావు బహదూర్ ఎం.డబ్ల్యూ.ప్రధాన్ జే.బీ. ఇంగ్లీషు పుస్తకము 39వ. పేజీలో నానా సాహెబు యొక్క ఆఖరి రోజుల అనుభవాలు చదువు. నానా సాహెబు ఆఖరి రోజులలో తన భార్యలో కూడా శ్రీసాయిబాబాను చూడగలిగిన అదృష్ఠశాలి. 

ఈ ఉత్తరములో ఒక ముఖ్యవిషయము వ్రాస్తాను.  నీవు బాబాకు ప్రీతిపాత్రుడువి కాదలచుకుంటే, నీవు స్వయంకృషితో ఆయన గురించి తెలుసుకో.  మధ్యవర్తులు వద్దు.  కావాలంటే మధ్యవర్తుల మాటలు విను కాని వాళ్ళను సద్గురువు అని పిలవవద్దు. ఆవిధముగా పిలిచి సమర్ధ సద్గురువు శ్రీసాయినాధుని నామానికి మచ్చ తేవద్దు.  ఈనాడు చాలా మంది శ్రీసాయిబాబా పేరుతో వాళ్ళే సద్గురువులమని తమ పేరు ముందు సద్గురువు అని పెట్టుకొంటున్నారు.  సంఘములో తాము శ్రీసాయి అంకిత భక్తులుగా చెప్పుకొని చలామణి అగుతున్నారు.  శ్రీసాయి యూనివర్సిటీలో అనేకమంది ఆచార్యులు (ప్రొఫెసర్స్) యుండవచ్చును, కాని  చాన్సలర్ మాత్రము శ్రీసాయి బాబా యొక్కరు మాత్రమే.  అలాగనే శ్రీసాయికి అనేకమంది భక్తులు యుండవచ్చును.  వారు అందరు సద్గురువులు మాత్రము కారు.  

ఎవ్వరైన శ్రీసాయి గురించి చెబితే విను.  దానిలోని మంచిని గ్రహించు. వారి పాదాలకు నమస్కరించినపుడు మాత్రము శ్రీసాయి విశ్వరూప అని తలచుకొని నమస్కరించు.  ఆనమస్కారము శ్రీసాయినాధునికి చెందుతుంది.  శ్రీసాయిసత్ చరిత్రలో శ్రీసాయి కాకామహాజని స్నేహితుని విషయములో ఈవిధముగా అంటారు.  "నీవు దానిని తీసి వేయుము.  మన మధ్యయున్న అడ్డును తీసి వేయుము.  అప్పుడు మనము యొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలసికొనగలము".  శ్రీసాయి ఈ విధముగా చెప్పిన తర్వాత కూడా సాయిభక్తులు శ్రీసాయి గురించి తెలుసుకోవటానికి మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళటము హాస్యాస్పదముగా యుంది.  మరి నీవు నా విషయము ఏమిటి అని ప్రశ్నించుతున్నావు కదూ..మొదట్లో నేను అంటే 1989-90 సంవత్సరాలలో శ్రీసాయి గురించి తెలుసుకోవటానికి మధ్యవర్త్లుల దగ్గరకు సద్గురువులము అని చెప్పినవారి దగ్గరకు వెళ్ళిన మాట నిజమే.  కాని నాలోని తప్పును సరి దిద్దినది శ్రీసాయినాధుడే.  ఒకసారి మనము మన తప్పును సరిదిద్దుకొన్న తర్వాత అటువంటి తప్పు మళ్ళీ చేయము కదా!.

కాకామహాజని యొక్క యజమాని శ్రీసాయిని రక్షించిన విధము (ఎండు ద్రాక్షపళ్ళు సంఘటన) గుర్తు చేసుకో.  అటువంటి సంఘటన నాజీవితములో జరిగినది.  06.02.92 అంటే నిన్నటి దినము (గురువారము)న నిత్యపారాయణ చేస్తున్నాను.  రాత్రి శ్రీసాయికి ఏమి నైవేద్యము పెట్టాలి అని ఆలోచించుతున్నాను. 

వీధిలో కూరలు అమ్మే స్త్రీ ఆనపకాయలు కావాలా అని మీ అమ్మను అడుగుతున్నది.  మీ అమ్మ చికాకుతో అక్కరలేదు అని సమాధానము చెప్పినది.  వారి యిరువురి సంభాషణ నాకు వినిపించుతున్నది.  నేను పారాయణ చేస్తున్నాను కాబట్టి లేచి బయటకు వెళ్ళలేని స్థితి నాది.  ఆ స్త్రీ కాదు అయ్యగార్ని అడుగు అని మీ అమ్మకు చెబుతున్నది.  మీ అమ్మ కోపముతో అమెను కసరి పంపించివేసినది.  నాకు ఆరోజు రాత్రి శ్రీసాయికి ఆనపకాయ కూర నైవేద్యముగా పెట్టాలి అనే కోరిక ఎక్కువ కాసాగినది.  మళ్ళీ ఆనపకాయలు యింటి ముందుకు వస్తే కొని ఆరాత్రి ఆనపకాయ కూర వండాలి అని నిశ్చయించుకొన్నాను.  యింతలో నిత్య పారాయణ పూర్తిచేసినాను. పారాయణ పూర్తి చేసి ముందు గదిలోనికి వచ్చినాను.  యింకొక స్త్రీ గంపనిండ ఆనపకాయలు తెచ్చి మన యింటి గుమ్మములో నిలబడి "సారు ఆనపకాయలు కావాలా అని అడుగుతున్నది.  నాలో సంతోషానికి హద్దులు లేవు.  సంతోషముగా ఒక ఆనపకాయ కొని రాత్రి రొట్టె, ఆనపకాయ కూర తయారు చేసి రాత్రి శ్రీసాయికి నైవేద్యము పెట్టినాను.  శ్రీసాయి సత్ చరిత్ర చదివిన సాయి బంధువులు ఈ సంఘటనను సంతోషకరమైన సంఘటనగా బావించుతారు అని నానమ్మకము.  దాన ధర్మాలు విషయములో శ్రీసాయి చక్కగా చెప్పినారు.  "నేను ఒక రూపాయ దక్షిణ ఎవరి వద్దనైన తీసుకొనిన దానికి పది రెట్లు తిరిగి అతనికి ఇవ్వవలెను.  నేను ఊరకనే ఏమీ తీసుకొనను."  ఈ విషయములో నా అభిప్రాయము తెలియచేయమంటావా - విను.  శ్రీసాయి పేరిట ఒక రూపాయి దానము చేసిన రోజున నామనసులో నాకు తెలియని సంతోషము కలుగుతున్నది.  నాకు ఏనాడు అన్న వస్త్రాలకు లోటు యుండటములేదు.  1989 సంవత్సరము ముందు రోజులలో నేను చాకలివానికి యిస్త్రీ నిమిత్తము డబ్బు యివ్వలేక చేతిని ఉన్న బంగారు ఉంగరము అమ్మి చాలా మానసిక క్షోభ చెందినాను.  1990 తర్వాత నాకు అటువంటి దుస్థితి ఏనాడు కలగ లేదు. యింటికి చేసిన అప్పులు అన్నీ తీర్చివేసినాను.  1990 తర్వాత జీవితములో ఏనాడు అప్పు చేయలేదు.  బ్యాంక్ లో పెద్ద నిల్వ ఏమీ లేదు.  కాని, మనసులో తృప్తి అనే పెద్ద నిల్వ ఏర్పడినది.  బహుశ యిది శ్రీసాయి పేరిట చేసిన ఒక రూపాయి దాన మహాత్మ్యము అయి ఉంటుంది.  ఇదే శ్రీసాయి చేప్పిన "దానికి పది రెట్లు యివ్వవలెను" అంటే పది సుఖ శాంతులు యిచ్చెదను అని అర్ధముగా భావిస్తాను.  యిక్కడ యింకొక అనుభవము వ్రాస్తాను.  నీకు రాత్రివేళ నిద్ర కావాలి అంటే శ్రీసాయిని స్మరించి ద్వారకామాయి ధునిలోని విభూతిని నుదుట పెట్టుకొని పడమటి దిక్కుగా తలను పెట్టుకొని పరుండి నీకు ఉన్న సమస్యలు శ్రీసాయికి తెలియచేయి.  ఆయననుండి సలహాలను కోరు.  శ్రీసాయి నీకు కలలో ఏదో ఒక రూపములో దర్శనము యిచ్చి నీ సమస్యలకు సలహాలు యిస్తారు.యిది నేను ప్రత్యక్షముగా పొందిన అనుభవము. ఇదే విషయాన్ని శ్రీ రావు బహద్దూర్ ఎం.డబ్ల్యు.ప్రధాన్ గారు తన యింగ్లీషు పుస్తకము శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి 49వ.పేజీలో విపులముగా వ్రాసినారు.  ఒకసారి చదువు.  నీనమ్మకమును బలపర్చుకో.  శ్రీ సాయి సత్చరిత్రలో హేమాద్రిపంతు అన్నదానము గురించి చక్కగా వివరించినారు.  శ్రీసాయి పేరిట ఏనాడైన అన్నదానము చేయదలచితే ధైర్యముగా చేయి.  నీవు వండించిన పదార్ధాలు అందరు తిన్న తర్వాత యింకామిగిలి ఉంటాయి అనేది నీవే గ్రహించుతావు.  శ్రీసాయి సత్ చరిత్ర్తలో శ్రీసాయి పాము రూపములో శ్రీబాలాజీ పాటిల్ యింట దర్శనము యిచ్చిన సంఘటన వివరించబడినది.  యిటువంటి అనుభూతిని నేను కూడా పొందినాను.  1982 జనవరి నెలలో ఒక రాత్రి కలలో (తెల్లవారుజామున) నేను రోజు స్నానానికి వేడినీళ్ళు పెట్టుకొనుచున్నాను.  నేను స్నానానికి సిధ్ధపడుతుంటే నాకంటే ముందుగా ఒక పాము స్నానము చేయటానికి బాత్ రూం లోనికి ప్రవేశించేది.  వెంటనే తెలివి వచ్చినది.  దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  కండ్లు మూసుకొన్నాను.  శిరిడీలో శ్రీసాయినాధుని సమాదిపై పూజార్లు గోరువెచ్చని నీరు పోసి శ్రీసాయికి స్నానము చేయించుతున్న దృశ్యము చూడగలిగినాను.  శ్రీసాయి ఈవిధముగా తనకు నిత్యము అభిషేకము చేయమని కోరుతున్నారు అని భావించినాను. ఆరోజునుండి నేను ఉదయము స్నానము పూర్తి చేసిన పిదప చేతిలో నీరు పోసుకొని మనసులో శ్రీసాయిని తలచుకొని ఆనీరు వదలుతాను.  ఆవిధముగా నిత్యము శ్రీసాయికి అభిషేకము చేస్తున్న అనుభూతిని పొందుతున్నాను.  ఈనా అనుభూతిలోని ఆనందమును నేను వర్ణించలేను.  శ్రీసాయి బంధువులు నిత్యము ఈ విధముగా శ్రీసాయికి అభిషేకము చేస్తు, శ్రీసాయినాధుని అనుగ్రహాన్ని పొందగలరని నమ్ముతున్నాను.  శ్రీసాయి నాకు కలలో పాము రూపములో కనిపించిన రోజునే తిరిగి కలలో ఒక ముస్లిం స్నేహితుడు (శ్రీసంద్) రూపములో దర్శనము యిచ్చి తన జీవితములోని అనుభవాలు తన జీవితములో తాను అనుభవించిన కష్టసుఖాలు అన్నిటిని ఉత్తరాలు రూపములో నాకు వ్రాస్తున్నట్లు అనుభూతిని ప్రసాదించినారు.  దీనికి అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  శ్రీసాయి నాచేత నానుభవాలు, కష్టసుఖాలు శ్రీసాయి సత్ చరిత్రతో అన్వయించి నీకు వ్రాయమని ఆదేశించినట్లు భావించి  ఈ ఉత్తరాలు నీకు వ్రాస్తున్నాను.

శ్రీసాయి సేవలో

నీతండ్రి    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)      




పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 36 వ. అధ్యాయము

$
0
0

      
           
10.05.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
 36 వ. అధ్యాయము

(సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన లేఖలు)

ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 69వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  కాలనేమినహా వీర శ్శౌరిశ్శూర ర్జనేశ్వరః     |

         త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః     ||

తాత్పర్యం:  పరమాత్మను కాలనేమి మరియు కేశి అను రాక్షసులను సం హరించువానిగా, జనుల కధిపతియై ప్రకాశించు నాయకునిగా, మరియు శూరునిగా ధ్యానము చేయుము.  ఆయన మూడు లోకములకు ఆత్మ మరియు అదిపతి.  ఆయన దుష్టశక్తులను, పాపములను నాశనము చేయువాడు.   



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 36 వ. అధ్యాయము

                                   08.02.1992

ప్రియమైన చక్రపాణి

ఈ అధ్యాయములో శ్రీసాయి కోరే దక్షిణ వివరాలు, శ్రీసాయి తన భక్తుల కోర్కెలు తీర్చే విధానము చాలా వింతగా యుంటాయి.  వాటిని అర్ధము చేసుకోవటానికి ఆధ్యాత్మిక రంగములో అనుభవము ఉండాలి అనేది తేటతెల్లమగుతుంది.  



ఇద్దరు గోవా పెద్దమనుషులు కథలో శ్రీసాయి ఒక పెద్దమనిషి నుండి దక్షిణ స్వీకరించి, రెండవ పెద్దమనిషి దక్షిణ యిస్తే దానిని నిరాకరించటము చాలా ఆలోచనలు రేకెత్తించుతుంది.  నాజీవితములో కుడా అటువంటి సంఘటన జరిగినది.  1990 వ.సంవత్సరములో ఒక రోజు ఉదయము సికంద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న గణేష్ మందిరానికి వెళ్ళి దర్శనము చేసుకొని బయటకు వచ్చి అక్కడ శ్రీసాయి రూపములో ఉన్న ఒక పెద్ద మనిషి చేయి చాచితే కాదనకుండ ఒక రూపాయి దక్షిణ యిచ్చినాను.  అక్కడనుండి దగ్గరలో ఉన్న శ్రీపాండురంగ విఠల్ గుడికి దర్శనానికి బయలుదేరినాను.  దారిలో శ్రీసాయి నామ స్మరణ చేస్తు శ్రీసాయికి ఎప్పుడూ ఒక రూపాయి మాత్రమే దక్షిణగా యిస్తున్నాను.  శ్రీసాయి నానుండి ఎందుకు ఎక్కువ దక్షిణ కోరటములేదు.  ఎప్పుడైన అడిగితే యింకొక రూపాయి దక్షిణ యిచ్చేవాడిని అని అహంకారముతో నాలో నేను ఆలోచించుతు నడుస్తున్నాను.  దారిలో గోకుల్ లాడ్జి దగ్గరకు వచ్చినాను.  అక్కడ 30 సంవత్సరాల యువఫకీరు నాకేసి చూసి కోపముతో నన్ను పిలచి హిందీలో అన్నమాటలు.."ఏమిటి నేను నీకంటికి బికారివాడిలాగ యున్నానా! తిండిలేక భిక్ష అడుగుతున్నానా! ఏమిటి ఆలోచించుతున్నావు. శ్రీశిరిడీసాయి పేరిట నాకు దక్షిణ ఇయ్యి" అని గట్టిగా మాట్లాడుతుంటే నాకు చాలా భయము వేసినది.  నాతప్పును క్షమించమని వేడుకొంటు నాజేబులోనుండి రెండు రూపాయల నోటు తీసి  ఆయువ ఫకీరుకు యిచ్చినాను.  మనసులో శ్రీసాయికి నమస్కరించి భయముతో వేగముగా నడుస్తు శ్రీపాండురంగ విఠల్ గుడికి చేరుకొన్నాను.  ఈసంఘటన నాలో చాలా ఆలోచనలు రేకెత్తించినది.  శ్రీసాయికి మన మనసులోని మాట సులువుగా తెలిసిపోతుంది.  ఆయన సర్వాంతర్యామి.  ఆయన అందరి హృదయాలను పాలించువాడు అని నిర్ధారణ చేసుకొన్నాను.  నాజీవితములో జరిగిన ఈసంఘటన శ్రీసాయి బంధువులలో చాలా ఆలోచనలును, ఆనందమును కలిగించుతుంది అని నమ్ముతున్నాను.  శ్రీసాయి ఏనాడు ఎవరి దగ్గరనుండి ధనమును భిక్షగా స్వీకరించలేదు.  ధనమును దక్షిణ రూపములోనే స్వీకరించినారు.  నీవు శ్రీసాయికి ఎక్కువ ధనము దక్షిణ రూపములో యిచ్చిన వారు స్వీకరించరు. నీనుండి బాకీ యున్న ధనము మాత్రమే స్వీకరించుతారు అనే విషయాన్ని నేను నమ్ముతాను.  శ్రీసాయి ఆశీర్వదించుతే నాకు కూడా ఎవరినుండి ధనాన్ని ఆశించకుండ బ్రతకాలి అని యుంది.  మరి ఈ నా ఆశను నెరవేర్చవలసినది శ్రీసాయినాధుడు. 

యిక ఔరంగాబాదు కరి భార్యకు 27 సంవత్సరాల తర్వాత శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానము కలగటము అనే విషయానికి శ్రీసాయి సత్ చరిత్ర సాక్షి.  ఇక ఈనాడు మన బంధువులలో నాచెల్లెలు మరిదికి వివాహము అయిన పది సంవత్సరాల తర్వాత శిరిడీయాత్ర అనంతరము శ్రీసాయి ఆశీర్వచనాలతో పుత్ర సంతానము కలగటము, మరియు నాస్నేహితుని కుమార్తెకు వివాహము అయిన ఎనిమిది సంవత్సరాలకు శిరిడీసాయినాధుని సత్ చరిత్ర పారాయణ అనంతరము పుత్ర సంతానము కలగటమునకు నేను సాక్షునిగా నిలబడగలను.  ఈ విషయాలు నీకు ఎందుకు వ్రాస్తున్నాను అంటే శ్రీసాయి మన మధ్య శరీరముతో లేకపోవచ్చును. ఆయన పవిత్ర ఆత్మ మన మధ్యయున్నది.  ఆయనను మనస్పూర్తిగా  శరణు వేడుకొన్నవాడికి జీవితములో సుఖశాంతులకు లోటుయుండదు.  యింట అన్నవస్త్రాదులకు లోటుయుండదు.  శ్రీసాయి భక్తులు లక్ష్మీపుత్రులు మాత్రము కారు అనేది నేను చూసిన నిజము.  నీకు జీవితములో సుఖశాంతులు - నీయింట అన్నవస్త్రాలకు లోటు లేకుండ యుండటము కోరుకొన్నవాడివి అయితే శ్రీసాయి పాదాలకు నమస్కరించి  - శ్రీసాయి శరణు వేడుకో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పాఠకులకు ఒక గమనిక: రేపు హైదరాబాదు వెడుతున్నందువల్ల 4 రోజులపాటు ప్రచురణ సాధ్యపడకపోవచ్చును.  వీలు చిక్కితే కనక బాబా గురించిన లీల ఏదైనా ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.  



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 37వ. అధ్యాయము

$
0
0


            
                  

20.05.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

వారం రోజులుగా హైదరాబాదులో ఉన్నకారణంగా ప్రచురించటానికి వీలుకుదరలేదు..ఈ రోజు, పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి అందిస్తున్నాను చదవండి. 
       
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 70వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః   |

         అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నంతో ధనంజయః       || 

తాత్పర్యం:  పరమాత్మను కోరికలకధిదేవతగా, కోరికలను కలిగించి పాలించువానిగా మరియూ కోరబడినవానిగా ధ్యానము చేయుము.  ఆయన మనయందు శాస్త్రమును, సంప్రదాయమును నిర్మాణము చేయువాడు.  ఆయన శరీరము నిర్దేశించుటకు సాధ్యము కాదు.  చుట్టలుగా విచ్చుకొనుచున్న అనంతుడను కాలసర్పముగా, ధనమును జయించువానిగా ధ్యానము చేయుము. 



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 37వ. అధ్యాయము

                                       09.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి యొక్క గుణగణాలను, చావడి ఉత్సవము గురించిన వివరాలు వ్రాసినారు.  శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు " వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడివారు కారు.  వారు ఎల్లపుడు ఆత్మను సంధానము చేసిడివారు."  



ఆయన మధ్యాహ్న్నవేళలో తీరుబడిగాకూర్చున్నపుడు తన పాత కఫనీల చిరుగులను ఆయనే స్వయముగా కుట్తుకొనేవారు.  ఆపనిని ఆయన భక్తులు ప్రేమగా తాము చేస్తామనిన ఆయన అంగీకరించేవారు కాదు.  ఈవిధమైన పని చేసి తన భక్తులను సోమరితనము వదలమని బోధించినారు.  నిజానికి ఆయన చినిగిపోయిన చొక్కా (కఫనీ) ను కుట్టలేదు.  చితికిపోయిన తన భక్తుల జీవితాలను దగ్గరకు చేర్చి కుట్టేవారు అని మనము గ్రహించాలి.  శ్రీహేమాద్రిపంతు అంటారు "వారి సాంగత్యము వలన మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచు గాక!  ఎల్లపుడు హృదయ పూర్వకమగు భక్తితో వారి పాదాలకు సేవ చేసెదము గాక.  వారిని సకల జీవకోటియందు చూచెదము గాక!  వారి నామమును ఎల్లపుడు ప్రేమించెదము గాక!  హేమాద్రిపంతు ఎంత అదృష్ఠవంతుడు. వారు పలికిన ప్రతి మాటను తమ జీవితములో ఆచరణలో పెట్టి తోటి సాయి బంధువులకు మార్గ దర్శకుడుగా నిలచినాడు.

ఈ విధానాన్ని నీవు నిజముగా పాటించగలిగితే నీవు నిజమైన సాయి భక్తుడుగా మారిపోతావు.  మనము 1918 సంవత్సరము తర్వాత జన్మించినాము.  శ్రీసాయి చావడి ఉత్సవము చూడలేదు.  అందుచేత ఈ అధ్యాయమును శ్రధ్ధ భక్తితో చదువు.  శ్రీసాయిని నీమనసులో నింపుకో.  ఆచావడి ఉత్సవము యొక్క అనుభవాన్ని పొందు.  శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి పీల్చే చిలుము యొక్క అదృష్ఠాన్ని వర్ణించుతారు "జడమగు చిలుము ధన్యమైనది.  మొట్టమొదట అది అనేక తపః పరీక్షలకు నిలబడవలసి వచ్చినది.  కుమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుటవంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్త స్పర్శకు నోచుకొన్నది."  ఒక రోజున నేను ధ్యానములో శ్రీసాయి గురంచి శ్రీసాయి భక్తుల గురించి ఆలోచించుతుంటే ఒక అజ్ఞాత వ్యక్తియొక్క మాటలు వినబడినవి.  "నీజీవితము నిప్పులో కాల్చబడిన యినుప ముద్ద.  దానిపై సమ్మెట దెబ్బలు తగలనీ.  ఆతర్వాత దానిని సాయి అనే ద్రావకములో ముంచబడని -  అతర్వాత ఆ యినుపముద్ద యొక్క రంగు, రూపము చూసుకో".  ఆ అజ్ఞాత వ్యక్తి నా ఆరాధ్య దైవము సాయినాధుడు.  కాలిన యినుపముద్ద నాజీవితము.  సమ్మెట దెబ్బలు నా జీవితములోని అనుభవాలు.  మరి సాయి అనే ద్రావకములో మునిగే భాగ్యము శ్రీసాయి ఎప్పుడు ప్రసాదించుతారు అనే దాని కోసము ఎదురు చూస్తున్నాను.

చావడి ఉత్సవము పూర్తి అయిన తర్వాత భక్తులు అందరు శ్రీసాయికి నమస్కరించి యిండ్లకు వెళ్ళేవారు.  ఆసమయంలో శ్రీసాయి తాత్యాను పిలిచి "నన్ను కాపాడుము.  నీకిష్ఠము యున్నచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నాగూర్చి కనుగొనుచుండుము."  ఈ మాటలు వినటానికి యిబ్బందిగా యున్నది.  కోటానుకోట్ల భక్తులను కాపాడే శ్రీసాయినాధుడు తాత్యాను పిలిచి తన్ను కాపాడమంటాడు ఏమిటి అని ఆలోచించుతున్నావా.  యిక్కడ ఒక చిన్న రహస్యము నీకు చెబుతాను.  శ్రీసాయి ఏనాడు రాత్రివేళలలో నిద్రపోలేదు.  ఆయన రాత్రివేళలలో ద్వారకామాయిలోను, చావడిలోను తన నిజ శరీరాన్ని వదలి సూక్ష్మ శరీరముతో దూరప్రాతాలకు వెళ్ళి తన భక్తులను కాపాడేవారు.  యోగ క్షేమాలు చూసేవారు.  అటువంటి సమయములో నిజ శరీరము ధ్యానములో యండెడిది.  శ్రీసాయి ధ్యానములో యున్న సమయములో ఆయనను ఎవరు పలకరించరాదు.  పొరపాటున పలకరించితే శ్రీసాయికి ధ్యాన భంగము జరిగి శ్రీసాయి భక్తులకు కీడు జరిగేది.  అటువంటిది జరగకుండా యుండటానికి తను ధ్యానములో యున్న సమయములో తన నిజ శరీరాన్ని ఎవరు తాకకుండా యుండటానికి ఆయన తాత్యా సహాయమును, మహల్సాపతి సహాయమును కోరేవారు.  ఈవిషయము ఆర్థర్ ఆస్ బోర్న్ ఆంగ్లములో వ్రాసిన "ది యింక్రెడిబుల్ సాయిబాబా" అనే పుస్తకములో వివరించబడినది.  యిటువంటి విషయాలు నీకు ముందు ముందు యింకా వ్రాస్తాను.  

శెలవా మరి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 38వ. అధ్యాయము

$
0
0
        
           
26.05.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
          
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 71వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  బ్రహ్మణ్యో బ్రహ్మకృద్భ్రహ్మా భ్రక్మ భ్రమ వివర్ధనః    |

         బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః  ||

తాత్పర్యం:  పరమాత్మను బ్రహ్మ ననుసరించువానిగా, సృష్టికర్తను పుట్టించినవానిగా, సృష్టికర్తగా, శ్వాసను జయించినవానిగా, అన్నిటిని అధిగమించి పరమాత్మయొక్క అస్తిత్వమును ఎరిగినవానిగా, తెలుసుకొను వానిగా, యజమానిగా, పరమాత్మను గూర్చి తెలుసుకొనువానిగా, భగవంతుని అనుసరించువారికి ప్రియమయిన వానిగా ధ్యానము చేయుము.  

  పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 38వ. అధ్యాయము

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శిరిడీలో శ్రీసాయి చేసిన అన్నదానం విషయాలు - ఆ అన్నదానములో ఉపయోగించిన వంటపాత్రల వివరాలు - నైవేద్యము తయారు చేసే విధానము, హేమాద్రిపంతుపై శ్రీసాయికి ఉన్న ప్రేమ, వివరించుతారు. 



 శ్రీసాయి సత్ చరిత్రలో అన్నదానం  గురించి విపులముగా వ్రాయబడి యుంది.  "దానములన్నిటిలోను అన్నదానము శ్రేష్ఠమైనది" ఈ విషయము ప్రస్థావించవలసినపుడు నాకు తెలిసిన రెండు పేర్లు  ఉదహరించుతాను.  ఒకటి కోనసీమలో నాస్వగ్రామమునకు దగ్గరలో వక్కలంక గ్రామ వాస్తవ్యురాలు శ్రీమతి డొక్క సీతమ్మగారు, ఆమె ఆస్తి మొత్తము అన్నదానానికి ఖర్చు చేసి, కోనసీమలో అన్నపూర్ణ అని పేరు గడించినది.  ఆమె స్వయముగా వంట చేసి తన పర అనే భేదము లేక ఆగ్రామానికి వచ్చిన అతిధులకు భోజన సదుపాయాలు చూస్తూ ఉండేది.  తను అనారోగ్యముతో బాధ పడుతున్న తన ఆరోగ్యము లెక్క చేయకుండ వంట చేసి అన్నదానము చేసిన పుణ్యాత్మురాలు.  యిక రెండవ వ్యక్తి నా పినతల్లి భర్త శ్రీ ఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు, ఆయనకు పిల్లలు లేకపోయిన ఆయన తన బంధువర్గములోని అనేక మంది పిల్లలను తన యింట ఉంచుకొని విద్యాదానము, అన్నదానము చేసినారు.  అటువంటి పిల్లలలో నేను ఒకడిని అని వినయముగా చెప్పుకొంటాను. 

శ్రీ సోమయాజులు బాబయ్యగారు 29.01.1992 నాడు మరణ శయ్యపై మృత్యువుతో పోరాడుతు తన యింట (గృహప్రవేశము సందర్భముగా) 200 మందికి అన్నదానము చేయించుతు వచ్చిన అతిధులు అందరు భోజనము చేసినారా లేదా అని తెలుసుకొంటు 30.01.1992 గురువారమునాడు శ్రీసాయి మధ్యాహ్న హారతి విన్న తర్వాత 1.20 నిమిషాలకు (ఏకాదశి ఘడియలలో ) శ్రీసాయిలో ఐక్యము చెందినారు.  మరి యిది అన్నదాన ఫలితము కాదా!  నా జీవితములో నేను అన్న దానము చేస్తున్నపుడు జరిగిన సంఘటన నీకు తెలియపర్చుతాను విను.  ఆరోజు అంటే 17.10.1992 విజయదశమి ఉదయము శ్రీసాయికి హారతి యిచ్చిన తర్వాత మనసార "బాబా ఈరోజు నాయింట పదిమంది భోజనము చేసే భాగ్యము ప్రసాదించు.  పదిమంది భోజనము చేసిన తర్వాతనే నేను భోజనము చేస్తాను" అని ఆయన ముందు ప్రమాణము చేసినాను.  మధ్యాహ్న్న హారతి పూర్తి అయినది.  నేను పిలిచిన అతిధులు భోజనానికి రాసాగారు.  మూడు గంటలకు తొమ్మిది మంది భోజనము చేసినారు.  నేను యింకా భోజనము చేయలేదు.  శ్రీసాయి ముందు నేను ప్రమాణము చేసిన ప్రకారము పదిమంది భోజనము చేసిన తర్వాతనే నేను భోజనము చేయాలి.  సాయంత్రము నాలుగు గంటలు  అయినది.  పదవ వ్యక్తి భోజనానికి రావటములేదు.  యింటిలో మీ అమ్మకూడా భోజనము చేసి వేసినది.  నాలో పట్టుదల ఎక్కువ కాసాగినది.  శ్రీసాయి నాయింటికి పదిమందిని భోజనానికి పంపలేరా అనే భావన కలిగినది. 

ఉదయమునుండి ఉపవాసము.  కడుపులో ఆకలిబాధ, పదవ వ్యక్తి రాలేదు అని మనసులో బాధ.  ఏమి చేయాలి తోచక శ్రీసాయినాధుని వైపు చూసాను.  ఆయన చిరునవ్వు నాలో సహనాన్ని పరీక్షించుతున్నది.  శ్రీసాయి ఏనాడు తన భక్తులను ఉపవాసము చేయనీయలేదు అనే మాట నిజమైతే మరి ఈనాడు నాకు ఉపవాస బాధ ఏమిటి.  నేను ఉపవాసము బాధతో ఉంటే శ్రీసాయి చిరునవ్వునకు అర్ధము ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు కావాలి.  ఎవరిని అడగాలి, అనే ఆలోచన రాగానే 16.10.91 నాడు నేను కొన్న యింగ్లీషు పుస్తకము సాయిబాబా ఆఫ్ షిరిడీ , ఎ యూనిక్ సైంట్ ..ఎం.వీ.కామత్, వీ.బీ.ఖేర్ వ్రాసినది ఎదురుగా ఉన్న షోకేసు లో కనిపించినది.  అద్దాలు ప్రక్కకు జరిపి ఆపుస్తకము చేతిలో పట్టుకొని శ్రీసాయిని మనసారా ప్రార్ధించి నీవు ఈ కొత్త పుస్తకము రూపములో నిన్నటిరోజున నాయింటికి వచ్చినావు.  ఈ పుస్తకములో నిన్ను చూడగలుగుతున్నాను.  నీవు నా బాధకు సమాధానము యివ్వాలి.  యిది నాకు పరీక్ష కాదు యిది నీకు పరీక్ష.  నీ భక్తుడు ఉపవాసముతో బాధపడటము నీకు యిష్ఠమయితే నేను ఒక రోజు పూర్తిగా భోజనము చేయకుండ ఉండగలను.  నాయింట పదవ వ్యక్తి భోజనానికి యింకా రాలేదు.  పదవ వ్యక్తి భోజనము పూర్తి అయితేనే నేను భోజనము చేసేది.  యింక సలహా యివ్వవలసినది నీవు అని ఆకొత్త పుస్తకము చేతిలో పట్టుకొని కండ్లు మూసుకొని 135వ.పేజీ తీసినాను.  ఆపేజీలో శ్రీసాయి సమాధానము గురించి వెతకటము ప్రారంభించినాను. 

శ్రీసాయి ఆపేజీ ఆఖరిలో దర్శనము యిచ్చి వాక్యరూపములో తన సలహాను ఈవిధముగా యిచ్చినారు "నన్ను యింకా ఎక్కువగా తినమంటావా! నీవు పోయి భోజనము చేయి".  నాలో ఏదో తెలియని సంతోషము కలిగినది.  శ్రీసాయి సాక్షాత్తు నాయింట పదవ వ్యక్తిగా భోజనము చేసినారా ?  నేను నమ్మలేకపోతున్నాను.  నేను కళ్ళతో ఆపదవ వ్యక్తిని చూడలేదు.  కనీసము జంతు రూపములో నైన రాలేదే.  మరి ఏరూపములో వచ్చి తినియుంటారు అని ఆలోచించుతుంటే శ్రీసాయికి పెట్టిన నైవేద్యము పళ్ళెము దగ్గర ఒక గండు చీమ ప్రదక్షిణాలు చేస్తున్నది.


  శ్రీసాయి సత్ చరిత్ర 9వ.అధ్యాయములో శ్రీసాయి అన్నమాటలు " అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నాయంశములే.  నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను."   గుర్తుకు వచ్చినవి. మనసులో శ్రీసాయికి నమస్కరించి శ్రీసాయి తన భక్తులను ఏనాడు ఉపవాసము ఉండనీయరు అని భావించి సంతోషముతో నేను పదునొండవ వ్యక్తిగా సాయంత్రము 4.45 నిమిషాలకు భోజనము చేసినాను.  దీనిని బట్టి ఒక విషయము నీవు గ్రహించాలి.  శ్రీసాయికి అన్నదానము అంటే చాలా యిష్టము.  అన్నదానము జరుగుతుంటే శ్రీసాయి ఏదో ఒక రూపములో అక్కడ ఉంటారు.  తన భక్తులను ఆశీర్వదించుతారు. 

శ్రీసాయి భగవంతునికి నైవేద్యము ఏవిధముగా పెట్టినారు చూడు.  భక్తులు పిండివంటలు అన్ని తెచ్చి ద్వారకామాయిలో శ్రీసాయి ముందు ఉంచితే శ్రీసాయి ఆ పిండివంటలనుండి కొంచము కొంచము తీసి ఒక పాత్రలో వేసి భగవంతునికి నైవేద్యము సమర్పించేవారు.  దీనిని బట్టి మనము తెలుసుకోవలసినది ఏమిటి?  భగవంతునికి నీవు సమర్పించే పిండివంటల రుచులు కాదు కావలసినది - నీవు భక్తితో ఆపిండివంటలను సమర్పించినది లేనిది చూస్తాడు.  అందుకే శ్రీసాయి ఏనాడు తన భోజనములో రుచులకోసము తాపత్రయ పడలేదు. ఆయన తాపత్రయపడినది భక్తుల ప్రేమకోసము.   ప్రేమతో ఏదైన తినటానికి ఆయనకు సమర్పించు.  ఆయన సంతోషముగా తింటారు.ఒక రోజున నేను శ్రీసాయితో ధ్యానములో ఉండగా శ్రీసాయి అంటారు "అందమైన పంపర పనసపండు కంటే అందము లేని తియ్యటి సపోటాపళ్ళు అంటే నాకు యిష్టము."  శ్రీసాయి మన అందరికి భగవంతుడు.  ఆభగవంతునికి యిష్టమైనది ప్రేమ అనే తియ్యటి సపోటాపండు.  మనము సాయిని ప్రేమించితే మనకు తెలియకుండానే మనము మన తోటివానిలో ఉన్న సాయిని గుర్తించి మన తోటివానిని కూడా ప్రేమించుతాము.

ప్రేమకు మారుపేరు సాయి అని గుర్తు ఉంచుకో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి 
 (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 39 వ.భాగము

$
0
0
    
       

29.05.2013 బుధవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులకు ఒక గమనిక:  ఈ నెల 31వ.తేదీన కాశీ యాత్రకు వెడుతున్నందువల్ల పది రోజులపాటు ప్రచురణకు వీలు కుదరదు.  వచ్చిన తరువాత యధావిధిగా కాశీ యాత్ర విశేషాలతో మరలా  మీముందుంటాను.. సాయిరాం 

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 39వ.భాగము

     

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 72వ.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం:  మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః      |

         మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః   ||

తాత్పర్యం :  పరమాత్మను గొప్ప అడుగులు గలవానిగా, గొప్ప కర్మ గలవానిగా గొప్ప తేజస్సుగా, గొప్ప యజ్ఞముగా, గొప్ప యజ్ఞకర్తగా గొప్ప క్రతువుగా, క్రియ నిర్వాహకునిగా, గొప్ప హవిస్సుగా, ధ్యానము చేయుము.  

వివరణ : పరమాత్మ మూడడుగులలో సమస్తసృష్టిని ఆక్రమించెను.  మిక్కిలి పెద్దవైన తన పాదములలో ఒక పాదముతో భూమిని, ఒక పాదముతో ఆకాశమును, మరియొక పాదముతో తానను ప్రజ్ఞను ఆక్రమించెను. యిదియే త్రివిక్రమావతారము.         


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 39 వ.భాగము

                                                              11.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు శ్రీసాయికి ఉన్న సంస్కృత పరిజ్ఞానము గురించి, బూటీవాడ (రాతిమేడ) నిర్మాణము గురించి వివరించినారు.  



శ్రీసాయి సత్ చరిత్రలో శిరిడీ ప్రజలకు శ్రీసాయిపై గల ప్రేమ అభిమానాలను చక్కగ వర్ణించబడినది.  శ్రీసాయి నామము ఉచ్చరించటానికి ఒక సమయం, ఒక కాలము అవసరము లేదు.  సర్వకాల సర్వ అవస్థలయందు శ్రీసాయి నామము స్మరించవచ్చును.  భగవత్ గీతలోని సంస్కృత శ్లోకానికి శ్రీసాయి చక్కని వివరణ యిచ్చినారు.  నానాసాహెబ్ చందోర్కరు యొక్క గర్వాన్ని శ్రీసాయి ఎంత చక్కగా అణచినారు.  ప్రతిమనిషిలోని విజ్ఞానము ప్రకాశించి యితరులకు వెలుగు ప్రసాదించాలి.  కాని, నానాసాహెబ్ లో సంస్కృత పరిజ్ఞానము అతనిలోని అహంకారాన్ని పెరిగేలాగ చేసినది.  శ్రీసాయి చక్కటి మాటలతో ఆ సంస్కృత శ్లోకానికి అర్ధము విడమర్చి చెప్పి నానా సాహెబ్ చందోర్కర్ లోని గర్వము అణచివేసెను.  యిటువంటి సంఘటనలు ద్వారా శ్రీసాయి మనకు యిచ్చిన సందేశము ఏమిటి అనేది ఆలోచించు.  ఆ సంస్కృత శ్లోకములో నాకు నచ్చిన విషయాలు నీకు తెలియ పర్చుతాను.  "అజ్ఞానము నశింపచేయుటయే జ్ఞానము సంపాదించటము" "చీకటిని తరిమి వేయటమే వెలుతురుని పొందటము" "దైవత్వమును నశింపచేయటము అద్వైతము తెలుసుకోవటము".  ఈ సరళిలో మనము ఆలోచించతే మన పెద్దలు మాట వరసకు అనే మాటలు జ్ఞాపకానికి వస్తాయి.   

నీతోటివాడికి అపకారము చేయకుండ యుండటము ఉపకారము చేసిన అంత ఫలము" "భగవంతుని, యోగులను దూషించకుండ ఉండగలిగితే పూజించినంత ఫలము.  యివి ఎంత చక్కటి మాటలు.  మనము వీటిని మన మెదడులో జ్ఞాపకము ఉంచుకోవాలి.

యిక శిరిడీలో గోపాల్ ముకుంద్ బూటీ నిర్మించిన సమాధి మందిరము గురించి ఆలోచించుదాము.  తనకు ఒక వాడా మందిరముతో సహా నిర్మించమని ఒక రాత్రి శ్యామాకు, బూటీకి కలలొ దర్శనము యిచ్చి చెప్పటము విషయము గురించి ఆశ్చర్యపడుతున్నావా?  శ్రీసాయి సాక్షాత్తు భగవంతుడు కనుక ఒకే సమయములో తన భక్తులకు నిజ స్థితిలోను, స్వప్న స్థితిలోను దర్శనము యివ్వగలరు అనేది నిర్ధారించుకోవచ్చును.  ఈ సంఘటనతో శ్రీసాయి సశరీరముతో శిరిడీలో యున్న రోజులలో యిద్దరు భక్తులకు ఒకే సమయములో కలలో దర్శనము యిచ్చి  తనకు కావలసిన విషయాలు చెప్పటము - మరియు ఈనాడు సశరీరముతో శిరిడీలో లేకపోయిన భక్తులకు స్వప్నములో దర్శనము యివ్వటము  బట్టి శ్రీసాయికి ఆనాడు, ఈనాడు, మరియు ఏనాడు మరణము లేదు అని నిర్ధారించుకోవచ్చును.  14.12.89 గురువారమునాడు మీఅక్క బెంగళూర్ నుంచి శ్రీసాయినాధుని పంచలోహాలు విగ్రహము, మురళిధరుని విగ్రహము తెచ్చి నాకు బహుమతిగా యిచ్చినపుడు శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడిన మాటలు "బాబాయే మురళిధరుడు" నిజము అని నమ్ముతాను.  


14.12.89 నాటికి మీఅక్కకు శ్రీసాయిని గురించిన వివరాలు ఏమీ తెలియకపోయిన శ్రీసాయినాధుడే ఆమె చేత ఆవిగ్రహాలు కొనిపించి నాకు బహుమతిగా యిప్పించినారు అని నమ్ముతాను. 

శ్రీసాయి సేవలో

నీతండ్రి   
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము

$
0
0
         
      
21.06.2013  శుక్రవారము 

ఓం  సాయి శ్రీసాయి జయజయసాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

గత పదిహేనురోజులుగా, కాశీ యాత్ర వలన ప్రచురణకు సాధ్యపడలేదు..మా కాశీ యాత్ర విశేషాలను మీకందరికీ త్వరలోనే అందిస్తాను.కాశీ యాత్ర ముగించుకొని 18వ.తారీకున క్షేమంగా చేరుకొన్నాము..బాబాగారు ముందునుంచీ తను ఉన్నానని నిరూపించారు.తను మాయాత్ర కు ఆమోదం తెలుపుతూ ప్రతిక్షణం మాకు యాత్రలో కనపడుతూనే ఉన్నారు..ఆవిశేషాలన్నిటినీ త్వరలోనే అందిస్తాను..కొన్ని అనివార్య కారణాలవల్ల విష్ణుసహస్రనామం శ్లోకాన్ని అందించలేకపోతున్నాను..


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 40 వ.భాగము

                                              12.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి లీలలను చక్కగా వర్ణించినారు.  ఆ లీలలు చదువుతు ఉంటే అటువంటి సంఘటనలు శ్రీసాయి మనకు కలిగించితే ఎంత బాగుండును అనే కోరిక కలుగుతుంది. 


 ఆకోరికను శ్రీసాయి కార్యాచరణలో పెట్టి తన భక్తునికి సంతోషము కలిగించుతారు.  శ్రీసాయి చూపిన లీలలతో సంతోషము పొందిన సాయి భక్తులలో నేను ఒకడిని.  ఈ ఉత్తరములో నేను శ్రీసాయితో పొందిన అనుభవాన్ని వ్రాస్తాను.  శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు, "సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేద భావమును నశింపచేసి, అప్రాప్యమును ప్రాపింప చేయును".  ఈ విధమైన అనుభవాన్ని నేను పొందినాను.  29.01.1992 నాడు సాయి భక్తుడు, నా పినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల సర్వేశ్వర సోమయాజు గారు శ్రీసాయి యొక్క మధ్యాహ్న్న హారతి పూర్తి అయిన పిదప తను మరణ బాధ పడుతూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని నాతలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించినట్లు అనుభూతి చెందినాను.  శ్రీహేమాద్రిపంతు శ్రీసాయితో తనకు కలిగిన సాయి లీలను వర్ణించినారు. 

సత్ ఛరిత్రలో శ్రీ హేమాద్రిపంతు పొందిన అనుభూతి కూడా వర్ణించబడినది.  "హేమాద్రిపంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను.  అతడు మిగుల ఆశ్చర్యపడెను.  అతని మనసు కరిగెను.  కండ్లనుండి నీరు కారెను.  శరీరము గగుర్పాటు చెందెను.  అతడు వంగి పటములోనున్న బాబా పాదాలను నమస్కరించెను". యిటువంటి అనుభూతి నాజీవితములో పొందినాను.  1990 సంవత్సరము విజయదశమి రోజున మనయింటిలో కొత్తగా శ్రీసాయి పటము పెట్టి అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకొని ఒక వారము రోజులు ముందుగా ఒక చక్కటి సాయిబాబా పటమును కొని, దానికి పటము కట్టి యివ్వమని చెప్పి యింటి దగ్గరలో ఉన్న పటాల వ్యాపారికి 50 రూపాయలు ఎడ్వాన్స్ కూడా యిచ్చినాను.  అతను రెండు రోజులలో పటము కట్టి యిస్తానని మాట యిచ్చినాడు.  అతను తన మాటను నిలబెట్టుకోలేదు.  తెల్లవారితే విజయదశమి.  అపటాల వ్యాపారి సాయిబాబా పటమునకు ఫ్రేం కట్టలేదు.  అతనిని నిలదీసి అడిగితే "మీరు ఎందుకు కంగారు పడతారు.  రాత్రి పటమునకు ఫ్రేం కట్టి మీపూజ సమయమునకు మీ యింటికి తెచ్చి యిస్తాను అని మాట యిచ్చినాడు.నేను నమ్మినాను.  తెల్లవారినది.  విజయదశమి పూజ సమయము అయినది. యింటిలో సాయి సమాధి విగ్రహము కలసియున్న పటములేదు.  బయట దుకాణములలో కొత్త పటము కొనాలంటే చాలా దూరము వెళ్ళాలి.  మధ్యాహ్న్న హారతి సమయము అయినది.  ఏమి చేయాలి తోచలేదు.  శ్రీసాయిని మనసారా తలచుకొన్నాను.  ఈ సమస్యకు పరిష్కారము చూపించమని వేడుకొన్నాను.  నాదగ్గర సాయి సత్ చరిత్ర పుస్తకము కూడా లేదు.  అప్పటికి నేను యింకా శ్రీసాయి సత్ చరిత్ర చదవలేదు.  మనసు పరిపరి విధాల పోతున్నది.  నేను కోరుకొన్న పటము లేదు.  మరి మధ్యాహ్న హారతి ఏవిధముగా చేయాలి అనే ఆలోచనలలో మునిగి నాకు తెలియకుండానే 1989 సంవత్సరములో మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు అక్కడ కొన్న ఒక బొమ్మల పుస్తకము తీసినాను.  అట్ట మీద శ్రీసాయి పటము నన్ను పెద్దగా ఆకర్షించలేదు.  మొదటి పేజీ తీసినాను. నేను కోరుకొన్న రీతిలో ఉన్న సాయిబాబా పటము కనిపించినది.  ఆనాడు హేమాద్రిపంతు పొందిన అనుభూతిని నేను పొందినాను.  వెంటనే పటమును టేబిల్ మీద పెట్టి హారతి యిచ్చినాను.  ఆపుస్తకములో నేను కోరుకొన్న రీతిలో ఉన్న సాయిబాబా పటము ఉంటుంది అని నాకు తెలియదు.  విజయదశమికి ముందు ఆపటాల వ్యాపారిని నమ్మినాను.  అతను తన మాట తప్పినాడు.  ఆఖరి క్షణములో అంటే మధ్యాహ్న్న హారతి సమయమునకు ముందు శ్రీసాయిని పూర్తిగా నమ్మినాను.  శ్రీసాయి తను స్వయముగా ఆపుస్తకములోని పటము రూపములో నాయింటికి వచ్చి నామనసులోని బాధను తొలగించినారు.  క్లిష్ఠ పరిస్థితిలో నీవు మాధవుడిని అంటే భగవంతుని మనసారా నమ్ముకో అంటే శ్రీసాయిని మనసార నమ్ముకో.  ఆయన ఏదో ఒక రూపములో నీకు సహాయము చేయడానికి నీముందుకు వస్తారు.  యిది నమ్ము. 

యిట్లు

నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 41వ.అధ్యాయము

$
0
0

  
       
23.06.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

         

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 73వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  స్తవ్య స్స్తవ ప్రియస్తోత్రం స్తుతిస్స్తోత్రారణప్రియః  |

         పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి ర్నామయః    ||

పరమాత్మను పొగడదగినవానిగా, ప్రార్ధింపబడువాడు, ప్రార్ధించుట, ప్రార్ధన అను మూడు తానేయైనవాడుగా ధ్యానము చేయుము మరియు పూర్ణత్వముగా, పూర్ణత్వము కలిగించువానిగా, పుణ్యమే తన రూపముగా, పుణ్యమును కీర్తివంతము చేయువానిగా, అన్ని అవయవ లోపములూ, బాధలూ తన నామస్మరణచే నిర్మూలించువానిగా, ధ్యానము చేయుము.     

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 41వ.అధ్యాయము

                                   13.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి పటముయొక్క ప్రాముఖ్యము, మధ్యవర్తులు లేకుండ శ్రీ సాయి సేవ చేసుకొనే విధానము, నిత్య పారాయణకు ఉపయోగపడు గ్రంధాలను గురించి శ్రీ హేమాద్రిపంతు చక్కగా వివరించినారు. 



 శ్రీఆలీమహమ్మద్ యింటిలో అనేకమంది యోగుల చిత్రపటాలు జీర్ణావస్థ చెందినవి.  కాని "శ్రీసాయిబాబా యొక్క చిత్ర పటము కాల చక్రమును తప్పించుకొనెను.  దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడు అనియు తెలియుచున్నది".  యిటువంటి సంఘటన నాజీవితములో జరిగినది.  సుమారు 40 సంవత్సరాల క్రితము మాతండ్రిగారు చిన్న సైజు సాయిబాబా పటము కొని ఫ్రేం కట్టించినారు.  ఈనాడు ఆపటము ఫ్రేం కు చెద పట్టినది కాని పటములో జీవము ఉట్టిపడుతున్నది.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు "బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలియును.  చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలుయుచున్నది.  ఈ విషయములో ఎటువంటి సందేహము లేదు.  నాజీవితములో జరిగిన ప్రతి విషయము శ్రీసాయికి తెలుసు.  నేడు ఈ ఉత్తరాలు నీకు వ్రాయటము శ్రీసాయికి తెలుసు.  ఈఉత్తరాలు నీవు చదివిన తర్వాత ఒక్కసారి ఆలోచించు.  శ్రీసాయి సత్ చరిత్రకు నా జీవితానికి గల అవినాభావ సంబంధము.  ఒకరోజున ధ్యానములో యుండగా శ్రీసాయి అంటారు "నాజీవిత చరిత్ర చదివిన తర్వాత నీకు ఏమని అనిపిస్తోంది?  నీజీవితములో కుడా నా ప్రభావము ఉన్నది అని అనిపిస్తోంది కదూ!

శ్రీసాయి సత్ చర్ఫిత్రలో "బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట.  బాబాకు అట్టి వైఖరి యిస్ఠము లేదు.  ఏప్రశ్నకైన సమాధానము యిచ్చుటకు తానే సిధ్ధముగా యుండిరి.  యితరులనడుగుటకు బాబాకు యిష్ఠము లేదు."  శ్రీసాయి సత్ చరిత్రలో యింత వివరముగా వ్రాయబడిన తర్వాత కూడా మనము యితరుల దగ్గరకు వెళ్ళి శ్రీసాయి తత్వము, చరిత్ర తెలిసికోవడము మన అజ్ఞానమునకు నిదర్శనము.  అందుచేత అక్షర జ్ఞానము యున్న ప్రతివాడు శ్రీసాయి సత్ చరిత్రను తమ మాతృభాషలో చదివి తమము తెలియని విషయాలను ధ్యానములో శ్రీ సాయిని అడిగితే బాగుంటుంది.  ఈవిధమైన సాధన చాలా అవసరము.  అంతే గాని మధ్యవర్తుల ద్వారా ఏమి తెలిసికోనవసరము లేదు. 1989-90 సంవాత్సరాలలో నేను శ్రీసాయిని గురించి తెలుసుకొనేందుకు ఒకరిద్దరు మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళిన మాట నిజమే.  కాని ఈనాడు నేను ఆపధ్ధతిని మానివేసినాను.  రాత్రి నిద్రకు ముందు శ్రీసాయిని ధ్యానించి, నాకు తెలియని విషయాలుకు సమాధానము యివ్వవలసినది అని శ్రీసాయిని కోరుతాను.  శ్రీసాయికి నాసమస్యలు విన్నవించుకొంటాను.  శ్రీసాయికి, ఆధ్యాత్మిక రంగములో నాకు తెలియని విషయాలు విన్నవించుకొని సమాధానాలు యివ్వమని వేడుకొంటాను.  సాయి నాపై దయతో అనేక సార్లు దృశ్యరూపములో సమాధానాలు యిచ్చినారు.  సాయి బంధువులు అందరు ఈవిధమైన పధ్ధతి అవలంభించి జీవితములో సుఖశాంతులు పొందగలరని ఆశించెదను.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 
Viewing all 726 articles
Browse latest View live