Quantcast
Channel: Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences in telugu
Viewing all 726 articles
Browse latest View live

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 42వ.అధ్యాయము

$
0
0

   
     
    
14.07.2013 ఆదివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

చాలా రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది..ఆలస్యానికి మన్నించవలసినదిగా బాబావారిని వేడుకుంటు ప్రారంభిస్తున్నాను.

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  42వ.అధ్యాయం
                       
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 74వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:    మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః            |

            వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః   ||

నారాయణుని మనస్సునందలి వేగముగా, సృష్టి బీజముగా, సంపద కలిగించువానిగా, తన సాన్నిధ్యము వలన సంపదగా నిచ్చువానిగా, సృష్టియందలి జీవులయందు నివసించువానిగా, ధ్యానము చేయుము.  సృష్టి సమస్తమూ మహాయజ్ఞమై, విశ్వమే హవిస్సు కాగా అట్టి పరిణామమే తన మనస్సునందలి హవిస్సుగా నయ్యెను.  అవియే ఆయన జీవులకిచ్చు సృష్టియను సంపద.     

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 42వ.అధ్యాయము

                                                             14.02.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయమునకు, నా జీవితానికి గల సంబంధము నేను మాటలలో చెప్పలేను.  నేను అనేక సార్లు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినాను.  42,43,44 అధ్యాయాలు పారాయణ చేస్తున్నపుడు నేను 1918 సంవత్సరానికి వెనక్కి వెళ్ళిపోయి బాబా మహాసమాధి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.  



ఒకసారి వర్తమానములో బాబా మహాసమాధి సంఘటన చూడగలనా అనే ఆలోచన కలిగినది.  శ్రీసాయికి విన్నవించుకొన్నాను.  "సాయినాధ - నీవు 1918 సంవత్స్రరములో మహాసమాధి చెందినావు.  ఈనాటికీ నీఆత్మ, సాయిబంధువుల మధ్య తిరుగుచున్నది.  నీవు శరీరముతో మామధ్య లేని లోటు తీర్చుతున్నది.  కాని నీవు మహాసమాధి చెందినపుడు భక్తులు పొందిన అనుభూతిని నాకు ఈ వర్తమానములో కలుగచేయి తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీసాయి తన భక్తుల కోరికను తప్పక తీర్చుతాడు అనే నమ్మకము నాలో కలిగినది.  ఆ నమ్మకానికి రూపురేఖలు 1992 జనవరిలో జరిగినవి.  ఆవివరాలు ఈ ఉత్తరములో వ్రాస్తాను శ్రధ్ధగా చదువు. 

నాపాలిట సాయి, నాకు అన్నదాత, విద్యాదాత మరియు నాపినతల్లి భర్త అయిన శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గార్కి శ్రీశిరిడీ సాయినాధునిపై 1991 సంవత్సరములో నమ్మకము కలిగినది.  వెంటనె శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినారు.  షిరిడీ వెళ్ళి రావాలని కోరిక వెల్లడించినారు.  అనివార్య కారణాల వలన 1991 డిశంబరులో నాతోపాటు శిరిడీ యాత్ర చేయలేకపోయినారు. 

ఆయనకు 12.01.1992 నాడు మనవడు జన్మించినాడు.  ఆ మనవడికి సాయిశంకర్ అని పేరు పెట్టినారు.  రోజులు ప్రశాంతముగా గడుస్తున్నాయి.  తుఫాన్ వచ్చేముందు కూడ సముద్రము ప్రశాంతముగా యుంటుంది.  23.01.92 గురువారము రోజున ఆయన అనారోగ్యముతో బాధపడుతు నన్ను చూడాలనే కోరికను వెళ్ళబుచ్చినారు.  24.01.92 నాడు ఉదయము 10 గంటలకు ఆయనను చూడటానికి వెళ్ళినాను  ఆయన కళ్ళలో నీళ్ళతో నన్ను కౌగలించుకొని ఏదో తెలియని బాధను వ్యక్త పరచినారు.  సాయంత్రము డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళినాము. ఆయనను పెద్ద ఆసుపత్రిలో చేర్చమని డాక్టర్ సలహా యిచ్చినారు.  వెంటనే ఆయనను పెద్ద నర్సింగ్ హోం లో చేర్చినాము.  పెద్ద డాక్టర్లు ఆయనను పరీక్షించి రోగి పరిస్థితి క్షీణించుచున్నది.  బంధువులందరికి టెలిగ్రాంస్ యివ్వండి అని చెప్పినారు.  అంతకు వారము రోజుల ముందర తమ నూతన గృహానికి గృహ ప్రవేశ ముహూర్తము 12.02.92 నాటికి స్థిర పరచినారు.  ఆయన ఆసుపత్రిలో మరణశయ్యపై భీస్మాచార్యులులాగ బాధపడుతున్నారు.  మూడు లక్షలు పెట్టి నూతనముగా కట్టించుకొన్న యింటిలో ఆయన గృహప్రవేశము చేయగలరా?  అనే ఆలోచన వచ్చినది.  ఆనాడు శ్రీసాయి అనారోగ్యముతో యుండగా లక్షరూపాయలతో శ్రీగోపాల్ ముకుంద్ బూటీ కట్టిన రాతిమేడలో శ్రీసాయి ప్రవేశించి పునీతము చేస్తారా? లేదా? అనే ఆలోచన బూటీకి మరియు యితర భక్తులకు వచ్చినది. 

ఏమి చేయాలి యిటువంటి పరిస్థితిలో అని శ్రీసాయి నామస్మరణ చేసినాను.  12.02.92 నాటి ముహూర్తమునకు ముందుగా ఏదైన ముహూర్తము యున్న బాగుంటుంది అనే ఆలోచనలతో ఆయన అన్నదమ్ములను సంప్రదించి ఆసుపత్రి దగ్గరలో ఉన్న ఒక సిధ్ధాంతిగారి దగ్గరకు వెళ్ళినాను.  ఆసిధ్ధాంతిగారు నన్ను తన పూజా మందిరములోనికి పిలిచినారు.  ఆగదిలో శ్రీసాయినాధుడు పటము రూపములో చిరునవ్వుతో నన్ను ఆహ్వానించినారు.  యిది శుభసూచకము అని భావించినాను. పూజామందిరములో శ్రీసాయినాధుని విగ్రహము ముందు నూనె దీపము వెలుగుచున్నది.  నాలో ఆశాజ్యోతి కలిగినది.  ఆసిధ్ధాంతిగారు 29.01.92 నాడు ఉదయము దశమి ఘడియలలో గం.9.49 నిమిషాలకు ముహూర్తము పెట్టినారు.  శ్రీసాయికి ఆగదిలో సాష్ఠాంగ నమస్కారము చేసి ధైర్యముతో బయటకు వచ్చి నూతన గృహప్రవేశము 29.01.92 నాడు ఉదయము గం.9.49  నిమిషాలకు జరుగును అని బంధువులు అందరికి తెలియపర్చినాను.  ఈవిషయము అనారోగ్యముతో బాధపడుతున్న నాపినతండ్రికి తెలియపర్చినాను.  ఆయన 29.01.92 నాటి వరకు బ్రతకగలనా అని సందేహము వెళ్ళబుచ్చినారు.  ఆయన వయస్సు 73 సంవత్సరాలు.  ఆయనకు పిల్లలు పుట్టలేదు.  తనకు పిల్లలు లేకపోయిన తన బంధువర్గములోని చాలామంది పిల్లలకు అన్నదానము, విద్యాదానము చేసినారు.  ఆయన వలన మేలు పొందినవారిలో నేను ఒకడిని.  ఆయన చేసుకొన్న పుణ్యము అంటు యుంటే 29.01.92 నాడు నూతనముగా నిర్మించుకొన్న గృహములో గృహప్రవేశము చేస్తారు.  కొత్తముహూర్తము శ్రీసాయి సన్నిధిలో పెట్టబడినది.  డాక్టర్ ఈ కొత్త ముహూర్తానికి కూడా నిరాశ వ్యక్త పరుచుతున్నాడు.  ఏమి ఎట్లాగ జరిగిన భారము శ్రీసాయినాధునిపై వేసినాము.  శ్రీసాయినాధుని ఏకాదశ సూత్రములలో తొమ్మిదవ సూత్రము  "మీభారములను నాపై బడవేయుడు, నేను మోసెదను." యిది శ్రీసాయికి పరీక్ష - సాయి భక్తుల నమ్మకానికి పరీక్ష.  23.01.1992 నుండి ఆయన భోజనము చేయుటలేదు.  ఏమీ తినలేని స్థితిలో ఉన్నారు.  శ్రీసాయి దయతో 27.01.1992 నాడు మజ్జిగ త్రాగినారు.  శ్రీసాయి నామస్మరణ చేస్తు 29.01.1992 నాడు గృహప్రవేశ ముహూర్తమునకు ఎదురు చూస్తున్నారు.  27.01.92 రాత్రి ప్రశాంతముగా గడచిపోయినది. 28.01.92 నాడునూతన ఉత్సాహముతో మరణముతో యుధ్ధము ప్రారంభించినారు.  బందువులు అందరు నూతన గృహప్రవేశము జరగకపోవచ్చును అనే ఉద్దేశముతో ఆసుపత్రికి వచ్చి ఆయనను చూసి వెళుతున్నారు.  28.01.92 నాడు ఆయన బాధ చూడలేక డాక్టర్లు  మత్తుమందు యిచ్చినారు.  29.01.92 నాడు ఉదయము చిరునవ్వుతో మేల్కొన్నారు.  ఆయన ముఖములో చిరునవ్వు యున్నది.  కాని, అక్కడి డాక్టర్ల ముఖములో నిరాశ, ఆందోళన వ్యక్తమగుతున్నాయి.  గృహప్రవేశము ముహూర్తమునకు యింకారెండు గంటల వ్యవధి యున్నది.  నాలోని ఆశాజ్యోతి మినుకు మినుకుమని గాలికి ఆరిపోతున్న భావన కలుగుతున్నది.  రోగి కళ్ళలో తను తన నూతన గృహానికి వెళ్ళిపోవాలి అనే కోరిక కనబడుతున్నది.  మళ్ళీ సిధ్ధాంతిగారి దగ్గరకు వెళ్ళినాను.  అక్కడ పటము రూపములో ఉన్న శ్రీసాయినాధుడు చిరునవ్వుతో ప్రశాంతముగా యున్నారు.  ఆయన  భక్తులు తుఫాన్ లో కొట్టుకొంటున్నారు.  శ్రీసాయి చిరునవ్వుకు అర్ధము ఏమిటి?  నాలో ఏదో తెలియనై ధైర్యము వచ్చినది. పరిస్థితిని సిధ్ధాంతిగారికి  తెలియచేసినాను. ఆయన  పంచాంగము చూసి దశమి ఘడియలు ఉదయము 9 గంటలకు వస్తాయి.  అందుచేత 9గంటల తర్వాత గృహప్రవేశము చేయించండి అన్నారు.  వెంటనే ఆసుపత్రికి వచ్చి రోగికి విభూతి స్నానముచేయించి నూతన వస్త్రాలు ధరింపచేసి గం.8.30 నిమిషాలకు ఆంబులెన్సు తీసుకొని వచ్చి, ఆయన నూతన గృహానికి తీసుకొని వెళ్ళటానికి సిధ్ధపడినాను.  

ఈ విధముగా రోగిని తీసుకొని వెళ్ళటానికి డాక్టర్ ఆంగీకరించటములేదు.  శ్రీసాయికి నమస్కరించినాను.  యిది శ్రీసాయి నాకు పెట్టిన పరీక్ష.  ధైర్యముగా రోగిని నూతన గృహానికి తీసుకొని వెళ్ళినాను. 

బంధువులు అందరు శ్రీసోమయాజులుగారి రాక కోసము ఎదురు చూస్తున్నారు.  అందరి కళ్ళు ఆంబులెన్సు నుండి స్ట్రక్చరు మీద పరుండి బయటకు  చూస్తున్న రోగిమీద యున్నాయి.  కాని, రోగి కళ్ళు మాత్రము తన నూతన గృహముమీద యున్నాయి.  ఆక్షణము శ్రీసాయి నామస్మరణ చేస్తున్నాను.  టైము సరిగ్గా ఉదయము 9 గంటలు. సన్నాయి వాద్యము మ్రోగుతున్నది.  రోగి నడవలేడు.  స్ట్రక్చర్ మీద పరుండి యున్నాడు.  ప్రక్కన నాపినతల్లి, గుమ్మడికాయతో పురోహితుడు, అందరము కలసి గృహపవేశము చేసినాము  అప్పుడు అర్ధమైనది.  శ్రీసాయినాధును చిరునవ్వు.  మానసికముగా మేము అందరము చాలా బాధపడినాము కాని శ్రీసాయినాధుడు చిరునవ్వుతో హృహప్రవేశ భారాన్ని స్వీకరించి తన మాటను నిలుపుకొన్నారు.  గృహప్రవేశము జరిపించినారు.  యిది శ్రీసాయి లీల కాదా!  ఆయన యిచ్చిన ఏకాదశ సూత్రాలకు సాక్ష్యము కాదా!  ఒక్కసారి ఆలోచించు.  ఆయననే నమ్ముకో.  మిగతా విషయాలు రేపటికి ఉత్తరములో వ్రాస్తాను.  

నీతండ్రి

(సర్వం  శ్రీసాయినాధార్పణమస్తు)      


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 16,17 అధ్యాయములు

$
0
0
        
                
        
20.03.2013  బుదవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
       

        
శ్రీ విష్ణుసహస్ర నామం 51వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  ధర్మగుప్ ధర్మకృధ్ధర్మీ సదసక్షర మక్షరం    |

              అవిజ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః       ||

తాత్పర్యం:  నారాయణుడు ధర్మమును నిర్మించువాడు.  మరియు అదిపతి, మరియు తనయందు గుప్తముగా నుంచుకొనువాడు.  ఆయన ఉండుట, లేకుండుట అను రెండూ తానేయైనవాడు మరియు నశించువాడు, నశింపనివాడు కూడా.  ఆయన తన వేయి కిరణములతో ఎవరి స్థానమున వారిని నియమించువాడు.  ఆయన జ్ఞానమే ఆయనకు తెలియలేదు.  అనేక లక్షణములు, సిధ్ధాంతములు ఆయనను గూర్చి కల్పింపబడినను ఆయనను తెలియుటలేదు.   

  పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి  - 

  16,17 అధ్యాయములు

                              
                              
                                                        21.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు 16,17 అధ్యాయములు ఒకేచోట వ్రాసినారు.  అందుచేత నేను ఈ రెండు అధ్యయములుపైన ఒకటే ఉత్తరము వ్రాస్తున్నాను.  



బ్రహ్మజ్ఞానము విషయములో శ్రీసాయి యొక్క ఆలోచనలనుశ్రీహేమాద్రిపంతు చక్కగా వివరించినారు.  ఈ బ్రహ్మజ్ఞానము అందరికి అంత సులువుగా అబ్బదు.  బ్రహ్మ జ్ఞానమును   సంపాదించవలెనని తపన మానవుని జీవితములో తృప్తిని మిగుల్చుతుంది.  తృప్తితో గడిపిన జీవితము ధన్యము.  అందుచేత ప్రతి ఒక్కరు బ్రహ్మ జ్ఞానము సంపాదించాలి అనే తపనతో జీవితము గడపాలి.  1991 ఏప్రియల్ నెలలో ఒకనాటి   రాత్రి భయంకరమైన కల వచ్చినది.  నేను ఒక సరస్సులో పెద్ద పెద్ద మొసళ్ళు మధ్య జీవితము గడుపుతున్నాను.  
         
ఆజీవితము చాలా బాధాకరముగా యున్నది.  అనుక్షణము భయంతో వణికిపోసాగాను.  ఉదయము లేచి సాయి సత్ చరిత్రలో ఈకలకు అర్ధము వెతికినాను.  16,17 అధ్యాయములో 147 పేజీలో నాకు అర్ధము దొరికినది.  ఆనాటినుండి జీవితమునుండి అసూయ, అహంభావములను పారద్రోలడానికి ప్రయత్నించుచున్నాను.  ఈ నాప్రయత్నములో శ్రీసాయి నాతోడు ఉంటే అదేనాకు గొప్ప అదృష్ఠము.  బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు శ్రీసాయి చూపిన యోగ్యత విషయములో ప్రయత్నము చేయుము.  ఈచిన్న వయసులో ప్రయత్నము మొదలిడిన నీ సంసార బాధ్యతలు తీరునాటికి బ్రహ్మజ్ఞాన సంపాదనపై ఆసక్తి కలుగుతుంది.
          
ఆరోజులలో 01.01.1991 ఉదయము 6 గంటలకు శ్రీసాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయములు పారాయణ చేయు చున్నాను. 147 వ. పేజీలో శ్రీసాయి పలికిన మాటలు నన్ను చాలా ఆకర్షించినవి.  అవి "నాఖజానా నిండుగానున్నది.  ఎవరికేది కావలసిన, దానిని వారికివ్వగలను.  కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను.  నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు.  ఈమశీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను".  నామనస్సు లో సంతోషము కలిగినది.  ఉ. 8.30 నిమిషాలకు ఆఫీసుకు బయలుదేరుతున్న సమయములో శ్రీసాయి భక్తురాలు శ్రీమతి రాజ్ మన యింటికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగు కార్డు యిచ్చినారు.  ఆకార్డుపై చిరునవ్వుతో శ్రీసాయిబాబా ఫొటో.  ఆఫొటో క్రింద శ్రీసాయి సందేశము -  ఆసందేశము నేను ఆనాడు నిత్యపారాయణలో పొందిన "నాఖజానా నిండుగా నున్నది........నీవు తప్పక మేలు పొందెదవు".   సందేశము ఒకటి కావడము నేను దానిని శ్రీసాయి లీలగా భావించి శ్రీసాయికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. 
శ్రీసాయి సేవలో


నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 18,19 అధ్యాయములు

$
0
0
                         
                                        
                              
                                       
24.03.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 

గత మూడు రోజులుగా మన బ్లాగులో రత్నమణి సాయి అందించలేకపోయాను.. మన్నించాలి... ఈ రోజు 16,17 అధ్యాయాలు చదవండి...
                           

శ్రీవిష్ణు సహస్రనామం 52వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:     గభస్తినేమిస్సత్తత్వస్థస్సిం హో భూత మహేశ్వరః   |  

             ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః   ||

తాత్పర్యం:  నారయణుని మార్గము సూర్యగోళము యొక్క వెలుగుచే నిర్ణయింపబడుచున్నది.  ఆయన మనయందు, సామ్యముగను, సిం హముగను, అన్ని భూతములయందలి ఈశ్వరునిగా, మొట్టమొదటి దేవునిగా, మహాదేవునిగా, దేవతలకధిపతిగా, మరియు దేవతలను సం రక్షించువానిగా, ఉపదేశకునిగా ధ్యానము చేయవలెను.   


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
18,19 అధ్యాయములు
                                                                                                22.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో 18-19 అధ్యాయములలోని విషయాలపై నాకు తోచిన అభిప్రాయాలు నీకు తెలియ చేస్తాను.  ఈ నా అభిప్రాయాలను నీవు అర్ధము చేసుకొనిన తర్వాత నీ స్నేహితులకు కూడా పనికివస్తుంది అని తలచిననాడు ఈ ఉత్తరాలు నీ స్నేహితుల చేత కూడా చదివించు. 



 ఈ విషయములో శ్రీ హేమాద్రిపంతు తెలియచేసిన సంగతి నీవు గుర్తు చేసుకో.  అదే సద్గురువు వర్షాకాలము మేఘము వంటివారు.  వారు తమ అమృత తుల్యములైన భోదలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిసెదరు.  వానిని మనముభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా యితరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. యింకొక విషయము నిన్న రాత్రి షిరిడీ డైరీ ఆఫ్ ది హానరబుల్ మిస్టర్ జీ.ఎస్.ఖపర్డే పూర్తిగా చదివినాను.  ఈ రోజు ఉదయము శ్రీ ఖాపర్దే డైరీ తిరిగి అలమారులో పెడుతుంటే ఎందుకో బాబానుండి సందేశము పొందాలని మనసులో కోరిక పుట్టి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరచినాను. (పేజీ 69).  శ్రీ ఖాపర్దే  మరియు శ్రీసాయి మీద 30.01.1912 నాడు జరిగిన సంభాషణ.  "నేను ఉత్తరాలు వ్రాసానని చెపితే, ఆయన నవ్వి సోమరిగా  కంటే ఏదో పనిలో చేతులు కదలటమె మంచిది "   అనే సందేశము వచ్చినది.  నీకు జ్ఞాపకము ఉండే యుంటుంది.  నారెండవ ఉత్తరములో శ్రీసాయి గురించిన ఉత్తరాలు వ్రాయడానికి ప్రోత్సాహము 06.01.1992 నాడు మీఅమ్మనుండి లభించినది.  ఈ ఉత్తరాలు ఈ విధముగా నీకు వ్రాయడానికి శ్రీసాయినుండి అనుమతి ఈ రోజునే లభించినది.  శ్రీసాయి ఆశీర్వచనాలతో శ్రీ సాయి జీవిత చరిత్రపై నీకు 48 ఉత్తరాలు వ్రాయగలను అనే ధైర్యము ఈక్షణములో కలిగినది.  శ్రీసాయి ఈ ధైర్యమును నామనసులో సదా కలిగించుతు ఉంటారని నా నమ్మకము.  శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అంటారు.  "వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింప చేయును.  వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు".  యిది అక్షరాల నిజము.  నేను చేసిన పాపాల కర్మలు ముగిసిన నాకు మంచిరోజులు (1989)  వచ్చే  సమయలో భగవంతుడు శ్రీసాయి అనే యోగీశ్వరుని పాదాలు నాకు చూపించినారు.  ఈరోజున నేను శ్రీసాయి పాదాలపై నా శిరస్సు ఉంచి ఆయన శరణు కోరుతున్నాను.  శ్రీసాయి హరివినాయ సాఠే చేత ఏడు రోజులలో గురుచరిత్ర పారాయణ చేయించినారు అనే విషయము వ్రాయబడియుంది. శ్రీసాయి నాచేత 1991లో గురుచరిత్ర ఏడురోజులలో పారాయణ చేయించినారు.  మీ అమ్మచేత రోజుకు ఒక అధ్యాయము పారాయణ చేయించినారు.  అది మా అదృష్టముగా భావించుతాము.  శ్రీసాయి సత్ చరిత్రలో భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా అంత త్వరగా సహాయపడును అని చెప్పబడింది. ఒక్కొక్కపుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును అని వ్రా యబడినది.  నేను పట్టుదలతో 07.06.1990 నుండి శ్రీసాయిబాబా జీవిత చరిత్రను నిత్యపారాయణ చేస్తున్నాను.  
ఈ నిత్యపారాయణ ఫలితమును నేను చూడలేను.  కారణము నేను కోరుకొన్న కోరిక అటువంటిది.  ఆకోరిక చెప్పమంటావ - బాధపడవద్దు - నేను నిత్య పారాయణ చేస్తున్న సమయములో ప్రశాంతముగా కన్నుమూయాలి అనే కోరిక.  ఈ కోరిక తీర్చవలసినది శ్రీసాయి.  ఈకోరిక తీరినది లేనిని అనేదానికి సాక్షిగా నిలబడవలసినది నీవు.

గురువుకు మనము యివ్వగలిగినది రెండు కాసులు. ఒకటి ఢృఢమైన విశ్వాసము (శ్రధ్ధ) రెండవది ఓపిక (సహనము) అని శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది.  నీవు శ్రీసాయిని నీగురువుగా భావించితే నీవు కూడ శ్రధ్ధ, సహనములతో ఆయనను పూజించు.  శ్రీసాయి అనుగ్రహము పొందటానికి ప్రయత్నించు.  నేను నీకు యిచ్చిన ఈసలహానునీవు నీపిల్లలకు యిచ్చిన నాకు సంతోషము. నీవు శ్రీసాయిని నమ్మితే ఒక విషయము జ్ఞాపకము ఉంచుకో.  మంత్రమునకు గాని, యుపదేశమునకు గాని ఎవ్వరి వద్దకు పోవద్దు. ఈవిషయములో శ్రీహేమాద్రిపంతు తన ఆలోచనలను వివరముగా శ్రీసాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  ఒకసారి బాగా చదివి అర్ధము చేసుకో.  నేను 1989 నుండి 1991 వరకు శ్రీసాయి గురించి తెలుసుకోవాలని తపనతో ఎంతో మంది దగ్గరకు వెళ్ళినాను.  నాకు తృప్తి కలగలేదు.  శ్రీసాయి తన భక్తుడు శ్రీ బీ.వి.దేవుతో ఏవిషయమైన తెలుసుకోదలచిన తననే స్వయముగా అడిగి తెలుసుకోమన్న విషయము నేను గుర్తు చేసుకొంటు సరాసరి శ్రీసాయిని అడిగి తెలుసుకోవటము ప్రారంభించినాను.

ఇక్కడ నీకు ఒక సలహా యిస్తాను పాటించు.  నీవు హేమాద్రిపంతు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రకు యింగ్లీషు తెలుగు అనువాదాలు చదువు.  శ్రీసాయి తత్వాన్ని గ్రహించు.  శ్రీసాయి తత్వము అనే బాటలో ముందుకు సాగిపోతు కొంత జీవితాన్ని అనుభవించు.

ఇదే విషయము హేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్రలో ఈ విధముగా అన్నారు.  "అవును బాబా! నా మనస్చాం చల్యము నిష్క్రమించినది.  నాకు నిజమైన శాంతి , విశ్రాంతి కలిగినది.  సత్యమార్గమును కనుగొనగలిగితిని".  ఈ మాటలలో ని అర్దాన్ని నీవు తెలుసుకొంటావు.  గురు శిష్యుల సంబంధముపై శ్రీసాయి చక్కటి ఉదాహరణ యిచ్చినారు.  అది తల్లి తబేలు పిల్ల తాబేలు జీవన విధానము.  యిటువంటి ఉదాహరణ యింకొకటి నేను చెబుతాను.  మన హిందూ సాంస్కృతిలో పిల్లల భవిష్యత్ కోసము, వారి ఆరోగ్యము కోసము తల్లి ఉపవాసములు, పూజలు, నోము, వ్రతాలు ఆచరించుతుంది.  దీని అర్ధము ఏమిటి ఒక్కసారి ఆలోచించు.  తల్లినుండి పిల్లలు శారీరకముగా ఎంత దూరములో ఉన్న ఆపిల్లలు తల్లి మనసులో అంత దగ్గరగా యుండటము చేతనే ఆతల్లి తన పిల్లల యోగక్షేమము కోసము నోములు వ్రతాలు చేస్తుంది.   అదే విధముగా శ్రీసాయి యొక్క భక్తులు శ్రీసాయి మనసులో చోటు చేసుకొని శ్రీసాయి యొక్క ప్రేమ అనురాగాలను ఆనాడు, ఈనాడు పొందగలగుతున్నారు.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి చెప్పిన ఈమాటలు గుర్తు చేసుకో - "ఏదైన సంబంధముండనిదే ఒకరు యింకొకరి వద్దకు పోరు.  ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీవద్దకు వచ్చినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమి వేయకు.  ఈ విషయము నీకు ఎక్కువ వ్రాయనక్కరలేదు.  కారణము మన యింటిలోనికి నెల రోజుల క్రితము ఉదయము 5 గం టలకు పాలవాడి  వెనకాలనే వచ్చిన చిల్లి (పిల్లి) మన యింట పెంపుడు పిల్లిగా మారిపోయిన సంగతి నీకు బాగా గుర్తు యుండి యుంటుంది  కనుక.  శ్రీసాయి యింకొక విషయము చెప్పినారు. "నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము.  అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును.  నాకునీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగానుంచుచున్నది .  దానిని నశింపజేయనిదే మన ఐక్యత కలుగదు.  అందుచేత ఈవిషయము గుర్తించి నీవు ప్రత్యక్షముగా శ్రీసాయితో సంబంధము పెట్టుకో.  మధ్య వర్తులకు దూరంగా యుండు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయికి త్రాగుబోతులు అంటే అసహ్యము అని హేమాద్రిపంతు తెలియచేసినారు.  బహుశ ఇదే కారణము అయి ఉండవచ్చును.  నేను 1991 నుండి త్రాగుడు మానివేసినాను.  ఈరోజున నేను సారాయికి బానిసను గాను, సాయికి మాత్రమే బా.ని.స. ను.  యిది నా అదృష్టము.  శ్రీసాయి సత్ చరిత్రలో  కష్టమునకు కూలి అనే విషయములో శ్రీసాయి అంటారు.  "ఒకరి కష్టమును యింకొకరు ఉంచుకొనరాదు".  దాని వలన ఎదుటివానికి సుఖము, నీకు తృప్తి మిగులుతుంది.

శ్రీసాయి సేవలో
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 20వ.అధ్యాయము

$
0
0
                                   
                  
               
               
25.03.2013 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్రనామం 53వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞాన గమ్యః పురాతనః    |

             శరీర భూత భృత్ భోక్త కపీంద్రో భూరిదక్షిణః ||

తాత్పర్యం:  పరమాత్మను రోజురోజుకూ ఉత్తముడైనవానిగా, ఉచ్చస్థితిలో నున్నవానిగా ధ్యానము చేయుము.  ఆయన మహా వృషభము, మరియు గుప్తముగానుండి రక్షించువాడు.  మిక్కిలి పురాతనమై జీవించి యున్నవాడు.  జ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపదగినవాడు.  శరీరమునందలి పంచభూతములను నిర్వహించుచు మరల శరీరమునందే యుండి భుజించి తృప్తి పడువాడు.  హనుమంతునిగా అవరరించినవాడు, యజ్ఞమును నిర్వహించునప్పుడు విశేషముగా సంపదలను పంచిపెట్టువాడు. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
20వ.అధ్యాయము

                              
                              
                                                    23.01.1992

ప్ర్లియమైన చక్రపాణి,

ఈ రోజు తెల్లవారుఝామున వచ్చిన కలను నీకు ముందుగా తెలియచేసి ఆ తర్వాత శ్రీసాయి సత్ చరిత్రలోని 20వ. అధ్యాయము గురించి  వివరించుతాను.  ఈరోజు తెల్లవారుఝామున (23.01.1994 - ఉ.4) వచ్చిన కలలోని వివరాలు "నేను మరియు మరికొంతమంది నదిలో నావలో ప్రయాణము చేస్తున్నాము. 



 నది మధ్యలో యింకొక పడవలో శ్రీసత్యసాయి మరియు  యిద్దరు భక్తులు యున్నారు.  శ్రీసత్యసాయి  నదీమతల్లిని ఆశీర్వదించుతున్నారు.  నాకుశ్ రీసత్యసాయి ఉన్న పడవ దగ్గరకు వెళ్ళవలెనని అనిపించినది .  నేను ఉన్న పడవవానికి రెండురూపాయలు యిచ్చినాను.  నన్ను సత్యసాయి పడవదగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరినాను.
నేనున్న పడవను నడిపేవాడు నేను కోరినట్లుగా చేసినాడు.  శ్రీసత్యసాయి నాభుజముపై చేయి వేసి శ్రీసాయిని ధ్యానించమన్నారు.  నేను కొంచముసేపు ధ్యానము చేసినాను.  వినూత్నమైన భావన, ఆనందము కలిగినది.  కళ్ళు తెరచి చూసినాను.  శ్రీసత్యసాయి నేను ఉన్న పడవలోని యితర భక్తుల భుజముపై చేయి వేయగానే వారు చాలా బాధతో గిలగిల్లాడిపోయినారు.  (1964 సంవత్సరములో నేను అటువంటి బాధ పడినాను) యింతలో నాకు తెలివి వచ్చినది.  యిది అంతా కల కదా అనిపించినది.  ఈకలకు అర్ధము ఏమిటి అని ఆలోచించినాను.  నేను ప్రయాణము చేస్తున్న నావను నడుపుతున్నది శ్రీశిరిడీసాయి.  నానుండి రెండురూపాయలు దక్షిణ తీసుకొని నామన్సులోని కోరికను తీర్చగలిగింది శ్రీ  శిరిడీసాయి కాక యింక ఎవరు?  శ్రీశిరిడీ సాయి 1964 సంవత్సరములో శ్రీసత్యసాయి రూపములో నాభుజముపై చేయి వేసినపుడు నేను గిలగిలలాడిపోయినాను. నా గతాన్ని నామనసులోని కోరికను గ్రహించి శ్రీశిరిడీసాయి, సత్యసాయి రూపములో నేను ప్రయాణము చేస్తున్న నదిలో యింకొక పడవలో నిలబడి నాకు దర్శనము యిచ్చి నాకోరిక తీర్చినారు.

            
ఈ విధముగా శిరిడీసాయి, తాను సత్యసాయిలోను ఉన్నాను అని తెలియచేస్తున్నారు.  శ్రీశిరిడీసాయి మనము ఏరూపములో కోరితే ఆరూపములో దర్శనము యిచ్చి మన ఆధ్యాత్మిక ప్రగతికి సహాయము పడే సమర్ధ సద్గురువు.  అటువంటి సద్గురువు పాదాలను నమ్ముకోవటము మన పూర్వ జన్మ పుణ్యఫలము.  యింక 20వ. అధ్యాములో శ్రీసాయి తన భక్తులు భోజనము విషయములో ఎంతో శ్రధ్ధ కనపరచి పేరుపేరున పిలచి "అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా నీబసకు పో, బాపూ, భోజనము చేయుము" అని పలకరించేవారు.   
         

యిది యదార్ధము అనే  భావన నాలో కలిగినది.  నాజీవితములో జరిగిన ఒక సంఘటన నీకు తెలుపుతాను.  అది చదివిన తర్వాత నీకు కూడా నాభావముతో ఏకీభవించుతావు.  అది విజయదశమి రోజు (29.09.1990).  ఆనాడు నాయింటికి మన యిల్లు కట్టిన తాపీ పనివాళ్ళను, కూలీలను భోజనమునకు పిలిచినాను. శ్రీసాయికి మధ్యాహ్న్న హారతి యిచ్చి అందరికి వడ్డనలు ప్రారంభించినాను.  వచ్చినవాళ్ళలో నాయింట పని చేయని ఒక పది సంవత్సరాల బాలుడు యున్నాడు.  బహుశ నాయింట పనిచేసిన తాపీ మేస్త్రీ బంధువు అయి ఉండవచ్చును అని తలచినాను.  అందరికి మిఠాయి వడ్డించుతున్నాను.  ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చి మిఠాయి వడ్డించుతుంటే ఆవిస్తరి గాలికి ఎగిరిపోయినది.  లడ్డు నేలమీద వడ్డించవలసి వచ్చినది.  ఆకును సరిచేసి తిరిగి ఆలడ్డుని విస్తరాకులో పెట్టినాను.  ఆకుర్రవానికి ఏమి పట్టనట్లుగా లేదు.  తన ప్రక్కవారి కేసి చూస్తున్నాడు.  తిరిగి బిరియాని వడ్డించుతు ఆకుర్రవాని విస్తరి దగ్గరకు వచ్చినాను.  బిరియాని వడ్డించుతుంటే విస్తరాకు గాలికి ఎగిరిపొయినది.  బిరియాని నేలపై వడ్డించినాను.
శ్రీసాయి తన భక్తుడు దాసుగణుకు ఈశావాస్యోపనిషత్తును ఆచరణలో చూపించిన విధానము నీవు బాగా చదువు.  కష్ఠసుఖాలు అనేవి మన భావనలు.  అవి మనోవైఖరిపై ఆధారపడి యుండునని గ్రహించు.   భగవంతుడు మనకు యిచ్చినదానితో సంతోషము పడవలెను.  యితరుల సొమ్మును మనము ఆశించరాదు.  మనకు ఉన్నదానితో సంతుష్టి చెందవలెను.. యివి అన్నీ మనము ఆచరణలో పేట్టగలిగిన రోజున జీవితములో అశాంతి అనేది చోటు చేసుకోదు.  తృప్తిగా సుఖప్రదమైన జీవితాన్ని గడపవచ్చు.   

అటువంటి జీవితాన్ని నీకు సాయి ప్రసాదించాలని ఆసాయినాధుని వేడుకొంటున్నాను.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

$
0
0
          
    
  
  

29.03.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

     

శ్రీవిష్ణుసహస్రనామం  54వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:       సొమపో మృతస్సోమః పురుజిత్ పురుసత్తమః 

               వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్త్వతాంపతిః 

తాత్పర్యం ::  పరమాత్మను యజ్ఞము చేసి సోమరసమును, అమృతమును స్వీకరించువానిగా, తిరిగితిరిగి విజయములను సాధించువానిగా మానవునియందలి ఉత్తమోత్తమ మానవునిగా, వినయవంతునిగా, జయము కలిగించువానిగా, సత్యమున కంకితమయిన వానిగా, దాశ కులమునందు పుట్టినవానిగా, సాత్వతులవంశము వానిగా ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 21వ. అధ్యాయము

ఈ ఉత్తరములో నేను వ్రాసే విషయాలు చదివితే శ్రీసాయి ఒక్క శిరిడీలోనే లేరు, ఆయనను ఈప్రపంచములో ఏమూలన మనము నిలబడి పిలిచిన అక్కడ దర్శనము యిస్తారు అనేది నేను అనుభవ పూర్వకముగా వ్రాస్తున్నాను.  



నీలో ఈ విషయాలు చాలా ఉత్సాహాన్ని కలుగ చేస్తాయి.  జాగ్రత్తగా చదువు.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఈవిధముగా వ్రాస్తారు "అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది.  అనేకమంది యోగులనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు.  వారనేక చోట్ల పని చేసినను ఆందరు ఆ భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు.  కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును.  ఒకరు చేసినదానిని యింకొకరు పూర్తి చేసెదరు" ఈమాటలు గుర్తు పెట్టుకొని నాజీవితములో జరిగిన అనుభవానికి జోడించి చూడు అపుడు హేమాద్రిపంతు వ్రాసినది అక్షరాల నిజము అని నీవు అంటావు.  ఆరోజు 11.01.1991 శ్రీసాయి సత్ చరిత్రలో 21వ. అధ్యాయము నిత్యపారాయణ చేస్తున్నాను.  ఆ అధ్యాయములోని సందేశము నన్ను చాలా ఆకట్టుకొన్నది.  అది అప్ప అనే కన్నడ యోగి శ్రీ వీ.హెచ్.ఠాకూర్, బీ.ఏ.గారికి యిచ్చిన సందేశము.  ఆసందేశము నాకు వర్తించుతుంది అని నమ్ముతాను.  కారణము శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి, నాకు జరిగిన సంఘటనలో పోలికలు ఉన్నాయి.  ముందుగా ఆసందేశము "ఈ పుస్తకము నీవు చదవవలెను.  నీవట్లు చేసినచో నీకోరికలు నెరవేరును.  ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తరదిక్కునకు పోయినపుడు నీవొక గొప్ప యోగిని నీ అదృష్టము చేత కలిసికొనెదవు.  వారు నీభవిష్యత్తు మార్గమును చూపెదరు.  నీమనసుకు శాంతి కలుగ చేసెదరు.  నీకు అనందము కలుగచేసెదరు".  ఈ అధ్యాయము పారాయణ చేసిన రెండు రోజుల తర్వాత మా ఆఫీసులో నలుగురు ఆఫీసర్లను ఆఫీసు పనిమీద కొరియా దేశానికి పంపవలెనని నిర్ణయించబడినది.  మొత్తము ఎనిమిది మంది పేర్లు వినబడసాగినాయి.  నాపేరు కూడా యుంది.  ఆఎనిమిది మంది పేర్లలో -  కాని, నలుగురి నే విదేశాలకు పంపుతారు.  మరి అదృష్టము ఎవరిని వరించబోతున్నది ఎవరికి తెలియదు.  11.01.1991 నాడు నిత్యపారాయణలోని శ్రీసాయి సందేశము నిజము కావాలి అంటే నాపేరు మొదటి నలుగురి పేర్లలో యుండాలి.  అంతా శ్రీసాయి దయ అని తలచి భారము శ్రీసాయి మీద వేసినాను.  అదేరోజు ఆఫీసులో నన్ను పై అధికార్లు పిలిచి పాస్ పోర్టు కాగితాలపై నాచేత సంతకాలు పెట్టించినారు.  నాసంతోషానికి హద్దులు లేవు.  శ్రీసాయి దయ వలన నాపేరు మొదటిసారిగా వెళ్ళే యింజనీర్సులో రెండవ పేరుగా ఉన్నది.  మొదటి పేరు నామిత్రుడు శ్రీనివాస్ రావుది.  విధిగా నాపేరుతో ఉన్న పాస్ పోర్టు వచ్చినది.  01.05.1991 నాడు కొరియా దేశము సందర్శించవచ్చునని డిల్లీ నుండి విసా వచ్చినది.  05.05.1991 నాడు హైదరాబాద్ నుండి విమానములో బొంబాయి చేరుకొన్నాము.  అక్కడనుండి కొరియా దేశానికి విమానములో వెళ్ళవలెను.  కొరియా దేశము భారతదేశము నకు తూర్పు ఉత్తరము దిశలలో అంటే ఈశాన్యములో యున్నది.

05.05.1991 నాడు రాత్రి అంటే 06.05.1991 నాటి తెల్లవారు జామున బొంబాయి విమానాశ్రయమునుండి విమానములో కొరియా దేశానికి బయలుదేరి 06.05.1991 సాయంత్రము 6.30 నిమిషాలకు కొరియా దేశము చేరుకొన్నాము. నా విదేశీ ప్రయాణ వివరాలు అన్నీ సందర్భానుసారముగా ముందుముందు ఉత్తరాలలో నీకు వ్రాస్తాను  అంత వరకు ఓపికతో యుండు.  శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీఠాకూర్ "శ్రీసాయి పాదాలపై శిరస్సు పెట్టి నమస్కరించి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్ధించెను". యిది ఆనాడు శ్రీ వీ.హెచ్.ఠాకూర్ గార్కి లభించిన అదృష్టము.  శ్రీసాయి నాకు అటువంటి అదృష్టాన్ని ప్రసాదించినారు.  నేను కొరియా దేశములో 10.05.91 నాడు శ్రీసాయి సత్ చరిత్ర 51వ. అధ్యాయము పారాయణ పూర్తిచేసినాను.  ఆరోజు శ్రీసాయి ఏవిదమైన అనుభూతిని కలుగచేయలేదని బాధపడుతు రోజు అంత ఆఫీసు పనిమీద గడిపినాను.  రాత్రివేళ 8 గంటలకు నాకొరియా మిత్రుడు మిస్టర్ లీ నన్ను, నామిత్రుడు శ్రీనివాసరావును బయట హోటల్ కు భోజనమునకు తన కారులో తీసుకొని వెళ్ళినాడు.  9.30 నిమిషాలకు భోజనము పూర్తి అయినది.  మేము ముగ్గురము చాంగ్ వాన్ పట్టణములో రాత్రి దీపాల కాంతిలో కారులో తిరుగుతున్నాము.  నామనసులో శ్రీసాయి 51వ. అధ్యాయము పూర్తి చేసిన సందర్భములో కొత్త అనుభూతిని ఇవ్వలేదు అనే బాధ నిండియున్నది.  బహుశ  శ్రీసాయి దానిని గ్రహించి రాత్రి 9.45 నిమిషాలకు నామిత్రుడు శ్రీ లీ చేత పలికించిన మాటలు విను, "గోపాల ఈ ఊరు బయట కొండలు చూడు.  ఆకొండ మీద బుధ్ధుని గుడి యుంది.  ఆగుడిలో దీపాలు యింకా వెలుగుతున్నాయి.  నీకు చూడాలని కోరిక యుంటే మనము ఆగుడికి వెళ్ళుదామా!" అనగానే శ్రీసాయి సాక్షాత్తు నాతో మాట్లాడినట్లు భావించి సంతోషముతో అంగీకరించినాను.  శ్రీ లీ తన కారును గంటకు 90 కిలోమీటర్ల వేగముతో నడుపుతు ఆకొండ దగ్గరకు తీసుకొని వచ్చినాడు.  అప్పటికి రాత్రి 10.15 నిమిషాలు అయినది.  రోజు రాత్రి పది గంటలకు గుడిని మూసివేస్త్గారు.  మన అదృష్టమును పరీక్షించుకొందాము అని శ్రీ లీ చెప్పగానే పరుగులు పెడుతు మేము 10.30 నిమిషాలకు కొండ మీద యున్న బుధ్ధుని గుడికి చేరుకొన్నాము.  మాగురించే గుడి తలుపులు తెరచియున్నాయి అనే భావన కలిగినది.  ఆగుడిలోని బౌధ్ధలామ ఆరు అడుగుల మనిషి.  తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు.  ఆయన తలపై కేశాలు పూర్తిగా తొలగించి యున్నాయి.  గుండ్రటి  ముఖము, తెల్లని వర్చస్సు, చిరునవ్వుతో మాకు స్వాగతము పలికినారు.  ఈవిధమైన ఆహ్వానానికి నామిత్రుడు శ్రీలీ చాలా ఆశ్చర్యపడినాడు.

మేము భారత దేశమునుండి వచ్చినాము అని నాకొరియా మిత్రుడు శ్రీలీ ఆబౌధ్ధ లామాకు మమ్ములను పరిచయము చేసినారు.  ఆ లామా తను భారతదేశములోని బుధ్ధ గయ దర్శించినాను అని చెప్పినారు.  యిక్కడ ఒక చిన్న విషయము గుర్తు పెట్టుకో ముందు ముందు 46వ. అధ్యాయములో శ్రీసాయి అన్నమాటలు "కాశి ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలిసికొనెద". బహుశ ఆనాడు శ్యామా కోర్కె తీర్చటానికి శ్రీసాయి పటము రూపములో గయలో శ్యామాకు దర్శనము ఇచ్చినారు.  మరి 10.05.91 నాడు శ్రీసాయి నాకు చాంగ్ వాన్ పట్టణములోని కొండమీద బౌధ్ధ దేవాలయములో పూజారిగా నాకు దర్శనము యిచ్చినారు.  ఆబౌధ్ధ లామా ఆరాత్రివేళ తన చెల్లెలును లేపి కొరియా దేశపు ఆచారము ప్రకారము ఆకుపచ్చ రంగు టీ తయారు చేయించి మాకు యిచ్చినారు.  శ్రీసాయి స్వయముగా మాచేత టీ త్రాగించుచున్న అనుభూతిని పొందినాము.  యిక్కడ యికొక విషయము ప్రస్తావించుతాను. 30వ. అధ్యాయము లో హేమద్రిపంతు కాకాజీ విషయములో అంటారు, "యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారు ఎవరు?  అతని ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా కదలదు.  యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో, అంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును.  దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును.  ఆనాడు కాకాజి విషయములో అట్లే జరిగెను.  నావిషయములో మొదటిసారి శిరిడీకి 1989 వెళ్ళినపుడు, మరియు 10.05.91 నాడు కొరియాలోని చాగ్ వాన్ పట్టణము బౌధ్ధ దేవాలయమునకు వెళ్ళినపుడు అట్లే జరిగెను.  యిది అంత శ్రీసాయి నాచేత 51వ. అధ్యాయము నిత్య పారాయణ చేయించి చేతికి ఫలము యిచ్చినట్లుగా భావించినాను.  ఆగుడిలో జరిగిన ఒక సంఘటన వ్రాస్తాను.  నేను భారతదేశమునుండి బయలుదేరేముందుగా రెండు డాలర్లను విడిగా పర్సులో పెట్టుకొన్నాను.  ఆరెండు డాలర్లు కొరియా దేశములో ఎవరైన యోగీశ్వరులు దర్శనము యిస్తే వారికి దక్షిణగా యివ్వదలచుకొన్నాను.  యిది నేను మ్రొక్కు కొన్న మొక్కు.  శ్రీసాయి నాకు ఆబుధ్ధుని దేవాలయములోని లామా రూపములో దర్శనము యిచ్చినారు.  మనసు ఆనందముతో నిండిపోయినది.  రెండు చేతులు జోడించి ఆలామా (శ్రీసాయి) పాదాలపై శిరస్సు పెట్టి, నన్ను స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్ధించినాను.  ఆరెండు డాలర్లు దక్షిణగా స్వీకరించమన్నాను.  ఆయన నన్ను ఆశీర్వదించి ఆరెండు డాలర్లు బుధ్ధుని పాదాల దగ్గర పెట్టమని చెప్పినారు. శ్రీసాయి రాత్రివేళలలో ఏభక్తుని దగ్గరనుండి దక్షిణ స్వీకరించలేదు.  ఈవిషయము శ్రీ ఎం.వీ.కామత్ గారు వ్రాసిన పుస్తకము సాయిబాబా ఆఫ్ షిరిడీ, ఏ యూనిక్ సైంట్ 246వ.పేజీలో వ్రాయబడినది. ఆ బౌధ్ధ లామా మా ముగ్గిరికి మూడు వెండి లాకెట్లు ఆశీర్వచనాలతో యిచ్చినారు.  ఆవెండి లాకెట్టు మీద స్వస్తిక్ ముద్ర యున్నది.  యిదే ముద్రను నీవు    శిరిడీసాయినాధుని సమాధి మందిరము గోడపై చూడగలవు.  ఆబౌధ్ధ లామ (శ్రీసాయి) నాకు ఆవెండి లాకెట్టు యిస్తున్నపుడు సాక్షాత్తు శ్రీసాయినాధుడు నాకు వరము యిస్తున్న భావన పొందినాను.  ఆ లాకెట్టు ఈనాడు నామెడలో యున్నది.  ఆఖరి శ్వాస వరకు ఆ లాకెట్టు నామెడలో యుండాలని కోరుకొంటున్నాను.  అంతా శ్రీసాయి దయ.  యింక శ్రీహేమాద్రి పంతు నవవిధ భక్తి మార్గమును గురించి చెబుతారు.  నేను ఆమార్గములో "శ్రీసాయి స్మరణ" మార్గాన్ని ఎన్నుకొన్నాను.  అనుక్షణము శ్రీసాయి నామ స్మరణ చేస్తే శ్రీసాయి మనలకు ఎల్లపుడు కాపాడుతారు.  మనకు ముక్తిని ప్రసాదించుతారు.  శ్రీసాయి సత్ చరిత్రలో బాబా యిచ్చిన సందేశము. ఒకరి గూర్చి చెడ్డ చెప్పరాదు.  అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు.  యిది పాటించగలిగితే అందరు మన మిత్రులే అందరు సాయి స్వరూపులే.

శ్రీసాయి సేవలో
నీ తండ్రి 


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 22 వ.అధ్యాయము

$
0
0
                          
                              
                                
 30.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

      
శ్రీవిష్ణుసహస్రనామం 55వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:    జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః  |

            అంభోనిది రనంతాత్మా మహోదధి శయో అంతకః   ||

తాత్పర్యం :  పరమాత్మను జీవునిగా, వినయముచే మనస్సును ముందుకు నడుపువానిగా, సాక్షిగా, అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను బిందువులతో కూడిన మహా సముద్రముగా అట్టి మహా సముద్రమునందు అనంతముగా శయనించి యుండువానిగా, మరల అట్టి సముద్రమే భౌతిక జీవులకు లయస్థానముగా ధ్యానము చేయుము.



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
22 వ.అధ్యాయము

                                      25.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులను విషజంతువుల బారినుండి కాపాడిన సంఘటనలు వివరించబడినవి.  మరి మనిషికి నిలువెల్ల విషమే కదా - అటువంటి మనుషులనుండి కూడ తన భక్తులను అనేకసార్లు కాపాడినారు శ్రీసాయి.  



ఈ అధ్యాయము ఆఖరిలో శ్రీసాయి అంటారు "అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను.  దేవుడందరిని రక్షించువాడు" అని మానవాళికి సందేశము యిచ్చినారు.  ఈ సందేశమును ప్రతిసాయి భక్తుడు అర్ధము చేసుకొని సుఖప్రదమైన జీవితము గడపాలని నాకోరిక.  ఈ ఉత్తరములో శ్రీసాయి, ద్వారకామాయిని మశీదు తల్లి" అని పిలవటము గురించి మరియు మశీదు తల్లితో నా అనుభవాలు వ్రాస్తాను.  1991 డిశంబరులో శిరిడీకి వెళ్ళినాను.  ఆసమయములో తెల్లవారుజామున ఉదయము ఆరతి ద్వారకామాయిలో చదివినాను.  ఆరతి చదివిన తర్వాత శ్రీసాయికి నైవేద్యము పెట్టడానికి జేబులోని పంచదార పొట్లము గురించి వెతికినాను.  పొట్లము దొరకలేదు.  శ్రీసాయికి పంచదార నైవేద్యము పెట్టలేకపోతున్నాననే బాధ నాలో ఎక్కువ కాసాగినది.  ఏమి చేయాలి? వెనక్కి హోటల్ కి వెళ్ళి కొంచము పంచదార తెచ్చి శ్రీసాయికి నైవేద్యము పెట్టాలా లేకపోతే నైవేద్యము పెట్టలేకపోతున్నందులకు శ్రీసాయిని క్షమాపణ కోరాలా! అనే ఆలోచనలతో సతమమగుతుంటే - ఒక 60 సంవత్సరాల ముసలి స్త్రీ ఒక డబ్బా నిండ పంచదార తెచ్చి అందులోని కొంచము పంచదార శ్రీసాయికి నైవేద్యము పెడుతున్నది.  నాలో తెలియని ఆనందము కలిగినది.  ద్వారాకామాయిలో తన భక్తులను ఎట్టి పరిస్థితిలోను శ్రీసాయి నిరుత్సాహము పరచరు.  భక్తుల సమస్యలను శ్రీసాయి తన సమస్యలగా భావించి వారే పరిష్కార మార్గము తన భక్తులకు చూపించుతారు అని భావించి, నేను ఆ స్త్రీని కొంచము పంచదార యివ్వమని కోరినాను.  ఆమె సంతోషముగా ఒక చెంచా పంచదార కాగితములో యిచ్చినది.  ద్వారకామాయి (మశీదు) లో శ్రీసాయి (స్త్రీ రూపము అంటే తల్లి రూపములో) నా సమస్యకు పరిష్కారము చూపించటానికి తల్లి రూపములో దర్శనము యిచ్చినారు.  అందుచేత శ్రీసాయియే ద్వారకామాయి అంటే మశీదు తల్లి అని గుర్తించుకో.  నేను నీకు 9వ.అధ్యామునకు సంబంధించి 9వ.ఉత్తరములో భిక్ష గురించి ఆవశ్యకతలో నేను ఏపరిస్థితిలో రోజూ శ్రీసాయి యొక్క భిక్ష జోలిలో పిడికెడు బియ్యము వేస్తున్నది వాటి వివరాలు నీకు వ్రాసినాను.  ఆవిధముగా రోజు పిడికెడు బియ్యము శ్రీసాయి జోలిలో వేయటానికి శ్రీసాయి నాకు కలలో మశీదును, ఆమశీదు ప్రక్క నిలబడిన నామాతృమూర్తి అంటే నాతల్లిని చూపి, మశీదు తల్ల్లియొక్క ప్రాముఖ్యమును నాకు గుర్తు చేసినారు.

శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి అంటారు "భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు"  ఈ సత్యాన్ని ప్రతిసాయి భక్తుడు గ్రహించి సాయి మార్గములో ప్రయాణము చేయాలి.  నేను ఈ మార్గములో ప్రయాణము చేయాలి అనే తపనతోనే నోరు లేని జీవులకు వేసంగిలో దాహము బాధ తీర్చడానికి యింటి బయట నీళ్ళ తొట్టి పెట్టినాను.  నా తర్వాత నీవు కూడా ఈమార్గములో ప్రయాణించుతు ఆనోరులేని జీవాల దాహము తీర్చడానికి ప్రయత్నించు.  శ్రీసాయి అనుగ్రహాన్ని పొందు.  అపుడు నీవు నిజమైన సాయి భక్తుడివి అగుతావు.

శ్రీసాయి సేవలో 
నీతండ్రి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 23వ. అధ్యాయము

$
0
0

              
                                                          
 04.04.2013 గురువారము
ఓం సయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
శ్రీ విష్ణుసహస్రనామం 56 వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం;  అజో మహార్హ స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః  |

             ఆనందో నందనో నంద్స్సత్య ధర్మాత్రివిక్రమః    ||

తాత్పర్యం:  నారాయణుని జన్మలకతీతునిగా, గొప్ప అర్హునిగా, స్వభావముగా, అమిత్రులను జయించువానిగా, తృప్తికి కారణమైనవానిగా, ఆనందముగా, తానే సంతోషము కలిగించువానిగా, తనంతటతానే సతోషపడువానిగా, సత్యమే తన ధర్మమైనవానిగా, మూడడుగులలో సమస్తమును ఆక్రమించువానిగా  ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
23వ. అధ్యాయము

                                                                           26.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి యొక్క లీలకు గురించి నీకు ఎక్కువగా వ్రాయలేను.  కాని, నా మనస్సులో ఉన్న ఆలోచనలను నీముందు ఉంచుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి విషయములో యిలాగ అంటారు, "నేను భగవంతుడను" అని వారెన్నడు అనలేదు.  భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు.  భగవంతుని ఎల్లపుడు తలచువారు. 



 హేమాద్రి పంతు ఈవిధముగా శ్రీ సాయిని గురించి వ్రాయడము ఏమిటో! శ్రీసాయి సాక్షాత్తు భగవంతుని అవతారము కదా, అని నీవు నేను అంటాము.  యిక్కడ బాబాయొక్క గొప్పతనమును మనము గుర్తించాలి.  శ్రీసాయి బ్రహ్మ జ్ఞాని, సాక్షాత్తు భగవంతుడే.  తను భగవంతుడు యొక్క అవతారమైనా, మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఏవిధముగా బ్రతకాలి అనేది తన తోటి మానవులకు తెలియచేయటానికి  మరియు మానవులలో అహంకార రహితమైన జీవితము ఏవిధముగా ఉండాలి అని తెలియచేయడానికి శ్రీసాయి ఎన్నడు తాను భగవంతుడిని అని అనలేదు.  వారు భగవంతుని విధేయ సేవకుడిని అని మాత్రము అనేవారు,  గుర్తుంచుకో.  శ్రీసాయి అంటారు, "నానా ! ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొనే శక్తి కలదో వారే దానిని తినవలెను"  ఈ విషయముపై నా ఆలోచనలు నీకు తెలియ చేస్తాను విను.- జీవితమును మనము ఒక ఉల్లిపాయతో పోల్చవచ్చును.  ఉల్లిపాయ మీద ఉన్న పొరలును ఒక్కొక్కటే తీసి వేస్తు వెళ్ళు.  ఆఖరులో నీకు రుచికరమైన తియ్యటి (ఘాటులేని) ఉల్లి దొరుకుతుంది తనటానికి.  జీవితము అనే ఉల్లి మీద ఉన్న పొరలే అరిషడ్ వర్గాలు.  నీవు ఆ అరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగించుకొని జీవించు అని తన భక్తునికి సందేశము యిచ్చినారు.  మరి శ్రీసాయి అరిషడ్ వర్గాలు అనే పొరలు కలిగిన ఉల్లిపాయను కూడా తినివేసి వాటి నామ రూపాలు లేకుండ జీర్ణించుకొనే శక్తి కలిగినవారు అని మనము గుర్తించాలి.  మన పెద్దలు చెప్పిన సామెత గుర్తు ఉందా - "ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు"  కాని, యిక్కడ చిన్న వివరణ చేస్తాను "అరిషడ్ స్వర్గాలు అనే పొరలును తల్లి శ్రీసాయి తీసివేసి ఆ ఉల్లిని తన పిల్లలకు పెట్టి ఆపిల్లలకు మేలు చేస్తుంది ఆతల్లి (శ్రీ సాయిమాత).   ఆనాటి సమాజములో ఉన్న చాదస్తాలను శ్రీసాయి వ్యతిరేకించినారు.  ఆవిధముగా వారిలోని అజ్ఞానమును తొలగించి వారిలో జ్ఞానమును కలిగించినారు.  ఈ విషయములో శ్రీహేమాద్రిపంతు రెండు ఉదాహరణలు సాయి సత్ చరిత్రలో వ్రాసినారు.  1. కలరా వ్యాపించి యున్న సమయములో కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయరాదు. 2. గ్రామములో మేకను కోయరాదు.  ఈ రెండిటిని శ్రీసాయి ధిక్కరించి చాదస్తాలను నిర్మూలించినారు.

మూఢ నమ్మకాలు, చాదస్తాలు అంటే శ్రీసాయికి కిట్టవు అని చెప్పినాను కదా.  మూఢ నమ్మకాలు విషయము ఆలోచించుదాము.  1947 సంవత్సరములో శ్రీదయాభాయి దామోదర్ దాస్ మెహతా బొంబాయి నివాసి టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతున్నపుడు అతను తన మిత్రుల మాటపై ఎవరో మంత్రగాడు యిచ్చిన తావీదు మెడలో కట్టుకొన్నాడు. జ్వరము తగ్గడము బదులు దుష్ఠశక్తులు అతనిని పీడిస్తున్నాయి అనే భావన కలిగినది.  రాత్రివేళ జ్వర తీవ్రత ఎక్కువగా ఉంది.  అతను శ్రీసాయి రక్షణ కోరుతాడు.  శ్రీసాయిని మనసార  పిలుస్తాడు.  అటువంటపుడు అతని మంచము ప్రక్కన యున్న శ్రీసాయిబాబా పటమునుండి వినబడిన మాటలు "ఎందులకు భయపడుతావు.  నేను ఉదయమునుండి నీరక్షణకోసము కఱ్ఱ చేతిలో పెట్టుకొని నీమంచము దగ్గర నిలబడినానే మరి యింకా ఆమెడలో తావీదు దేనికి, దానిని వెంటనే తీసి పారవేయి" శ్రీ మెహతా ఆవిధముగా చేసినారు.  ఆతరువాత శిరిడీకి వెళ్ళి శ్రీసాయి సమాధికి నమస్కారము చేసి పూర్తి ఆరోగ్యము పొందినారు.  దీనిని బట్టి శ్రీసాయి భక్తులు గ్రహించవలసినది ఏమిటి మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు దూరముగా ఉండాలి అనే విషయము.  నీ జీవితములో ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చిన శ్రీసాయి వెలిగించిన ధునిలోని విభూతిని శ్రీసాయిపై నమ్మకముతో నుదుట పెట్టుకొని కొంత విభూతిని ఔషధముగా నీళ్ళలో కలపి త్రాగి, మానసిక బాధలు శారీరిక బాధలు తొలగించుకో.

శ్రీసాయి సేవలో
నీ తండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 24వ. అధ్యాయము

$
0
0
             
      
          
05.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

       
శ్రీవిష్ణుసహస్ర నామాం 57వ.శ్లోకం, తాత్పర్యము

శ్లోకం:        మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞోమేదినీపతిః     |

               త్రిపద స్త్రి దశాధ్యక్షో మహాశృగః కృతాంతకృత్  ||

తాత్పర్యం:  పరమాత్మను గొప్ప ఋషిగా, కపిలుడను గురువుగా ధ్యానము చేయుము.  చేసిన మేలు మరువని వానిగా, భూమికధిపతిగా, సృష్టిని మూడు అడుగులతో కొలుచువానిగా, దేవతలకధిపతిగా, గొప్ప శిఖరముగా, జీవులు చేసిన కర్మను తనయందు లయము చేయువానిగా ధ్యానము చేయుము.    


05.04.2013 శుక్రవారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

24వ. అధ్యాయము
                                                                                                     27.01.1992

ప్రియమైన చక్రపాణి,

జీవితము కష్ట సుఖాలమయము. సుఖములో ఒక చిన్న భాగము హాస్యము.  శ్రీసాయి తన భక్తులకు ఏదైన కొత్త విషయాలు తెలియచేయదలచుకొన్నపుడు సందర్భానుసారము చెప్పేవారు.  అలాగ చెప్పటములో అవసరము వచ్చినపుడు హాస్య పధ్ధతిని కూడా అనుసరించేవారు.  యితరులకు పెట్టకుండ మనము తినరాదు అనే విషయమును హాస్య పధ్ధతిలో హేమాద్రిపంతుకు చెబుతారు శ్రీసాయి.  శ్రీసాయి తన భక్తులకు చక్కని సందేశము యిచ్చినారు.  అది "నీవు తినుటకుముందు నన్ను స్మరింతువా?  నేనెల్లపుడు నీచెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా"? ఈ సందేశమును అర్ధము చేసుకొని నీవు తినే భోజనమును, నీవు త్రాగే నీరును కూడా శ్రీసాయికి మనసులో అర్పించి సేవించు.  నీజీవితము ధన్యము చేసుకో.  ఇదే విధముగా నీలోని అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము పామువలె బుసలు కొడుతుంటే ఆపని చేసేముందు శ్రీసాయిని ఒక్క నిమిషము ధ్యానించు. శ్రీసాయి నిన్ను సవ్యమైన మార్గములో నడిపించుతారు.  నీతోటి సాయి భక్తుడు శ్రీసాయిని పూజించే విధమునకు నీవు పూజించే విధానానికి తేడా యుండవచ్చును.  అది నీకు అనవసరము.  నీపద్దతి నీది.  వాని పధ్ధతి వానిది.  నీవు ఆవిషయములో జోక్యము చేసుకోవద్దు.

ప్రతి గురువారము శ్రీసాయిగుడికి వెళ్ళి అక్కడ హారతిలో పాల్గొంటే సరిపోదు.  శ్రీసాయిని ప్రతి జీవిలోను చూడాలి.  ఆయన నామము అనుక్షణము స్మరించాలి.  ఆయన నడచిన బాటలో నడవటానికి ప్రయత్నించాలి.  అలాగ అని సంసారము వదలి సన్యాసము తీసుకొమ్మని కాదు.  జీవితములో నీవు పూర్తి చేయవలసిన బరువు బాధ్యతలు శ్రీసాయి నామస్మరణ సహాయముతో పూర్తి చేసుకొని ఆయన ప్రేమకు పాత్రుడివి కావాలి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 25వ. అధ్యాయము

$
0
0
       
         
06.04.2013 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

        
శ్రీవిష్ణుసహస్ర నామం 58వ. శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:  మహా వరాహో గోవిందస్సుషేణః కనకాంగదీ  |

             గుహ్యో గభీరో గహనో గుప్రశ్చక్రగదాధరః   ||

తాత్పర్యం:  పరమాత్మను చక్రము, గద హస్తములలో ధరించిన వరాహముగా, గొప్ప సేనను వెంబడించుచున్నవానిగా, బంగారు ఆభరణములు ధరించి, గంభీరమై, గుప్తమై గ్రహించుటకు సాధ్యముకాని వానిగా, యింద్రియములందలి ప్రజ్ఞగా ధ్యానము చేయుము. 


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 
25వ. అధ్యాయము

                                                         28.01.1992

ప్రియమైన చక్రపాణి,

ఈ ఉత్తరములో శ్రీసాయి తన భక్తుల భవిష్యత్ ను ఆలోచించి, యిచ్చిన సలహాల గురించి హేమాద్రిపంతు వివరించుతారు.  శ్రీహేమాద్రిపంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే, బాబా వెంటనే అతని చేత వ్రాయించెను.  శ్రీసాయితో నా అనుభవాలను ఈవిధమైన ఉత్తరాలు ద్వారా నీకు తెలియ చేయాలని కోరిక జనించగానే బాబా వెంటనే నాకు అనుమతిని ప్రసాదించలేదు.  నీకు ఈ ఉత్తరాలు 06.01.92 తేదీనుండి వ్రాయడము మొదలుపెట్టిన తర్వాత శ్రీసాయి 22.1.92 నాడు అనుమతిని ప్రసాదించినారు.  ఈ విషయాన్ని నీకు నావెనకటి ఉత్తరములో వ్రాసినాను.  ఒకసారి దాము అన్నా, తను ప్రారంభించబోయే వ్యాపారములో శ్రీసాయి ఆశీర్వచనాలు పలికిన, ఆవ్యాపారములో వచ్చే లాభాలనుండి కొంత పాలు ఇవ్వడానికి సిధ్ధపడినపుడు శ్రీసాయి అన్న మాటలు "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు".  కొంచము విడమర్చి చెప్పాలంటే శ్రీసాయికి లంచము తీసుకోవటము యిష్టము లేదు.  మరి శ్రీసాయికి యిష్టము కాని పనులు శ్రీసాయి భక్తులు కూడా చేయరాదు అనే విషయము మనము ఎల్లపుడు జ్ఞాపకము ఉంచుకోవాలి.

శ్రీసాయి మహాసమాధికి ముందు అన్న మాటలు గుర్తు చేసుకో.  "నేను సమాధి చెందినప్పటికి  నాసమాధినుంచి నాఎముకలు మాట్లాడును.  అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును.  నేనే కాక నాసమాధి కూడా మాట్లాడును, కదులును.  మనస్పూర్తిగా శరణు జొచ్చినవారితో మాట్లాడును.  నేను మీవద్దనుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు.  నాఎముకలు మాట్లాడుచు మీక్షేమమును కనుగొనుచుండును.  ఎల్లపుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు.  నాయందే మనఃపూర్వకముగను, హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు.  అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు". యివి భగవంతుడు స్వయముగా తన భక్తులతో అన్నమాటలు.  నీవు కూడా ఆభగవంతుని (శ్రీసాయి) భక్తుడువి.  ఎల్లపుడు ఈమాటలను  జ్ఞాపకము చేసుకొంటు యుండు.  అవినీకు కొండంత బలాన్ని యిస్తుంది.  ధైర్యముగా జీవితములో ముందడుగు వేయి.

శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 26వ. అధ్యాయము

$
0
0
  
    
       
         
07.04.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

            
శ్రీ విష్ణుసహస్రనామం 59వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం:            వేధాస్స్వాంగో జితః కృష్ణో ఢృఢస్సంకర్షణొచ్యుతః           |

                    వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షోమహామనాః           ||

తాత్పర్యం:  పరమాత్మను సృష్టికర్తగా మరియూ శరీరములు, రూపములు, తనలోని భాగములుగా, వ్యక్తమైనట్టి తండ్రిగా ధ్యానము చేయుము.  మనసుకు యింద్రియములకు అందని గొప్ప చిత్రమయిన చీకటి యను అంతర్యామిగా, తనయందు జీవించుచు మరల తనలోనికి స్వీకరింపబడు దేహములుగా, జారిపడు వానిగా, నీటికధిపతియైన వరుణునిగా, మరియూ ఆయన కుమారుడైన భృగువుగా, విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా, పద్మమునందలి దళములుగా, అందరి యందలి ఒక్కటిగా నున్న మనస్సుగా ధ్యానము చేయుము.      


పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 

26వ. అధ్యాయము
                                                   29.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈఉత్తరములో శ్రీసాయిని మానసికముగా ఏవిధముగా పూజించాలి అనేది శ్రీహేమాద్రిపంతు ఆంతరిక పూజా విధానములో వర్ణించినారు.  నిజముగా ఆవిధముగా పూజించాలి అనే తలంపు రాగానే మనసు సంతోషముతో నిండిపోతుంది.  నీవు ఎవరి పాదాలకైనా నమస్కరించు సమయములో శ్రీసాయిని మనసార తలచుకొని అవతలి వ్యక్తిలో శ్రీసాయిని చూస్తూ నమస్కారము చేయి.  ఆ అనుభూతిని, సంతోషాన్ని అనుభవించు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి తనతోటి యోగి యొక్క శిష్యుని చూచి పలికిన పలుకులు ఎంత గంభీరమైనవి.  "ఏమైనను కానిండు, పట్టు విడవరాదు.  నీగురునియందే యాశ్రయము నిలుపుము, ఎల్లపుడు నిలకడగానుండుము.  ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము.  మన అదృష్టము వలన మనము వారి పాదాలను నమ్ముకొన్నాము.  మన సంతోషానికి మనమనసులే సాక్షి.  శ్రీసాయి తనతోటి యోగీశ్వరులను సదా గౌరవించేవారు.  వారి సాంప్రదాయమును మనము గౌరవించాలి.  శ్రీసాయి ఆలోచనలలో ఆత్మహత్య మహాపాపము.  ఆవిషయములో శ్రీసాయి స్వయముగా ఏవిధముగా తన భక్తుడు గోపాలనారాయణ అంబాడేకర్ ను రక్షించినది శ్రీహేమాద్రిపంతు వివరించినారు.  చదివి అర్ధము చేసుకో.  జీవితములో కష్టాలు అనేవి ప్రతి మానవుడికి వస్తాయి.  వాటికి ఆత్మహత్య పరిష్కారము కాదు అంటారు శ్రీసాయి.  "కొడుకు కూడా తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక" అంటారు శ్రీహేమాద్రిపన్తు.  మరి నేను కోరుకొనేది నీవు కూడా శ్రీసాయి భక్తుడుగా మారాలని -  నాకోరిక తీర్చుతావు కదూ.

నీతండ్రి


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము

$
0
0
                   
                         
                              
08.04.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

          
శ్రీ విష్ణుసహస్రనామం 60 వ.శ్లోకం, తాత్పరయం

శ్లోకం :    భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః         |

              ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతి సత్తమః            ||

తాత్పర్యం:  పరమాత్మ శక్తులను, మహిమలను గలవాడు.  చీకటిని నశింపచేయువాడు.  ఆనందము కలుగ చేయువాడు.  వన పుష్పములచే చేయబడిన మాలను ధరించినవాడు.  అదితి యొక్క కుమారుడు.  నాగలిని ధరించినవాడు.  మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టి నంతటిని భరించి సహించువాడు.  సన్మార్గమున నడచువారిలో అత్యంత ముఖ్యుడైనవాడు.  


శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 27వ. అధ్యాయము
                                                 30.01.1992

ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయి ఏనాడు ఏ పుస్తకము చదవలేదు.  కాని, తన భక్తులచేత ఆధ్యాత్మిక రంగములో ముఖ్యమైన పుస్తకాలను తనే స్వయముగా చేతితో పట్టుకొని, ఆభక్తులను ఆశీర్వదించి, వారి చేత ఆపుస్తకాలను చదివించెను.  ఆయన తన హిందూ భక్తుల చేత చదివించిన ముఖ్య పుస్తకాలలో 1. గురుచరిత్ర 2. విష్ణుసహస్ర నామము 3. గీతా రహస్యము అనేవి ముఖ్యమైనవి.  మానవుని ఆధ్యాత్మిక రంగ అభివృధ్ధికి పుస్తక పఠనము కూడా చాలా అవసరము అని శ్రీసాయి ఈవిధముగా తెలియచేసినారు.  సాయి భక్తులు ఈ పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయాలని కోరుతున్నారు.  ఈ పుస్తకాల వ్యవహారములో రామదాసికి మరియు శ్యామాకు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీసాయి ఇలాగ అంటారు.  "ధనము యిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు".  ఈవిషయము నాజీవితములో అనుక్షణము జ్ఞప్తికి వస్తుంది.  ధనము ఉంది అనే అహంకారముతో నీవు ఏవష్తువునైన కొనగలవు.  కాని మనుష్యులను కొనలేవు.  అవసరమువచ్చినపుడు మంచి పనుల నిమిత్తము ధనము విరివిగా ఖర్చు పెట్టు, వెనకాడవద్దు.  ప్రతి విషయానికి ధనానికి లంకె పెట్టవద్దు.  ఎవరికైన ధన సహాయము  మరియు మర్యాద చేయవలసివచ్చినపుడు ప్రేమతో చేయి.  డబ్బు గురించి ఆలోచించుతు మనుషులను దూరంగా ఉంచకు.  ధనము ఖర్చు ఆగిపోతుంది అనే భావనతో నీబాధ్యతను నీవు చేయకపోతే భగవంతుడు ఏదో విధముగా ఆపని పూర్తి చేయించుతాడు.

ఆతర్వాత జీవించినంత కాలము ఆపని చేయలేదు అనే అసంతృప్తి నీకు మిగులుతుంది మరియు లోకులు వేసే నింద మిగులుతుంది.  ఈ విషయములో నాజీవితములో జరిగిన రెండు ఉదాహరణలు వ్రాస్తాను.  నాపినతల్లి భర్త నాతండ్రి దగ్గరనుండి ఏమీ ఆశించకుండానే నన్ను నా చిన్నతనములో తన యింట ఒక పది సంవత్సరాలు ఉంచు కొని నాకు విద్యాబుధ్ధులు నేర్పినారు.  నా ఈ శరీరములో ప్రాణము ఉన్నంత కాలము నేను నాపినతల్లి భర్తను మరచిపోలేను.  నేను సదా వారికి కృతజ్ఞుడిని. యింక నా జీవితములో ప్రవేసించిన యింకొక వ్యక్తి నామావగారు అంటే నీ తల్లియొక్క తండ్రి.  నేను ఆయన దగ్గరనుండి ధన సహాయము కోరుతాననే భయముతో ఆయన నానుండి తప్పించుకొని తిరుగుతు ఎదుట పడినపుడు నన్ను అవమానించుట వలన నేను జీవించినంత కాలము వారిని మరచిపోలేను.  మొదటి వ్యక్తిని చూచినపుడు, తలచినపుడు. తలను గౌరవము, భక్తి భావనతో క్రిందకు దించుతాను.  మరి రెండవ వ్యక్తి విషయములో గౌరవము, భక్తిలను ప్రదర్శించలేను.  అందుచేత జీవితములో ధనము ఒక్కటే ముఖ్యము కాదు అనే విషయాన్ని మరచిపోవద్దు.  శ్రీమతి ఖాపర్దే విషయములో శ్రీసాయి ఆమె భక్తికి మెచ్చి ఆమె గత జన్మల వివరాలను మనలకు తెలియపర్చుతారు.  మానవుడు మంచి పనులు చేయటము మన జన్మజన్మలలో ఏవిధముగా అభివృధ్ధి చెందుతాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చును.  మనము కూడా శ్రీసాయి ఆశీర్వచనములలో మంచి పనులు చేస్తు మంచి జన్మము పొందుదాము.
 

శ్రీ సాయి సేవలో
నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి, 43, 44 వ. అధ్యాయములు

$
0
0
         
    
       
25.02.2013  గురువారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మనబ్లాగులో ప్రచురణకు 10 రోజులు ఆలస్యం జరిగింది..క్షంతవ్యుడను..పొద్దుటే ఆఫీసుకు, వెళ్ళడం..తిరిగి ఇంటికి వచ్చినాక కొన్ని పనులవల్ల సమయం కుదరలేదు...

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 43,44 అధ్యాయములు 

ఈ రోజు ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 75వ.శ్లోకం, తార్పర్యం తో ప్రారంభిస్తున్నాను..
  
      శ్రీవిష్ణుసహస్రనామం  

శ్లోకం : సద్గతిః సత్కృతిః సద్భూతిః సత్పరాయణః        |  

         శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః  ||   

తాత్పర్యం :  పరమాత్మను మంచివారి మార్గముగా, మంచిపనిగా, మంచిగా, మంచియొక్క వైభవముగా ధ్యానము చేయవలెను.  మంచివరి మార్గమునకు అంకితమయినవానిగా, శూరులు కూడిన సేనగా ధ్యానము చేయవలెను.  యదువంశములో శ్రేష్టునిగా, మంచివారి యందు నివసించువాడగుటచే తన మంచి మార్గమును యమున ఒడ్డున ప్రసాదించువానిగా ధ్యానము చేయుము.     

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి,
 43, 44 వ. అధ్యాయములు

                                                   15.02.1992

ప్రియమైన చక్రపాణి,

42,43,44వ.అధ్యాయములలో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయిబాబా మహా సమాధి చెందటము గురించి వివరించినారు.  అందుచేత నేను కూడా ఈ మూడు అధ్యాయములను రెండు ఉత్తరాలలో వివరించుచున్నాను.  క్రిందటి ఉత్తరములో చివర్లో నాపిన తండ్రి శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గారు శ్రీసాయి దయతో మరణ శయ్యపై ఉండగా కుడా గృహప్రవేశము చేసిన సంఘటన వివరించినాను.  



శ్రీసాయి గృహప్రవేశము నిమిత్తము ఆయన చావు చీటీ తాత్కాలికముగా తీసివేసినారు.  ఒకవేళ శ్రీసాయి తాత్కాలికముగా ఆయన మరణమును తొలగించకపోయి యుంటే ఆయన తను కట్టుకొన్న యింటిపై వ్యామోహముతో మరణించి, ఆకోరిక తీర్చుకోవటానికి మళ్ళీ జన్మ ఎత్తవలసియుండేది.  శ్రీసాయి ఈ పరిస్థితిని గమనించి ఆయన మనసులోని కోరిక తీర్చి ఆయనకు ప్రశాంత మరణము కలగటానికి మార్గము ఏర్పరచినారు.  నేను యిపుడు ఆవిషయాలు నీకు వ్రాస్తాను.  శ్రీసోమయాజులు బాబయ్యగారు 29.01.92 నాడు నూతన ఉత్సాహముతో తన మంచము మీద నుండే బంధువులందరిని పరుపేరున పిలిచి మాట్లాడి భోజనము చేసి వెళ్ళమని కోరినారు.  తన చెల్లెలను పిలిచి తనకు యిష్ఠమైన భక్తిపాట, "నీవు ఉండేది కొండపైన, నేను ఉండేది నేలపైన" అనే పాటను పాడించుకొని శ్రీవెంకటేశ్వరస్వామికి నమస్కరించినారు. మధ్యాహ్నము అందరి భోజనాలు అయినవి.  అందరిని తమ తమ యిళ్ళకు వెళ్ళిరమ్మనమని చెప్పినారు.  నన్ను పిలచి సాయి మధ్యాహ్న్న హారతి చదవమన్నారు.  నాకు మనసులో బాధగాయున్నా శ్రీసాయికి మధ్యాహ్న్న హారతి యిచ్చినాను.  ఆయన నన్ను ప్రేమతో పిలిచి తన జ్ఞాపకార్ధముగా తన కళ్ళజోడు తీసి నాకళ్లకు పెట్టినారు.  నాపినతల్లిని పిలిచి తన మరణానంతరము తన చేతివేలికి యున్న ఉంగరమును నాకు యివ్వమని చెప్పినారు.  నేను ఆయన బాధ చూడలేకపోవుచున్నాను.  భగవంతుడా ఆయను త్వరగా తీసుకొనిపో అని ప్రార్ధించినాను.  భగవంతుడు నాప్రార్ధనను విన్నది లేనిది శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయిని సందేశము కోరినాను.  కళ్ళుమూసుకొని ఒక పేజీ తీసినాను.  26వ. అధ్యాయము 221వ.పేజీలో శ్రీసాయి ఇచ్చిన సందేశము "గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు.  నీఅనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు.  నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను.  వచ్చుటకు ముందు కొంతకాలమేల నీకర్మను అనుభవించరాదు? గత జన్మ పాపాలనేల తుడచివేయరాదు?  దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము".  ఈ సందేశమును అర్ధము చేసుకొన్నాను.  కాని, ఆయన బాధను చూడలేక అక్కడినుండి నాయ్హింటికి తిరిగి వచ్చి స్నానము చేసి శ్రీసాయికి రాత్రి హారతి యిచ్చినాను.  ఆహారతి సమయములో ఒక నల్లని పురుగు చూడటానికి చాలా భయకరముగా యున్నది.  దాని రెక్కలమీద మానవ కపాలం చిత్రించినట్లు యున్నది.  పరిస్థితిని అర్ధము చేసుకొన్నాను.  శ్రీసాయి శ్రీసోమయాజులుగార్కి ఏకాదశి ఘడియలలో మోక్షము ప్రసాదించుతారు అని నాలో నమ్మకము కుదిరినది.  రాత్రి కలత నిద్రతో కాలము వెళ్ళబుచ్చినాను.   30.01.92 గురువారము ఉదయము లేచి స్నానము చేసి నిత్యపారాయణ చేసి శ్రీసాయిని సందేశము కోరినాను.  27.వ.అధ్యాయములోని 230, 231 వ. పేజీలలో "రాజారాం అను మంత్రమును జపించు.  నీవట్లు చేసినచో నీజీవిత ఆశయము పొందెదవు.  నీమనసు శాంతించును" అనే సందేశాన్ని ప్రసాదించినారు.  వెంటనే శ్రీ సోమయాజులు బాబయ్యగారి యింటికి వెళ్ళినాను.  రాత్రి పరిస్థితి విషమించటము చేస్తే తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్చినారు అని చెప్పినారు.  వెంటనే గాంధీ ఆసుపత్రికి వెళ్ళినాను. 

ఆయన మరణముతో యుధ్ధము చేయుచున్నారు.  చాలా నీరసముగా మాట్లాడుచున్నారు.  పరిస్థితిని అర్ధము చేసుకొన్నాను.  బయటనుండి తులసిదళములు, గ్లాసులో మంచినీరు తెప్పించినాను.  ఆయన తలప్రక్కన కూర్చుని శ్రీసాయి మధ్యాహ్న హారతి చదివినాను.  శ్రీసాయికి పంచదార నైవేద్యముగా పెట్టి ఆప్రసాదమును ఆయన నోటిలో వేసినాను.  ఆయన దానిని చప్పరించినారు.  ఆసమయమునుండి ఆయన పరలోక యాత్ర ప్రారంభమైనది.  నేను ఆయన చెవిలో రాజారాం -  సాయిరాం అని చెబుతున్నాను.  ఆయన రాం - రాం అని మెల్లిగా అంటున్నారు.  మధ్యాహ్న్నము 1 గంట ప్రాతములో డాక్టర్లు ఆక్సిజన్ పెట్టినారు. గుండె నిమిషానికి 180 సార్లు కొట్టుకొనుచున్నది అని ఆయన తలప్రక్కన ఉన్న యంత్రము చేబుతున్నది.  డాక్టర్లు ఆయనను బ్రతికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  వారు ఆశ వదలి ప్రక్కకు తప్పుకొన్నారు.  నేను మాత్రము ఆయన చెవిలో రాజారం - సాయిరాం అని అంటున్నాను.  ఆయన అతి కష్ఠముమీద రాం అని అంటున్నారు.  సమయము 1 గంట 15 నిమిషాలు.  ఆయన నోటిలో తులసి నీరు పోసినాను.  ఆయన ఒక గుటక వేసినారు.  రెండవసారి ఆయన నోటిలో తిరిగి తులసి నీరు పోసినాను. అవి బయటకు వచ్చినవి.  ఆయన ఆఖరి శ్వాస 1 గంట 20 నిమిషాలకు "ఆహ" అని పెద్దగా వినిపించినది.  ఆయన మన మధ్యలేరు అని గ్రహించినాను.  దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చినాను. డాక్టర్లు వచ్చి వార్డులో ఏడవరాదు అన్నారు.  వాళ్ళకు ఏమి తెలుసు నామనసులోని బాధ.  నాసాయి నన్ను వదలి వెళ్ళిపోయినారు.  బంధువులు అందరు నాదగ్గరకు వచ్చి ఎన్ని గంటలకు ఆఖరి శ్వాస తీసుకొన్నారు అని అడిగినారు.  30.01.92 గురువారము మధ్యాహ్న్నము 1 గంట 20 నిమిషాలు అని చెప్పినాను.  బంధువులలో ఒకరు అన్నారు.  భీష్మాచార్యులు లాగ ఏకాదశి ఘడియలలో ప్రాణము విడిచినాడు.  సోమయాజులు ఎంత అదృష్ఠవంతుడు.  అవును ఆయన దశమి ఘడియలో మృత్యువుతో పోరాటము ప్రారంభించి ఏకాదశి ఘడియలలో తన శరీరాన్ని ఓడించి, సాయిలో ఐక్యమగుట ఆధ్యాత్మిక విజయము అని నేను భావించినాను.  ఆనాడు అంటే 1918 సంవత్సరము అక్టోబరు నెల 15వ.తారీకు మధ్యాహ్న్నము హారతి స్వీకరించిన పిదప, 2 గంటల 30 నిమిషాలకు శ్రీసాయి ఆఖరి శ్వాస తీసుకొన్నారు. 

శ్రీసాయి దశమి, ఏకాదశి ఘడియలలో నానాసాహెబు నిమోన్ కర్ చేతితో ఆఖరి దాహమును తులసినీళ్ళతో తీర్చుకొన్నారు.  నాపాలిట సాయి శ్రీసోమయాజులు గారు ఏకాదశి ఘడియలలో ఆఖరి దాహము తీర్చుకోవటానికి తులసి నీళ్ళను నా చేతితో స్వీకరించినారు.  ఈవిధముగా శ్రీసాయి ఆనాడు తను మహా సమాధి చెందినపుడు భక్తులు పొందిన అనుభవాలను నాకు ఈనాడు నాపాలిట సాయి శ్రీసోమయాజులుగారు ఆఖరి శ్వాస తీసుకొనే సమయములో చూపించి తన మాటను నిలబెట్టుకొన్నారు.  363 వ.పేజీలో వివరించబడిన సంఘటన నాజీవితములో జరిగినది.  బాబా లక్ష్మన్ మామా జోషికి బాబా స్వప్నములో కాంపించి చేయి పట్టిలాగి యిట్లు అనెను "త్వరగా లెమ్ము" బాపు సాహెబు నేను మరణించితిననుకొనుచున్నాడు.  అందు చేత అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతిని యిమ్ము."  ఆరోజు 11.02.92 శ్రీసోమయాజులు బాబయ్యగారు చనిపోయి 12 రోజులు పూర్తి అయినాయి.  శ్రీసాయికి ఉదయము హారతి ఇవ్వవలసియున్నది.  అలారము కొట్టలేదు.  బధ్ధకముగా యుంది.  నిద్రనుండి లేవలేదు.  శ్రీసాయి సోమయాజులు బాబయ్యగారి రూపములో కనిపించి తనకు యిష్ఠమైన ఉదయపు కాకడ హారతి చదవమని కోరినారు.  ఉలిక్కిపడి లేచినాను.  గోడ గడియారము ఉదయము 6 గంటలు చూపుతున్నది.  అలారం టైం గడియారము ఆగిపోయి ఉంది.  వెంటనే లేచి ముఖము కడుగుకొని శ్రీసాయికి కాకడ హారతి యిచ్చినాను. 

30.01.1992 నాడు సాయంత్రము సూర్యాస్థ సమయములో శ్రీసోమయాజులు బాబయ్యగారి శరీరాన్ని చితిపై పెట్టినపుడు 366వ.పేజీలో శ్రీ హేమాద్రిపంతు చెప్పిన మాటలు "పంచ భూతాత్మకమగు శరీరము నాశనము అగును.  లోననున్న ఆత్మ పరమ సత్యము.  అదియే సాయి."  సాయి నీలోను, నాలోను అందరిలోను ఉన్నారు అనే విషయాన్ని అందరు గ్రహించగలిగిననాడు ఈప్రపంచములో సుఖ శాంతులుకు లోటు యుండదు.

శ్రీ సాయి సేవలో 

నీతండ్రి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45 వ.అధ్యాయం

$
0
0
       
       

01.08.2013 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు 
మరలా వారం రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకు వీలు పడింది..ఆలస్యానికి మన్నించండి.

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45 వ.అధ్యాయం

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 76వ.శ్లోకం, తాత్పర్యం
             

శ్లోకం:  భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః   |

         దర్పహా దర్పదో దృప్తోదుర్ధరోధా పరాజితః  || 

తాత్పర్యం: పరమాత్మను పంచభూతములకు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవానిగా, పవిత్రమైన అగ్నిగా, గర్వమును నశింపచేయువానిగా మరియూ గర్వమైనవానిగా, గర్వము లేనివానిగా, గర్వము కలిగినవారికి ధరించుటకు వీలుకానివానిగా, జయించుటకు సాధ్యముకాని వానిగా ధ్యానము చేయుము. 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45వ.అధ్యాయము

                            16.02.92

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయిని గూర్చిన కొన్ని వివరాలను, విషయాలను తెలియపర్చినారు.  శ్రీసాయి సత్ చరిత్రలోని మాటలు ప్రతి సాయిబంధు గుర్తు పెట్టుకోవాలి. 



 "యితరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను.".  నేను ఈ మాటలు శ్రీసాయి చెప్పిన మాటలుగానే భావించి శ్రీసాయిపై పూర్తి నమ్మకము ఉంచి బ్రతుకుతున్నాను.  శ్రీసాయిపై మనకు నమ్మకము యుంది అంటే మనకు మనపై నమ్మకము యున్నట్లే.  ఈబ్రతుకు ఈవిధముగా సాగిపోతే నేను అదృష్ఠవంతుడినే."

శ్రీసాయి సత్ చరిత్రలోని శ్రీసాయి దీవెనలు నా జీవితములో మరచిపోలేనివి. "యిక పొమ్ము.  నీవు క్షేమమును పొందెదవు.  భయమునకుగాని, ఆందోళనకు గాని, కారణము లేదు".  ఈదీవెన అక్షరాల జరిగినది.  1990 సంవత్సరములో నేను ఆఫీసు పనిలో ప్రమోషన్ నిమిత్తము మద్రాసు వెళ్ళినాను.  తెల్లవారితే ప్రమోషన్ నిమిత్తము యింటర్వ్యూ  జరుగుతుంది.  రాత్రి శ్రీసాయి నామస్మరణ చేస్తు నిద్రపోయి ఉదయము లేచి శ్రీసాయి సత్ చరిత్ర 45వ. అధ్యాయము పారాయణ చేసినాను.  నేను ఆందోళనతో నిత్య పారాయణ చేస్తున్నాను.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసాయి దీవెన చదవగానే నాలో నూతన ఉత్సాహము కలిగినది.  ఆ ఉత్సాహముతో యింటర్యూకు వెళ్ళి విజయము సాధించినాను.  నేను యింటర్యూకు వెళ్ళేముందు అక్కడి తోటలో కొంచము సేపు సాయి నామస్మరణ చేసినాను.  ఆసమయములో నాఎదురుగా యున్న చెట్టుపై తెల్లరంగు కోకిల కూర్చుని కూత కూయుచున్నది.  అది నాకు చాలా ఆశ్చర్యము కలిగించినది.  ఆకోకిల శరీరము అంతా తెలుపు.  కాని, దాని తల మాత్రము నలుపు రంగులో యున్నది.  

ఆ విచిత్ర పక్షిని నాజీవితములో అంతకు ముందు ఎన్నడూ చూడలేదు.  బహుశ శ్రీసాయి నాకు ధైర్యము యిచ్చినారు అని భావించినాను.  ఈ విషయాన్ని శ్రీహేమాద్రిపంతు చక్కగా వివరించినారు. "గురువు నామము జపించుట వలను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటియందు చూచుటకవకాశము కలుగును.  మనకు అది శాశ్వత ఆనందమును కలుగ చేయును. "  శ్రీసాయి ఈవిధముగా నేను అధైర్యముతో ఉన్నపుడు నాకు పక్షిరూపములో దర్శనము యిచ్చి నాకు  ధైర్యమును ప్రసాదించినారు.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు. "ఈలోకములో అనేకమంది యోగులు గలరు.  కాని మన గురువు అసలైన తండ్రి.  యితరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. "ఈవిషయాన్ని ఎప్పుడు మరచిపోరాదు.  మరచిపోయి ప్రక్కదారులు తొక్కిననాడు మనము మన జీవిత గమ్యాన్ని చేరలేము.  నీకు జీవితములో నీతోటివాడితో భేదాభిప్రాయాలు వచ్చినపుడు శ్రీసాయి చెప్పినమాటలు గుర్తు చేసుకో "మంచి గాని, చెడ్డగని, ఏది మనదో అది మన దగ్గర యున్నది.  ఏది యితరులదో, యది యితరుల వద్ద యున్నది."  ఎంత చక్కటి మాట.  ఈమాటను మననము చేసుకొంటు యుండు.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

పుణ్యభూమి శిరిడిలో దొరికిన రత్నమణి సాయి - 46 వ.అధ్యాయము

$
0
0
           
        
02.08.2013 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 46వ.అధ్యాయము

               

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 77వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం: విశ్వమూర్తిర్మహామూర్తి ర్దీప్తమూర్తిరమూర్తిమాన్  |

        అనేకమూర్తి రవ్యక్త శ్శతమూర్తి శతాననః     ||   

పరమాత్మను విశ్వమంతటా నిండిన పెద్ద రూపముగా, ప్రకాశవంతముగా, అందు అనేక రూపములు, వివిధ ఆకారములతో ముఖములతో, వందల సంఖ్యలో నుండగా మరల తనకట్టి రూపమే లేనివానిగా, భౌతిక రూపముగా దర్శించుట వీలుగానివానిగా ధ్యానము చేయుము.  

పుణ్యభూమి శిరిడిలో దొరికిన రత్నమణి సాయి - 46 వ.అధ్యాయము

                                      17.02.92

ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు చక్కని శ్రీసాయి లీలలు వర్ణించినారు.  ఆలీలను అనుభవించిన శ్యామా చాలా అదృష్ఠవంతుడు.  నేను శ్యామా అంతటివాడిని కాను, కాని, శ్రీసాయి ఆనాడు శ్యామాకు కలిగించిన అనుభూతిని నాకు ప్రసాదించినారు.  



ఆవివరాలు ఈఉత్తరములో వ్రాస్తాను.  నాకు జరిగిన అనుభవాన్ని చెప్పేముందు శ్రీహేమాద్రిపంతు "నీభక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు" అని శ్రీసాయితో అంటారు.  శ్రీసాయి త్వరలో నాకోరికలు (నాబరువు బాధ్యతలు) తీర్చి నన్ను తన బా.ని.స.గా స్వీకరించే రోజు కోసము ఎదురు చూచుచున్నాను.  నాకు శ్రీసాయి ప్రసాదించిన అనుభూతిని వివరించుతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు "ఒకవేళ బాబా ఎవరైన భక్తుని అమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటివద్దను గాని, దూరదేశమున గాని, వానిని వెంబడించుచుండును.  భక్తుడు తన యిష్ఠము వచ్చిన చోటుకు పోనిమ్ము.  బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా బోయి యేదో ఒక ఊహించని రూపమున ఉండును.  ఈవిషయము శ్యామా గయ యాత్ర విషయములో ఆనాడు నిరూపించబడినది.  1990 సంవత్సరములో యిటువంటి అనుభూతి కొరకు శ్రీసాయిని ప్రార్ధించినాను.  నాప్రార్ధన వ్యర్ధము కాలేదు.  1991 సంవత్సరములో మా ఆఫీసు వారు నన్ను కొరియా దేశము పంపుచున్నారు అని తెలిసిన రోజున శ్రీసాయి నామన్సులో ప్రవేశించి నాతో అంటారు.  నీకంటే ముందుగా నేను కొరియా దేశము వెళ్ళి అక్కడ నీరాకకు ఎదురు చూస్తూ ఉంటాను.  యిది ఎంత చక్కటి ఊహ.  నిజముగా యిది జరిగిన ఎంత బాగుండును అనే ఆలోచనలతో ఆరోజు గడిపివేసి ఆసంగతి మర్చిపోయినాను.  నేను 06.05.91 నాడు సాయంత్రము 6 గంటలకు కొరియా దేశములోని చాంగ్ వాన్ పట్టణములోని ఒక పెద్ద హోటల్ లో బస చేయటానికి చేరుకొన్నాను.  ఆహోటల్ లోని రూము తాళము తీసి లోపలికి వెళ్ళి టేబుల్ లైటు వేసినాను.  టేబుల్ పైన ఒక రెక్కల పురుగు ఆలైటు చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేసి నేను లోపలకు వచ్చిన ద్వారము గుండా బయటకు వెళ్ళిపోయినది. నా మనసు సంతోషముతో నిండిపోయినది.  శ్రీసాయి ఈరూపములో నాకంటే ముందుగా కొరియా దేశము చేరుకొని నన్ను ఆశీర్వదించినారు అనే భావన కలిగినది.  శ్రీసాయికి నమస్కరించినాను.  ఈ సంఘటన కాకతాళీయము అని కొంత మంది అనవచ్చును.  యిది కాకతాళీయము కాదు అని చెప్పటానికి అదే గదిలో జరిగిన యిటువంటి యింకొక సంఘటన వివరించుతాను.  18.05.91 నాడు తిరిగి యిండియాకు ప్రయాణము.  ఆరోజు తెల్లవారుజామున 5 గంటలకు శ్రీసాయి హారతి చదవటానికి లేచి టేబుల్ లాంప్ వేసినాను.  ఆశ్చర్యము 06.05.91 నాడు సాయంత్రము 6 గంటలకు దర్శనము యిచ్చిన రెక్కలపురుగు టేబుల్ ల్యాంప్ చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేసి కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయినది.  శ్రీసాయి ఈ విధముగా తను నాకంటే ముందుగా యిండియా వెళ్ళిపోతున్న అనుభూతిని కలిగించినారు.  ఆనాడు శ్రీసాయి శ్యామాతో అన్నారు "కాశి ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలసికొనెదను."  నావిషయములో శ్రీసాయి నాకంటే ముందుగా కొరియా దేశములోని చాంగ్ వాన్ పట్టణము వెళ్ళి నాకంటే ముందుగానే తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చినారు.  ఈ అనుభూతిని నేను జన్మలో మరచిపోలేను.  శ్రీసాయి సర్వవ్యాపి అని చెప్పటానికి నాకీ ఒక్క అనుభూతి చాలును.  రెండు మేకల కధలో శ్రీసాయి తన గత జన్మలోని స్నేహితుల కధ చెప్పినారు.  గత జన్మ సిధ్దాంతము, తిరిగి జన్మించటము విషయములను నేను శ్రీసాయిని ధ్యానములో 
యుండ గా ప్రశ్నించినాను.  శ్రీసాయి చక్కని సమాధానము యిచ్చినారు.  ఆవిషయాలు యిక్కడ వ్రాయటము అంత సమంజసము కాదు  ఆవిషయాలు వీలు చూసుకొని ప్రత్యక్షముగా మాట్లాడుతాను.  

శ్రీసాయికి జంతువులపై ఎనలేని ప్రేమ.  ఆయన కుక్క రూపములోను, పిల్లి రూపములోను తన భక్తులను కాపాడిన సంఘటనలు కలవు.  శ్రీసాయి తాను భోజనము చేసేముందు ద్వారకామాయిలోని పిల్లులకు, కుక్కలకు ముందుగా రొట్టెముక్కలు పెట్టి మిగిలిన పదార్ధాలను తను భోజనము చేసేవారు.  ఈవిధముగా సర్వ జీవాలలోను భగవంతుని చూడమని శ్రీసాయి మనకు చెప్పినారు.  మన యింటి గుమ్మము దగ్గర పశువులు నీళ్ళు త్రాగటానికి కావలసిన నీళ్ళతొట్టిని శ్రీసాయి నాచేత ఏవిధముగా కట్టించినారు అనేది నీకు వెనకటి ఉత్తరములో వ్రాసినాను.  శ్రీసాయిని సర్వ జీవాలలోను చూడటానికి ప్రయత్నించు.

శ్రీసాయి సేవలో 

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 47వ.అధ్యాయం

$
0
0
   
   
04.08.2013 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  47వ.అధ్యాయం

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 78వ.శ్లోకం, తాత్పర్యం
            

శ్లోకం: ఏకో నైకస్సవఃకః కిం యత్తత్పద మనుత్తమమ్     |  

        లోకబంధుర్లోకనాధో మాధవో భక్తవత్సలః  ||

తాత్పర్యం : పరమాత్మ అనేకులలోనున్న ఒక్కనిగా, మరియూ ఒక్కనిలోనున్న అనేకముగా నున్నాడు.  అతడు ఎవరు? ఏమిటి? ఏది? అది, మొదలగు శబ్దములచే తన సంబంధము నెరుక పరుచువాడు.  ఆయన ఎల్లప్పుడూ లోకమునకు రక్షకుడే, బంధువై యుండును.  ఆయన లక్ష్మీదేవికి భర్త, భక్తులకు భక్తుడు.  


 పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  47వ.అధ్యాయం

                                18.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులకు గత జన్మ బంధాలు గురించి తెలియచేసే విషయాలు చెప్పినారు.  ఈ అధ్యాయము చదివిన తర్వాత నాలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి.  అన్ని విషయాలు వివరముగా వ్రాయలేకపోయినా సంక్షిప్తముగా వ్రాస్తాను.  



ఈ ఉత్తరము చదివేముందు ఒక్కసారి 47వ. అధ్యాయము జాగ్రత్తగా చదువు.  వీర భద్రప్ప, చెన్న బసప్ప (పాము-కప్ప) కధ చదివిన తర్వాత, అది నాకధ అంటే నీ తండ్రి కధ అని నీకు అనిపించుతున్నది కదూ.  శ్రీసాయి సత్చరిత్రలో నీతిని గ్రహించు, "తనకెవరితోనైన శతృత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను.  ఎవరికైన ఏమైన బాకీ యున్న దానిని తీర్చి వేయవలెను.  ఋణముగాని, శతృత్వశేషముగాని, యున్నచో దానికి తగిన బాధ పడవలెను." నాకధను సంక్షిప్తముగా చెబుతాను అని అన్నాను కదూ - విను- నేను 1970 సంవత్సరములో నీతల్లిని ప్రేమించి వివాహము చేసుకొన్నాను.  ప్రేమవివాహము నాపాలిట శాపముగా మారినది.  నీతల్లి యొక్క తండ్రి నన్ను చులకనగా చూడటము - నన్ను తరచుగా అవమాన పరచటము, తన దగ్గరయున్న ధనాన్ని నేను ఎక్కడ అడుగుతానో అనే భయముతో నన్ను ఎల్లప్పుడు దూరముగా యుంచేవారు.  

ఈ విధమైన ఆయన ప్రవర్తన నాలో శతృత్వము పెరగటానికి ఆస్కారము కలిగించింది.  1990 సంవత్సరము నాటికి మాయిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే స్థితి ఏర్పడినది.  1990 జూన్ నెలలో మొదటిసారిగ శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించిన తర్వాత ఏవిధముగా ఈ శతృత్వము బాధను వదిలించుకోవాలి అనే ఆలోచనలు రాసాగినాయి.  నాజీవితములో అంటే ఈఉత్తరము వ్రాసేనాటికి నేను మీతాతగారి యింటిలో అంటే నామావగారి యింట పది పూటలు భోజనము చేసి యుండకపోవచ్చును.  మీఅమ్మ తండ్రి ఋణము ఎలాగ తీర్చుకొనేది.  ఆయనతో శతృత్వముతో యిన్నాళ్ళు గడిపినాను.  దానినుండి విముక్తి ఎప్పుడు పొందేది ఆసాయినాధునికే తెలుసు.  

శ్రీసాయి సేవలో 

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ. అధ్యాయము

$
0
0
    
   
06.08.2013 మంగళవారము 

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ.అధ్యాయం
        
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 79వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాంగదీ  |

          వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః    || 

పరమాత్మను బంగారు వర్ణముగా, చక్కని శబ్దములతో, వర్ణములతో కూడిన నామముకలవానిగా, బంగారు చాయగలిగిన తన అవయవములందు గంధపు పూతగలవానిగా, ఆయన అవయవములు పొందిక కలవిగా, అతిక్రమిమించువారిని తన పరాక్రమముతో సం హరించువానిగా, అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసముగా, నేతిని స్వీకరించు అగ్నిగా, కదలునట్టి వాయువుగా, కదలని చోటుగా, తనచే నిండిన శూన్యముగా ధ్యానము చేయుము.        

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 48వ. అధ్యాయము

                                     19.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు  శ్రీసాయియొక్క అనంతత్వాన్ని, భక్తులపై వారికి యున్న ప్రేమను వర్ణించినారు.  యిటువంటి సద్గురువు మనకు లభించటము మన పూర్వ జన్మ సుకృతము.  ప్రేమయొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వివరింపబడినది.  ఒక్కొక్కసారి అనిపించుతుంది - నీవు నీతోటివాడిని ప్రేమించకపోతే నీవు శ్రీసాయి భక్తుడివి అని చెప్పుకోగలవా.  


ఈ ప్రశ్న ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.  ప్రతి ఒక్కరు తమలో తాము ప్రశ్న వేసుకొంటే చాలు.  ఈ ప్రశ్నకు సమాధానము, అవును నేను నాతోటివాడిని ప్రేమించుతాను అని నీమనసు చెబితే నీవు శ్రీసాయికి ప్రీతిపాత్రుడివి - అందులో ఎట్టి వివాదము లేదు.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీ షేవడే తనతోటి విద్యార్ధులను ఉద్దేశించి ధైర్యముతో అన్న మాటలు  నాలో కూడా ధైర్యాన్ని కలిగించుతున్నాయి. - "నేను పూర్తిగా వారినే నమ్మి యున్నాను.  వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు.  నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదును." ప్రతి సాయి బంధు తన జీవితములో ఏదైన విషమ పరీక్ష వచ్చినపుడు శ్రీసాయిని స్వచ్చమైన మనసుతో ప్రార్ధించి ఆపరీక్షలో విజయాన్ని సాధించి  యుంటారు. మరి నేను శ్రీసాయిని స్వచ్చమైన మనసుతో ప్రార్ధించిన ప్రార్ధన ఒక్కటే.  అది  నీకు కొంచము కష్ఠము అనిపించవచ్చు.  - "మరి నాజీవితములో నాంతిమ శ్వాస గురువారము నాడు శ్రీసాయి పాదాల మీద వదలాలని  ఉంది.  యిది నాకు శ్రీసాయికి మధ్య ఉన్న పరీక్ష.  శ్రీసాయి దయతో నేను విజయాన్ని సాధించుతాను అనే నమ్మకము ఉంది.  ఈ నానమ్మకానికి సాక్షిగా నిలబడవలసినది నీవు.  విజయాన్ని ప్రసాదించవలసినది శ్రీసాయి.  ఈ రోజు నిత్యపారాయణలో శ్రీసాయి యిచ్చిన సందేశము  - "ఈపాదములు ముదుసలివి, పవిత్రమైనవి.  యిక నీకష్ఠములు తీరిపోయినవి.  నాయందే నమ్మకము ఉంచుము.  నీమనోభీష్ఠము నెరవేరును." నేను ఆఫీసుకు వెళ్ళటానికి బయలుదేరినాను.  యింతలో టెలిగ్రాం అంటూ ఒక వ్యక్తి ఎదురు వచ్చినాడు.  ఆటెలిగ్రాం లోని సందేశము శ్రీసాయి ఆశీర్వచనాలతో వచ్చినదా అని అనిపించినది.  ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్య పారాయణలో "నీ మనోభీష్ఠము నెరవేరును"అని సందేశము వచ్చినది.  టెలిగ్రాంలో నీ అక్క హేమలతకు వివాహము నిశ్చయము అయినది అనే వార్త వచ్చినది.  రెండు రోజుల క్రితము మీ అక్కకు పెండ్లి చూపులు జరగటము - ఈ వివాహము జరగాలి అనే నామనసులోని కోరిక - ఈరోజు శ్రీసాయి సత్ చరిత్రలోని సందేశము మరియు టెలిగ్రాం ద్వారా వివాహము నిశ్చయము అయినది అనే వార్త - యిది అంతా శ్రీసాయి లీల కాదా !  ఒక్కసారి ఆలోచించు.  నేను, మీఅక్క, మనస్పూర్తిగా శ్రీసాయిని ఈ వివాహము విషయములో సహాయము చేయమని వేడుకొన్నాము.  శ్రీసాయి మాప్రార్ధన విన్నారు.  నామనసులోని కోరిక తీర్చినారు.  ఈ సంతోషముతో శ్రీసాయికి మరొక్కసారి నమస్కరించుతున్నాను.

శ్రీసాయి సేవలో 

నీతండ్ర్లి  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

$
0
0
     
        
07.08.2013 బుధవారము
ఓం  సాయి  శ్రీసాయి  జయజయ సాయి 
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 80వ.శ్లోకం, తాత్పర్యం
  
శ్లోకం :  అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్       |     

            సుమేధా మేధజోధన్య స్సత్యమేధా ధరాధరః           | |

తాత్పర్యం : పరమాత్మను ఆత్మ గౌరవములేనివానిగా, తన స్పర్శచే సృష్టికి గౌరవమిచ్చువానిగా, అందరిచే గౌరవింపబడువానిగా, ధ్యానము చేయుము.  ఆయన మూడు లోకములకు అధిపతియై అట్టి మూడు లోకములనూ తానెత్తిపట్టి యున్నాడు.  ఆయన అబివృధ్ధి చెందుచున్న బుధ్ధిగా, దాని ఫలితముగా దానిని పొందువానిగా ధ్యానము చేయుము.  సత్యమే ఆయన ధర్మమై, భౌతికస్థితినుండి సత్యలోకము వరకూ తన బుధ్ధియందు సమస్తము ధరించుచున్నాడు.          

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 49వ.అధ్యాయం

                                      20.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు, సాయి భక్తులుగా మారిపోయిన యిద్దరి చరిత్ర - సాయిభక్తునిగా ఉంటూ మనసులో నిగ్రహము లేక మానసిక బాధపడుతున్న ఒక వ్యక్తి చరిత్ర వర్ణించినారు.  ఈ ఉత్తరము చదవటానికి ముందు ఈముగ్గురి చరిత్ర చదివినపుడు నీకే చాలా ఆస్ఛర్యము వేస్తుంది.  


శ్రీసాయిపై విపరీతమైన నమ్మకము ఏర్పడుతుంది.  అన్నట్టు ఈ ఉత్తరము రాజమండ్రి స్టేషన్ నుండి ఎందుకు రాస్తున్నాను అనేది నీకు చెప్పలేదు కదూ - ఈరోజు నిత్యపారాయణ 49వ.అధ్యాయము రైలులో చేసినాను.  ఈ అధ్యాయములో హేమాద్రిపంతు చెప్పిన మాటలు, ఈ నారైలు ప్రయాణానికి, జీవితము అనే రైలు ప్రయాణానికి చాలా దగ్గర సంబంధము చూపించుతున్నది.  "మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును".  ఈమాటలపై నమ్మకముతో నాకర్తవ్యమును పూర్తిచేయటానికి నిన్నరాత్రి సికిన్ద్రాబాద్ నుండి విశాఖపట్నము బయలుదేరినాను. దారిలో రాజమండ్రి స్టేషన్ నుండి నీకు ఈఉత్తరము వ్రాస్తున్నాను.  మీ అక్క వివాహము చేయటము నాకర్తవ్యము.  ఈరోజు సాయంత్రము విశాఖపట్నములో పెండ్లి తాంబూలాలు తీసుకొనవలసి యున్నది.  శ్రీసాయిబాబా సహాయము కోరుతు ముందుకు వెళ్ళుతున్నాను.  శ్రీసాయి సత్ చరిత్రలో శ్రీసోమదేవస్వామి యొక్క గురువు చెప్పినమాటలు వివరించబడినవి "ఎచ్చట మనసు శాంతించి యానందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము".

నావిషయములో నేను కోరుకొంటున్న కోరిక నీకు చేబుతాను, విను.  కమలానగర్ హైదరాబాదులో నేను స్వంతముగా కట్టుకొన్న నాస్వంత యింటిలో శ్రీసాయి దర్బారు నిర్మించుకొని ఈశేష జీవితము శ్రీసాయి సేవలో గడపాలి అని ఉంది.  ఈనాకోరిక తీరాలంటే శ్రీసాయి దయ - నీసహకారం కావాలి.  నానాసాహెబు చందోర్కరు అందమైన స్త్రీని చూసిన తర్వాత మనోనిగ్రహము లేక బాధపడుతున్న సమయములో శ్రీసాయి ఆయనకు యిచ్చిన సలహా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసియున్నది.  "నానా! అనవసరముగా చీకాకు పడుచున్ టి  వేల?  యింద్రియములను వాని పనులు చేయనిమ్ము.  వానిలో మనము జోక్యము కలుగజేసికొనకూడదు.  దేవుడు ఈసుందరమైన ప్రపంచమును సృష్ఠించి యున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి".  నానా త నతప్పును తెలుసుకొని తన మన్సులోని చెడు ఆలోచనలను తొలగించినాడు.  నావిషయములో శ్రీసాయి ఒకసారి (ధ్యానములో యండగా) అంటారు - పరస్త్రీ వ్యామోహము పరస్త్రీ సంబంధము టిక్కెట్టు లేకుండ చేసే రైలు ప్రయాణము వంటిది.  అటువంటి జీవితము అనే రైలు ప్రయాణములో సుఖశాంతులు కరువు అయి మనము మన జీవిత గమ్యం చేరలేము.  ఈవిషయములో యింతకంటే విపులముగా నీకు నేను వ్రాయలేను.  నీజీవితములో మంచి, చెడును గమనించుతు ముందుకు సాగిపో.

శ్రీసాయి సేవలో

నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

గురువుయొక్క మహిమ యెవరికీ తెలియదు..గురువుని బాగా అర్ధం చేసుకోవాలి..ఆయనలో ఉన్న విశిష్టమయిన గుణాలన్నిటినీ మనం అర్ధం చేసుకొని, ఆచరించినప్పుడే మనం మన గురువుని పూర్తిగా అర్ధం చేసుకున్నట్లు..ఈ మధురమైన భజన వినండి.

http://www.youtube.com/watch?v=-Qb2jMOUxtE

Shirdisaidarbar link
https://www.facebook.com/ShirdiSaidarbar1?ref=hl

Dwarakamayi geet maala  link
https://www.facebook.com/dwarakamai?ref=hl

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

$
0
0
       
     
08.08.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము
         
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 81వ.శ్లోకం, తాత్పర్యం

శ్లోకం :  తేజోవృషో ద్యుతిధరస్సర్వ శస్త్ర భృతాంవరః  |

          ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నేకశృంగో గదాగ్రజః || 

తాత్పర్యం : పరమాత్మను తేజోవంతమయిన సత్తువగలవానిగా, కాంతిని ధరించినవానిగా, ఆయుధములు ధరించిన వానిలో గొప్పవానిగా, దీక్ష కలిగి నిగ్రహము గల పాలకునిగా, అనేక శృంగములు గలవానిగా, గదునికి అన్నగా ధ్యానము చేయుము.    

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 50వ.అధ్యాయము

                            విశాఖపట్నము  21.02.92

ప్రియమైన చక్రపాణి,

శ్రీ హేమాద్రిపంతు ఈ అధ్యాయములో ప్రముఖ సాయి భక్తుల చరిత్ర వర్ణించినారు.  శ్రీసాయికి తన భక్తులపై ఉన్న ప్రేమను గుర్తించు.  నీవు కూడా శ్రీసాయి ప్రేమను సంపాదించటానికి కృషి చేయి.  ఈరోజున ఈఉత్తరము నీకు విశాఖపట్నము నుండి వ్రాస్తున్నాను.  కారణము నిన్నటి ఉత్తరములో నీకు వివరించినాను.  నిన్నటిరోజు సాయంత్రము 5 గంటలకు శ్రీగంటి సన్యాసిరావుగారి యింటికి వెళ్ళి అక్కడ మీఅక్క పెండ్లి సంబంధమువారి పెద్ద అబ్బాయి చి.రామకృష్ణతో నిశ్చయము చేసినాను.  



వాళ్ళు కట్నము అడగలేదు.  లాంచనాల లిస్టు యిచ్చినారు.  ఆలిష్టుమీద శ్రీసాయి  అని పేరు వ్రాసియుంది, సంతోషముతో అన్నింటికి అంగీకరించాను.  మరి వివాహము ముహూర్తము ఈరోజున పెట్టించి తెలుపుతాము అన్నారు శ్రీసన్యాసిరావుగారు. శ్రీసాయి దయతో హైద్రాబాద్ లో వివాహము జయప్రదముగా చేయగలనని నమ్మకము ఉంది.  వేచి చూడాలి.  నిన్నటిరోజున విశాఖపట్నము రాకముందు మన బంధువులలో కొందరిపై కోపము యుండేది.  ఈరోజు ఉదయము శ్రీసాయి హారతి చదవటానికి ముందు శ్రీసాయి ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి తను ప్రేమదాసునని చెప్పి నన్ను నిద్రనుండి మేల్కొల్పినారు.  ఈరోజునుండి ఎవరిమీదను కోపగించుకోరాదని నిర్ణయించినాను.  ఈ నానిర్ణయానికి చేయూత యివ్వవలసినది శ్రీసాయినాధుడే.  ఈరోజు ఉదయము శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణకు ముందు నీమేనత్త (నా అక్కగారు) నాతండ్రి 40 సంవత్సరముల క్రితము పూజచేసుకొన్న శ్రీసాయి పటము యిచ్చినది. 

ఆపటము ఒక ఆకుపచ్చని రంగు బట్టలో చుట్టబడియుంది.  ఆ ఆకుపచ్చని రంగు శ్రీసాయినాధునికి చాలా ప్రీతికరము అయి ఉండవచ్చును.  సుమారు 35 సంవత్సరాలు శ్రీసాయి ఆపటము రూపములో ఆ ఆకుపచ్చని రంగు వస్త్రము ధరించినారు.  ఆపటము చూసిన తర్వాత ఆపటములో స్వర్గస్థులైన నాతండ్రిని చూడగలిగినాను.  ఆపటమును టేబుల్ మీద పెట్టుకొని 50వ.అధ్యాయము నిత్యపారాయణ చేయసాగాను.  అందులో వివరించబడిన సంఘటన నాలో చాలా ఆశ్చర్యమును కలిగించినది.  "శిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపములో నచట తన్ను ఆశీర్వదించుటకు సిధ్ధముగానున్నట్లు తెలసి యాతడు మిక్కిలి ఆశ్చర్యపడెను".  నేను విశాఖపట్నములో యున్నాను.  శ్రీసాయి పటము రూపములో అక్కడకు వచ్చి నన్ను ఆశీర్వదించినారు అని నమ్ముతాను.  శ్రీసాయి సత్ చరిత్రలో  శ్రీసాయి చక్కని సందేశము యిచ్చినారు "మంచి గాని చెడుగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు.  గర్వాహంకార రహితుడువయి ఉండుము.  అపుడే నీపరచింతన అభివృధ్ధి పొందును.  బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితము వ్రాసెను. నాజీవితములో శ్రీసాయి సత్ చరిత్ర ప్రభావమును నీకు ఉత్తరాల రూపములో వ్రాసినాను.  ఈఉత్తరాలు యువతరానికి ఉపయోగపడితే తెలుగు, యింగ్లీషు భాషలలో ముద్రించి శ్రీసాయి తత్వప్రచారానికి సహాయము చేయి.

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 51వ.అధ్యాయము

$
0
0
             
       

09.08.2013 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి 

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఫ్రియమైన సాయిబంధువులారా! నేటితో "పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి" పూర్తి అవుతున్నది..సాయి బా ని స గారు తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలలోని సాయి తత్వాన్ని మీరందరు చక్కగా చదివి అర్ధం చేసుకున్నారని తలుస్తాను...సాయి.బా.ని.స. గారు ఆచరించినట్లుగా మనందరమూ శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేసినట్లయితే సర్వ శుభములు కలుగుతాయని మనకందరకూ బాగా అర్ధమయింది..ఈ అధ్యాయము చదివిన వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 51వ.అధ్యాయము చివరిలో నున్న ఫలశ్రితిని ఒక్కసారి చదవండి..శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ వల్ల కలిగే లాబాలు కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి మీకే అర్ధమవుతుంది..

ఇంతకుముందు శ్రీసాయితో మధుర క్షణాలు ప్రచురించాను...రేపటినుండి మిగిలిన భాగాలను ప్రచురిస్తున్నాను..చదివి ఆనందించండి..శ్రీసాయిని మనసారా మదిలో నిలుపుకొనండి.

ఓం సాయిరాం   

      
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 82వ.శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం : చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః  | 

         చతురాత్మా చతుర్బావశ్చతుర్వేద విదేకపాత్ ||

తాత్పర్యం :  పరమాత్మ నాలుగు మూర్తులుగా లేక దశలుగా సృష్టిని వ్యక్తము చేయువాడు.  ఒకటి పరావాక్కు, రెండు పశ్యంతీవాక్కు, మూడు మధ్యమావాక్కు, నాలుగు వైఖరీవాక్కు, పరమాత్మ నాలుగు వాక్కులు కలవాడు.  



పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 51వ.అధ్యాయము (ఆఖరి అధ్యాయం)

                                         విశాఖపట్నం
                                         22.02.1992

ప్రియమైన చక్రపాణి, 

శ్రీసాయిబాబా జీవిత చరిత్రములోని విశేషాలు, నా జీవితముపై శ్రీసాయి సత్ చరిత్ర ప్రభావమును తెలియచేస్తు నీకు వ్రాసిన ఉత్తరాలలో యిది ఆఖరి ఉత్తరము.  ఈఉత్తరము చదివేముందు 51వ.అధ్యాయము చదివి శ్రీసాయిని పూర్తిగా అర్ధము చేసుకో.  



ఈనిత్య పారాయణ ఫలాలను నేను పొందినాను.  ఆఫలాలు నీకు ఎంతో మేలు చేసినవి.  నీవు నీతోటివారు కూడా ఆఫలము మహత్యమును అనుభవించాలి అని మనసార కోరుచున్నాను.  ఈజన్మ అంతా శ్రీసాయి యిచ్చిన బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి (బా.ని.స.) గా గడపాలని కోరుకొంటున్నాను.  శ్రీసాయి సత్ చరిత్రలో ఫలశృతి వివరింపబడినది.  నేను 51వ. అధ్యాయము నిత్యపారాయణ చేసిన రోజున శ్రీసాయి ప్రసాదించిన ఫలాలు.

1) గుంటూరులో 51వ.అధ్యాయము చదివిన సమయములో అమెరికానుండి టెలిఫోన్ లో నా అన్నదాత శ్రీవారణాశి సూర్యారావుగారి ఆశీర్వచనాలు పొందినాను.

2) కొరియా దేశములో 51వ. అధ్యాయము చదివిన రోజు రాత్రి శ్రీసాయి బౌధ్ధ భిక్షువు రూపములో వెండి డాలరును నాకు బహూకరించినారు.

3) 27.06.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నీకు ఎం.సె.ట్. లో 1331వ ర్యాంక్ వచ్చినది. 

4) 14.08.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నీవు వాసవి యింజనీరింగు కాలేజీలో చేరినావు.

5) 23.03.91 నాడు 51వ.అధ్యాయము చదివినరోజున నాకొరియా దేశముయాత్ర కాగితాలుపై పైఅధికార్లు సంతకాలు చేసినారు.

6) ఈరోజు అంటే 22.02.92నాడు 51వ.అధ్యాయము చదివినాను.  శ్రీసాయి నాకుమార్తె వివాహము 10.05.92 ఆదివారము ఉదయము 6.58 నిమిషాలుకు జరుగును అని ముహూర్తము నిశ్చయించినారు.

శ్రీసాయి జీవితచరిత్ర నిత్యపారాయణ ఫలాలను నేను అనుభవించినాను.  ఈఉత్తరాలును శ్రధ్ధ - సహనముతో చదివిన ప్రతి ఒక్కరు శ్రీసాయి ఆశీర్వచనములు పొందగలరు.

శ్రీసాయి సేవలో 

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణిసాయి సమాప్తం   

శ్రీసాయితో మధుర క్షణాలు - 15 - బాబావారి కఫ్నీ

$
0
0


  
          

11.08.2013 ఆదివారము 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజున విజయవాడలో ఉన్నందువల్ల శ్రీవిష్ణుసహస్రనామం శ్లోకం, 
తాత్పర్యం అందిచలేకపోతున్నాను...  


శ్రీసాయితో మధుర క్షణాలు - 15

బాబావారి కఫ్నీ

బాబాగారు తన కఫ్నీ చిరిగిపోయి పాడయిపోయినప్పుడెల్లా దానిని యితరులకెవరికైనా యిచ్చివేసే బదులు దానిని ధునిలో కాల్చి బూడిద చేసేవారు.  దానిని ధునిలో కాల్చడానికి అది పాతబడిపోవాల్సిన అవసరమే లేదు.

ఒక్కొక్కసారి ఆయన కఫ్నీలను కొద్ది కాలమే ధరించినప్పటికి వాటిని కాల్చి బూడిద చేసేవారు. ఒకోసారి ఆయన వాటిని కుట్టుకొని బాగుచేసుకొని ధరిస్తూ ఉండేవారు.  సాయిబాబాగారి దుస్తులు చిరుగులు పట్టినపుడు, తాత్యాపాటిల్ వాటిని తన వేళ్ళతో యింకా చింపివేసేవాడు.

సాయిబాబా ఏభక్తుడినయినా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని భావించినపుడు, ఆ అదృష్టవంతునికి బాబావారి దుస్తులు ప్రసాదంగా లభించేవి.  బాబావారి దుస్తులలో అపారమయిన శక్తి నిండి ఉంది.  ఒక సారి సాయిబాబా తన కఫ్నీని మహల్సాపతికి బహుమతిగా యిచ్చారు. దానియొక్క ఫలితం ఏమిటంటే, మహల్సాపతి తాను మరణించే వరకూ సన్యాసిలా జీవించినా, తన కుటుంబ బాధ్యతలను సామాజిక అనుంబంధాలని నెరవేర్చాడు.

మరొక సంఘటనలో సాయిబాబా తన కఫ్నీని ముక్తారాం అనే భక్తునికిచ్చారు. కఫ్నీ బాగా మాసిపోయి ఉండటంవల్ల ముక్తారాం దానిని ఉతికి వాడా (ధర్మశాల) లో ఆరబెట్టాడు.  తరువాత ముక్తారాం బాబా దర్శనానికి వెళ్ళాడు.  కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో కఫ్నీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు.  కఫ్నీలోనించి ఈ విధంగా మాటలు  వినిపించాయి, "చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొనివచ్చి తలకిందులుగా ఆరబెట్టాడు".    

వామనరావు వెంటనే కఫ్నీని తీసి తాను ధరించాడు.  కఫ్నీని ధరించిన తరువాత వామనరావు ద్వారకామాయికి వెళ్ళాడు.  

కఫ్నీని ధరించిన వామనరావుని చూసి సాయిబాబా కోపోద్రిక్తులయ్యారు.  కాని, వామనరావు సన్యాసం తీసుకోవడానికి నిశ్చయించుకొన్నాడు.  ఈసంఘటన జరిగిన తరువాత సమయం వచ్చినపుడు వామనరావు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నాడు.

15, అక్టోబరు, 1918, మంగళవారమునాడు బాబావారు సమాధి చెందిన తరువాత బాబావారి పాత గుడ్డ సంచిని తెరచి చూశారు.  దానిని ఆయన ఎప్పుడూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు.  ఆసంచిలో ఆకుపచ్చ కఫ్నీ, ఆకుపచ్చ టోపీ కనిపించాయి.  వాటిని కాశీరాం అనే దర్జీ బాబాకిచ్చాడు.

బాబా వాటిని ధరించారు.  కాని, తరువాత తెల్లని దుస్తులను ధరించడానికే యిష్టపడ్డారు.  మిగిలిన వస్తువులతోపాటు, ఈ సంచికూడా బాబావారి సమాధిలోపల ఉంచారు.

నేటికీ షిర్దిడీలోని దీక్షిత్ వాడాలో "సాయిబాబా మ్యూజియం లో బాబావారి మరొక కఫ్నీని చూడవచ్చు. 

                    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
Viewing all 726 articles
Browse latest View live